నెల్లూరు, మార్చి 9: అరవై సంవత్సరాలు పైబడిన మహిళలు పొదుపుసంఘాలకు నాయకత్వం వహించడం తగదంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో మహిళా సంఘాల్లో అలజడి రేగుతోంది. ఇప్పటికే ఊరూరా పొదుపుసంఘాలు విస్తృతంగా పాదుకుపోవడం తెలిసిందే. ఇందులో అరవై సంవత్సరాలు దాటిన మహిళల్ని ఉన్నఫలంగా నాయకత్వ హోదా నుంచి తొలగిస్తుండటంతో చాలామంది ఆ పదవుల్లో కొనసాగడానికి వయస్సు నకిలీ ధ్రువీకరణ పత్రాలు తెచ్చేపనిలో పడ్డారు. ఇలాంటి పరిణామాలపై పొదుపుసంఘాల్లో మరింత దుమారం రేపుతోంది. పొదుపుమహిళలకు సంబంధించి విద్యార్హత తాలుకు ధ్రువీకరణ పత్రాల్లేవు. కొద్దిమేర అక్షరాజ్ఞనమే తప్ప ధ్రువీకరణ పత్రాలు పొందేంతటి (కనీసం పదవ తరగతి) వరకు చదివిన మహిళలు బహుస్వల్పం. దీంతో విద్యార్హత ధ్రువీకరణ పత్రాల ద్వారా వయస్సు నిర్ధారణ అయ్యే అవకాశాల్లేకుండా పోయాయి. రేషన్ కార్డుల్లో వయస్సు ధ్రువీకరణ ఉంటున్నా వాటిపై నమోదైన వయస్సుతో నిమిత్తం లేదని, తప్పులు దొర్లాయంటూ ప్రభుత్వమే పేర్కొంటోంది. దీనికి ప్రత్యామ్నాయంగా తాజాగా వైద్యులచే నిర్ధారించే క్రమంలో పొదుపుమహిళలు చాలామంది అరవై ఏళ్లకు లోబడినట్లుగా నకిలీ ధ్రువీకరణ చేయిస్తున్నారు.
రుణమాఫీ వదంతులతో రికవరీల్లో జాప్యం
బకాయిదార్ల ఫోటోల్ని పత్రికల్లో ప్రచురించే పద్ధతికి వెళ్లబోము
* సిండికేట్ బ్యాంక్ జనరల్ మేనేజర్ భట్
నెల్లూరు, మార్చి 9: తమ సంస్థకు రావాల్సిన బకాయిల్లో వ్యవసాయానికి కేటాయించిన రుణాలే అధికంగా ఉన్నాయని సిండికేట్ బ్యాంక్ రికవరీల విభాగం జాతీయ జనరల్ మేనేజర్ ఐఎన్‌ఆర్ భట్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మరో పర్యాయం రుణమాఫీ ప్రకటించవచ్చనే ప్రచారం కూడా తమ రుణ రికవరీల్లో జాప్యానికి ఓ కారణంగా ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం నెల్లూరు నగరంలోని గోల్డెన్ జూబ్లిహాల్‌లో రీజినల్ పరిధిలోని మూడు జిల్లాల సిండికేట్ బ్యాంక్ బ్రాంచి మేనేజర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనను కలసిన విలేఖర్లతో మాట్లాడుతూ తమ బ్యాంక్‌కు వ్యవసాయ రుణాలు 2,100 కోట్ల రూపాయల వరకు రావాల్సి ఉందన్నారు. కరవుపరిస్థితులతోపాటు మాఫీ ప్రచారం కూడా బకాయిల వసూళ్లకు గుదిబండగా పరిణమిస్తున్నాయని వివరించారు. కాగా, మొండి బాకీదార్లగా మారిన రుణగ్రహీతల ఫోటోలను పత్రికల్లో ప్రచురించడం ద్వారా వసూళ్లను కఠినతరం చేసే కోణంలో సిండికేట్ బ్యాంక్ వ్యవహరించదన్నారు. ఆ పద్ధతి కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ప్రస్తుతం అనుసరిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సిండికేట్ బ్యాంక్ బ్రాంచిలు మూడువేల వరకు ఉన్నాయన్నారు. ఏటిఎంలు 2,880 వరకు ఉన్నాయని వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకం అమలు దృష్ట్యా ప్రతి బ్రాంచికి అనుబంధంగా ఏటిఎం ప్రారంభించాలనే ఆదేశాల దృష్ట్యా మిగిలిన 120 ఏటిఎం కేంద్రాలను కూడా అనతికాలంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇదిలాఉంటే గత డిసెంబర్ నెలతో తమ బ్యాంక్ మూడులక్షల కోట్ల రూపాయల లావాదేవీలతో భారీ బ్యాంక్‌ల గ్రేడ్‌లోకి చేరుకుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేశశ్యాప్తంగా మరో వెయ్యి నుంచి 15వందల వరకు నూతన బ్రాంచిలు స్థాపించే దిశగా ఉన్నామని వివరించారు. రీజియన్ (నెల్లూరు, ప్రకాశం, చిత్తూరుజిల్లాల) డిప్యూటీ జనరల్ మేనేజర్ మోహనరెడ్డి మాట్లాడుతూ తమ పరిధిలో 140 కోట్ల రూపాయల వరకు రుణ బకాయిలు వసూలు కావాల్సి ఉందన్నారు. ఈ నెల 11 నుంచి 16వరకు తమ సంస్థ బృహత్ సిండ్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా బకాయిదార్లకు ఒన్‌టైమ్ సెటిల్‌మెంట్ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎల్‌డిఎం టి వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు.
