ఇంద్రకీలాద్రి, మార్చి 10: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగరంలోని వివిధ శైవ పీఠాల్లో ఆదివారం రాత్రి స్వామివార్ల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈమహోత్సవానికి తిలకించటానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీమల్లేశ్వరస్వామివార్ల ఆలయంలో రాత్రి శ్రీ గంగాపార్వతీ సమేత శ్రీమల్లేశ్వర స్వామివార్ల వార్షిక లీలా కల్యాణాన్ని అర్చకస్వాములు అత్యంత నియమనిష్ఠలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం రీజనల్ జాయింట్‌కమిషనర్ కె ప్రభాకర శ్రీనివాస్ దంపతులను కూర్చొబెట్టి తర్వాత వందలాది మంది కల్యాణ దాతలను ఒక వరుసక్రమంలో కూర్చొబెట్టి అర్చకస్వాములు వైభవోపేతంగా స్వామవార్ల కల్యాణమహోత్సవాలను నిర్వహించారు. స్వామివార్ల సన్నిధిలో పాంచాహ్నిక దీక్షా పూర్వకం మహోత్సవాలు ఈనెల 7నుండే అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులోభాగంగా ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో వివిధ ప్రత్యేక వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా ఉదయం 9గంటలనుండి 11గంటల వరకు ప్రాతఃకాల అర్చన, హోమాలు జరిగాయి. సాయంత్రం 5 గంటల నుండి నిత్యహోమాలు నిర్వహించారు. రాత్రి 10గంటల నుండి అర్ధరాత్రి 12-30గంటల వరకు లింగోద్భవ కాలంలో స్వామివార్లకు వివిధ రకాలైన పండ్ల రసాలతో ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత 12-30గంటల నుండి 11మంది ఋత్వికులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పిఎ సాయిప్రసాద్, పిఆర్‌ఓ శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు, ఎపిఆర్‌ఓ కె బలరామ్, సిసి యం సుబ్రహ్మణ్యం,తదితరులు పాల్గొన్నారు. అశోక స్తంభం ఎదుట ఉన్న శ్రీవిజయేశ్వరస్వామివారి దేవస్థానంలో రాత్రి 11గంటలకు స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఉభయదాతలను స్వామివారి ముందు కూర్చోబెట్టి అర్చకస్వాములు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులోభాగంగా సాయంత్రం 6-30గంటలకు జగన్‌జ్యోతి, సాయంత్రం 7-30గంటలకు ఎదురుకోల ఉత్సవం, తదితర కార్యక్రమాలను జరిగాయి. ఈసందర్భంగా ఆలయ సీనియర్ ఉద్యోగి శేషు కల్యాణ దాతలకు స్వామివారి ప్రత్యేక ప్రసాదాలను పంపిణీ చేశారు. ధర్మరాజు చేత ప్రతిష్టింపబడిన శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామివార్ల దేవస్ధానం (పాతశివాలయం)లో ఆదివారం రాత్రి 12గంటలకు దేవస్థానం ఇవోనేల సంధ్య ఆదేశాల మేరకు ఆలయ ప్రధాన అర్చకస్వామి రాచకొండ సుమంత్‌శర్మ ఆధ్వర్యంలో శ్రీగంగాభ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి, శ్రీ భధ్రకాళీ, వీర భద్ర స్వామివార్లకు కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ కాజాలక్ష్మీవెంకట మోహనరావు,్ధర్మకర్తలు పులిచేర్ల రమేష్‌బాబు, జల్లూరు నాగ శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాత్రి 12గంటలకు జరిగిన లింగోద్భవ సమయంలో అభిషేక పండిట్ రాంపల్లి సీతారామాంజనేయుల ఆధ్వర్యంలో స్వామివార్లకు మహాన్యాస పూర్వక ఏకదశరుద్రాభిషేకం జరిగింది. ఇదేవిధంగా నగరంలోని వివిధ శైవ పీఠాల్లో స్వామివార్ల కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి.