జగ్గయ్యపేట , మార్చి 10: సృష్టి అంతా శివమయం అని తెలుసుకోవడమే శివరాత్రి పర్వదినంలోని ప్రత్యేకత అని తాత్వికులు గెంటేల వెంకటరమణ అన్నారు. శివరాత్రి సందర్భంగా ఆదివారం బలుసుపాడు గురుధామ్‌లో శివానంద భక్తబృందం ఆధ్వర్యంలో పలు దైవ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా దేవతా మూర్తుల చిత్రపటాలతో పల్లకీ సేవ నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పా టు చేసిన హోమాలు, పూర్ణాహుతి, శివకల్యాణం తదితర కార్యక్రమాల్లో వెంకట రమణ, వసంతలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. కొంకిమళ్ల శ్రీనివాసరావు, కొంకిమళ్ల విశ్వనాథం, అత్తలూరి వెంకటేశ్వర్లు, హైదరాబాదుకు చెందిన వెంకటేశ్వరరావు దంపతులు పీటలపై కూర్చోగా వందలాది మంది భక్తుల సమక్షంలో వేదపండితులు శివయ్య ఆధ్వర్యంలో శివకల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన సత్సంగంలో భక్తులకు వెంకట రమణ అనుగ్రహ భాషణ చేశారు. శివరాత్రి రోజున చేసే జాగరణ, ఉపవాసాలకు అర్థం వివరించారు. సంప్రదాయ కార్యక్రమాల ద్వారా భగవంతుడికి సాన్నిహిత్యం కావచ్చని, శివరాత్రి రోజున ఒక మారేడు దళం సమర్పించి శివనామస్మరణ చేస్తే ఏడాది కాలం చేసిన పూజల ఫలం దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని పలు ప్రదేశాల నుండి గురుకుటుంబ సభ్యులు విచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా వారికి వెంకట రమణ విభూతి పొట్లాలను, కల్యాణ అక్షింతలు అందజేసి ఆశీర్వదించారు.
వైభవంగా శ్రీ పాతాళ
భోగేశ్వరస్వామి కల్యాణం
కలిదిండి, మార్చి 10: కలిదిండి శివారు భోగేశ్వరలంకలో వేంచేసి వున్న శ్రీ పార్వతీ సమేత శ్రీ పాతాళ భోగేశ్వరస్వామి కల్యాణం ఆదివారం తెల్లవారుఝామున వైభవంగా జరిగింది. అడవి బాలకృష్ణ, కుమారి దంపతులచే వంశపారంపర్య అర్చకులు ఐలూరి పాపారావు స్వామివారి కల్యాణం నిర్వహించారు. సర్వోపచారాలు పూర్తిచేసి సుముహూర్తం సమయంలో జీలకర్ర బెల్లం, మంగళ సూత్రధారణ జరిపారు. శనివారం అర్థరాత్రి నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలోని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో సుమారు 3లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారని, గత ఏడాదికన్నా ఈ సంవత్సరం భక్తులు పెరిగారని నిర్వాహకులు తెలిపారు. కోనేరు వద్ద పితృదేవతలకు పిండప్రదానం చేశారు. మహిళలు పొంగలి నైవేద్యం సమర్పించారు. కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, వైఎస్‌ఆర్‌సీపి నియోజకవర్గ కన్వీనర్ దూలం నాగేశ్వరరావు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పోరు జార్జిరాజు సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు.
హరహర మహాదేవ.. శంభో శంకర..
కూచిపూడి, మార్చి 10: హరహర మహాదేవ శంభో.. అన్న భక్తుల నామస్మరణలతో మొవ్వ మండలంలోని శైవాలయాలు మారుమోగాయి. మహాశివరాత్రి సందర్భంగా స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, పెదపూడి గంగాపర్వత వర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, అయ్యంకి, మొవ్వ భీమేశ్వరాలయం, కాజ, కోసూరు, గూడపాడు, యద్దనపూడి, నిడుమోలు గ్రామాల్లోని శైవాలయాలు తెల్లవారుఝామున 4గంటల నుండే భక్తులతో కిటకిటలాడాయి. ఈసందర్భంగా ఆలయాల్లో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, క్షీరాభిషేకాలను, పండితుల వేదమంత్రాల మధ్య అర్చకులు బిళ్వార్చనలను నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పసుమర్తి కేశవప్రసాద్ పర్యవేక్షణలో లింగోద్భవ సమయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ప్రముఖ శైవక్షేత్రం, ఉభయ రామేశ్వర క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన ఐలూరులో వేంచేసిన శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. ఈసందర్భంగా ఉయ్యూరు, విజయవాడ, మచిలీపట్నం, అవనిగడ్డ నుండి దాదాపు 100 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయటంతో ఐలూరు భక్తులతో కిటకిటలాడింది. నాగేశ్వర స్వామివారికి తెల్లవారుఝాము నుండి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. విజయవాడ సిటీ పోలీసులు తగినంత సిబ్బందిని నియమించకపోవటంతో భక్తులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. కృష్ణానదిలో స్నానానికి తగినంత నీరు లభ్యంకాకపోవటంతో భక్తులు జల్లెడ స్నానాలు చేశారు. సత్యసాయి సేవాసమితి భక్తులకు విశేష సేవలందించారు. ఐలూరు గ్రామంలోని ఆర్యవైశ్య, బ్రాహ్మణ క్షేత్రాల్లో భక్తులకు అన్నసమారాధన చేశారు.
భక్తులతో పోటెత్తిన నాగులేరు
మచిలీపట్నం , మార్చి 10: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్థానిక చింతగుంటపాలెం నాగులేరు (మంచినీటి కాలువ) ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 60వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కాలువలో నీటిమట్టం తక్కువగా ఉన్నందున పురపాలక సంఘం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి బోర్ల ద్వారా జల్లు స్నానాలకు ఏర్పాటు చేసింది. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు భక్తిశ్రద్ధలతో పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. మహిళలు మూసి వాయినాలు తీర్చుకున్నారు. మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా తాత్కాలిక గదులు, లైటింగ్, తాగునీరు, ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. పట్టణ సిఐ మురళీధర్, టౌన్ ఎస్‌ఐ రామకృష్ణ, ఇనగుదురు ఎస్‌ఐ గంగాధర్ ఆధ్వర్యంలో 30మంది పోలీస్ కానిస్టేబుళ్లు, పది మంది హెడ్ కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించారు. పురపాలక సంఘం ప్రత్యేక అధికారి ఎన్ రమేష్ కుమార్, కమిషనర్ ఎస్ శివరామకృష్ణ, వివిధ శాఖల సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.