ఇబ్రహీంపట్నం, మార్చి 10: భార్యకు వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన సంఘటన కొండపల్లి ప్రాంతంలో ఆదివారం జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం నందిగామ మండలం చెరుకుమసిపాలెంకు చెందిన బాణావత్ వెంకటేశ్వరరావుకు జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామానికి చెందిన కుమారితో వివాహం కాగా వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. కాని భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త ఆమెను రోజు మానసికంగా, శారీరకంగా వేధించసాగాడు. రోజు మద్యం తాగి భార్యను కొట్టడం, చిత్రహింసలకు గురిచేయటం వంటి చర్యలకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం పుల్లలకని కట్టుబడిపాలెం నుండి ల్యాంకో వద్దకు వెళ్లిన సమయంలో భార్యను గొడ్డలితో మెడపైన, గుండెలపైన దారుణంగా నరికి హత్యచేసి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. మృతురాలికి 5వ, 6వ తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. శవాన్ని శవపరీక్షకై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఎస్‌ఐ మహేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాలికపై అత్యాచారం
కుదరని రాజీలు... ఐదు రోజుల తర్వాత ఫిర్యాదు
పాతబస్తీ, మార్చి 10: సొంత మేనమామ కూతురు (12)పై ఓ బాలుడు ఐదు రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడగా తర్జన భర్జనలు అనంతరం రాజీ కుదరకపోవడంతో చివరకు ఆదివారం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మల్లిఖార్జునపేట ఉప్పరవాగుకు చెందిన ముద్దరబోయిన వెంకటసాయి (17) ఈ నెల 5వ తేదీన తన మేనమామ శ్రీను కుమార్తె (12) వంటరిగా ఇంట్లో ఉండగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయం ఈ ఘాతుకం జరిగేప్పుడు రెండువైపుల కుటుంబ సభ్యులూ వారివారి పనులమీద బయటకు వెళ్లారు. బాధితురాలి తల్లి తన కుమార్తె నలతగా ఉండడాన్ని గమనించి గుచ్చిగుచ్చి అడిగి విషయాన్ని రాబట్టింది. దాంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలు రేగాయి. పెద్దలు కల్పించుకుని రాజీ కుదిర్చారు. వారికి మైనార్టీ తీరాక వివాహం చెయ్యాలనే ప్రతిపాదనను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో సమస్య మరుగునపడింది. కాగా ఉన్నట్టుండి ఆదివారం ఉదయం బాలిక తల్లిదండ్రులు మనసు మార్చుకుని పోలీసులను ఆశ్రయించారు. దాంతో మరోమారు కులపెద్దలు, బంధువులు జోక్యం చేసుకుని రాజీ మార్గం కోసం యత్నించారు. పోలీసులు అంగీకరించలేదు. కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.