హరోంహరకంకిపాడు, మార్చి 10: పెనమలూరు మండలంలోని యనమలకుదురు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం అశేష భక్తజనం సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అభిషేకాలు చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుండే భక్తులు నదీ స్నానం ఆచరించి కాలం చేసిన పెద్దలకు పిండ ప్రదాన కార్యక్రమాలు పూర్తి చేసి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజాకార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు. దేవస్థాన ప్రభను గ్రామానికి చెందిన వెలగపూడి వెంకటేశ్వరరావు రూ. 2.60 లక్షలకు పాట పాడి దక్కించుకున్నారు. రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ, సిపి మధుసూదనరెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ నాయకుడు సంగా నరసింహరావు, తహశీల్దార్ విజయకుమార్, సిఐ ధర్మేంద్ర తదితరులు ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం స్వామి వారిని డప్పు వాయిద్యాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించారు. సమీప గ్రామాల నుండి భారీ సంఖ్యల్లో ప్రభలను ఊరేగింపుగా ఆలయాన్ని సందర్శించారు. విద్యుత్ అలంకారాలతో, డప్పువాయిద్యాలతో, కోలాటం, భజనలు భేతాళవేషాలు, కోయ, హిరాణిక నృత్యాలతో ప్రభలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకలకు హాజరైన భక్తులకు సకల సౌకర్యాలు ఆలయ కమిటీ కల్పించింది.
పొలాల్లో పాలరాతి శిల్పాలు లభ్యం
మైలవరం, మార్చి 10: మండలంలోని పొందుగల పొలాల్లో పాలరాతి శిల్పాలు లభ్యమయ్యాయి. అటవీ శాఖకు చెందిన భూమి కొంతకాలంగా ఒక రైతు అధీనంలో ఉంది. ఈభూమిలో ఇటీవల గ్రామానికి చెందిన సుగాలీలు ఆక్రమించుకుని అందులో ఉన్న చెట్లు, పుట్టలను కొట్టి సాగుకు అనుకూలంగా బాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోభూమిలో ఉన్న చెట్లను తవ్వుతుండగా భూమిలో దాదాపు 10 అడుగుల పొడవు, రెండడుగుల వెడల్పు ఉన్న పాలరాతి శిల్పాలు, దేవాలయ ముఖ ద్వారాలు లభ్యమయ్యాయి. ఈవిషయం తెలిసి ఇక్కడ నిధులు ఉండి ఉంటాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో గుప్త నిధులున్నాయనే అనుమానంతో కొందరు అర్ధరాత్రి సమయంలో తవ్వకాలు జరిపి విఫలమైన సంఘటనలున్నాయి. ఈభూమిలో అనేక చోట్ల పాలరాతి శిల్పాల ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కొందరు ఇదే ప్రాంతంలో పూజలు కూడా నిర్వహించారు. ఇక్కడ ఏదైనా దేవాలయం ఉండి ఉంటుందని లభించిన ఆనవాళ్ళను బట్టి తెలుస్తోంది. ఇంకా బయటపడే అవకాశముందని చెబుతున్నారు. గ్రామానికి చెందిన అజ్మీర వశరాం అనే గిరిజన యువకుడు ఈభూమిని బాగుచేసే క్రమంలో ఇవి బయట పడ్డాయి. ఈపాలరాతి ముఖ స్తంభాలపై అందమైన నగిషీలు, సింహం, నంది బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. కాగా ఈవిషయాన్ని స్థానిక తహశీల్దార్ జి వరహాలయ్య దృష్టికి తీసుకుపోగా ఆయన వెంటనే స్పందించారు. పురావస్తుశాఖ అధికారుల దృష్టికి తీసుకుపోగా ఆయన ఈనెల 11న వచ్చి వాటిని పరిశీలించి దీనిపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారని తహశీల్దార్ వివరించారు.