ఇంద్రకీలాద్రి, మార్చి 10:మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం పుష్కర ఘాట్ (స్నానాలరేవు)లో ‘హర హర మహదేవ శంభో శంకర’ అంటూ భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం రీజనల్ జాయింట్ కమిషనర్ కె ప్రభాకర శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆలయ సిబ్బంది ఘాట్‌లో భక్తులకు కావాల్సిన అన్ని రకాలైన వౌలిక సదుపాయాలను కల్పించటంతో జిల్లా, నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చి భక్తుల్లో అధిక శాతం ప్రత్యేకంగా ఈఘాట్‌కే వచ్చి పవిత్రస్నానాలు ఆచరించటం విశేషం. ఆదివారం రావటంతో పవిత్ర స్నానాలు ఆచరించటానికి భక్తులు వేకువ జామున 3 గంటల నుండే పవిత్ర కృష్ణానదికి తరలి వచ్చారు. రాను రాను భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేసిన దుర్గగుడి ఇబ్బంది ఘాట్ మెయిన్‌గేట్‌ను వేకువ జామున 3 గంటలనుండే తెరచి భక్తులను స్నానాలు ఆచరించటానికి అనుమతించారు. 3 గంటలకు ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం సుమారు ఒంటి గంట వరకు కొనసాగింది. ఆదివారం ప్రచండభానుడు తీవ్రరూపాన్ని చూపిస్తున్నప్పటికీ భక్తులు లెక్కచేయకుండా కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని పవిత్రస్నానాలు ఆచరించటానికి తరలి వచ్చారు. భక్తులను దృష్టిలో పెట్టుకొని పుష్కరఘాట్ మెయిన్‌గేట్ నుండి ప్రకాశం బ్యారేజీ మీద ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం వరకు ప్రత్యేక క్యూమార్గాన్ని దుర్గగుడి సిబ్బంది ఏర్పాటు చేసి భక్తులను ఘాట్‌లో రద్దీని దృష్టిలో పోలీసులు భక్తులను దశల వారీగా ఘాట్‌లోనికి వదిలిపెట్టటంతో భక్తులు ఎటువంటి తోపులాట లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పవిత్రస్నానాలు ఆచరించారు. ఘాట్‌లో భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా మహిళలు బట్టలు మార్చుకునే వసతి, ఉచిత మంచినీటి సౌకర్యం, వైద్యశిబిరం, ఉచితక్లోక్ రూమ్, షవర్ బాత్‌ల ఏర్పాటు, గజఈతగాళ్ళ ఏర్పాటు, అదనపు సిబ్బంది, వారితోపాటు నిరంతరం సత్యసాయిసేవాసమితి కార్యకర్తలు, యన్‌సిసి విద్యార్ధులు, తదితరులను విస్తృతస్థాయిలో వివిధ రూపాల్లో భక్తులకు సేవలు అందించారు. ఈఘాట్‌లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొంటూ దుర్గగుడి అధికారులు నిరంతరం ఈ ఘాట్‌పై పర్యవేక్షణ నిర్వహించటంతో ఆదివారం ఘాట్‌లో ఎటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగలేక పోవటంతో దుర్గగుడి అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు, వివిధ శాఖలకుచెందిన అధికారులు గత రెండు రోజుల క్రితమే తనిఖీలు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదేవిధంగా పున్నమిఘాట్, భవానీపురం, తదితర ఘాట్‌ల్లో సైతం దేవస్థానం ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు చేయటంతో భక్తులు ఆ ఘాట్‌ల్లో పవిత్రస్నానాలు ఆచరించారు. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్ళించటంతో భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో దుర్గ ఘాట్‌లో పవిత్రస్నానాలు ఆచరించి సమీపంలో ఉన్న శ్రీవిజయేశ్వరస్వామివార్ల దేవస్ధానం, శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం (పాతశివాలయం), బ్రాహ్మణవీధిలోని శ్రీ వసంతమల్లిఖార్జున స్వామివార్ల దేవస్థానం, కృష్ణలంకలోని శివాలయం, తదితర అలయాల్లో కొలువై ఉన్న స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు,అర్చనలు,తదితర వాటిని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు.
స్కేటింగ్‌లో ఔరా అనిపించిన వైష్ణవి
విజయవాడ , మార్చి 10: బెజవాడ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఇన్నర్ రింగ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన స్కేటింగ్ ప్రదర్శనలో భాగంగా చిన్నారి గడ్డం వైష్ణవి స్కేటింగ్ చేస్తూ కారు కింద నుండి వెళ్లడం అందరినీ ఆకట్టుకుంది. అట్‌కిన్‌సన్ స్కూల్‌లో 1వ తరగతి చదువుతున్న వైష్ణవి కోచ్ ఎండి కబీర్ వద్ద స్కేటింగ్ శిక్షణ పొందుతోంది. అతి చిన్న వయస్సులో చక్కని ప్రతిభ చూపిన వైష్ణవిని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు మల్లాది విష్ణు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు, యువజన కాంగ్రెస్ నాయకులు దేవినేని అవినాష్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌతంరెడ్డి, అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వై శ్రీనివాసరావు, బి మురళీకృష్ణ తదితరులు అభినందించారు.