సిపిఎం ప్రచార జాత
నెల్లూరు, మార్చి 9: ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోర వైఫల్యం చెందుతున్నాయంటూ సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార జాత కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం ఉదయం నగరంలోని వేదాయపాళెం కూడలి నుంచి ప్రారంభమైన ఈ జాతా నిప్పో, కరెంట్ ఆఫీస్ సెంటర్, రాజరాజేశ్వరిగుడి, పెద్దాసుపత్రి, కొండాయపాళెం గేట్ కూడలి, బొల్లినేని, కెవిఆర్ పెట్రోల్ బంకు సెంటర్, ఆర్టీసి, మద్రాస్‌బస్టాండ్, విఆర్ కూడలి, గాంధీబొమ్మ కూడలి మీదుగా ఆత్మకూరు బస్టాండ్ వరకు చేరుకుంది. వివిధ కూడళ్లలో సిపిఎం నేతలు ప్రజాసమస్యలపై తమ వాణి వినిపించారు. పాలకుల తీరునుద్దేశించి తూర్పారబెట్టారు.
మా బిడ్డల్ని స్వచ్ఛందంగానే పంపాము
అయ్యోర తప్పేమి లేదు
నెల్లూరు, మార్చి 9: కోట మండలం గోవిందపల్లి పంచాయతీలో ఈ నెల 6న లెదర ఇండస్ట్రీస్ ఏర్పాటుపై నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణకు తమ సంతతిని స్వచ్ఛందంగానే తీసుకొచ్చామంటూ కోట మండలం గోవిందంపల్లి గ్రామ ప్రజానీకం పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. కొంతమంది గ్రామ నేతల ప్రోద్బలంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల్ని పంపించారనడంలో వాస్తవం లేదన్నారు. తప్పుడు సమాచారంతో ప్రధానోపాధ్యాయునిపై నాన్‌బెయిలబుల్‌కేసు నమోదు చేయడం దారుణమన్నారు. తమంతట తామే ప్రధానోపాధ్యాయుల వద్దకు వెళ్లి తమ బిడ్డల్ని ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనేలా చేశామన్నారు. అందువల్ల ఇందుకు సంబంధించి బనాయించిన నాన్‌బెయిలబుల్ కేసులు వెంటనే ఉపసంహరించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో గోవిందంపల్లి హైస్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఐ ఏడుకొండలు, ఎం బాలయ్య, కె బాలయ్య, ఎం ఉజ్జయ్య, కె మస్తానయ్య, ఎంబేటి కృష్ణయ్య, ఏ పార్ధయ్య, కె రమణయ్య, కె చిన్న మస్తానయ్య, ఐ సాయి, ఎం గిరి, తదితర 55 మంది సంతకాలతో ఈ వినతిపత్రాన్ని సమర్పించారు.
వైఎస్‌ఆర్‌సి కేడర్ సంబరాలు
రాపూరు, మార్చి 9: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తల్లో ఒకరిగా ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు నియమితులు కావడం ఆ పార్టీ రాపూరు శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. శనివారం భారీస్థాయిలో బాణాసంచా పేల్చడంతో సహా స్థానికులకు స్వీట్లు పంచిపెట్టి తమ హర్షాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు బత్తిన పట్ట్భారామిరెడ్డి నేతృత్వం వహించారు. తమ పార్టీ అధినేత జగన్, రాష్ట్ర కమిటీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు గంగిశెట్టి వెంకటేశ్వర్లు, గుండు రాఘవయ్య, జయరామయ్య, టి హరగోపాల్‌తో సహా పట్టణానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు షేక్ ఖాదర్‌బాషా, తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షల్లో మరో ఇద్దరు డీబార్
నెల్లూరు, మార్చి 9: ఇంటర్ మీడియట్ పరీక్షల్లో డీబార్‌ల పర్వం కొనసాగుతోంది. శనివారం జరిగిన ఇంటర్ మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీషు పరీక్షల్లో వెంకటగిరిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థి డీబార్ అయ్యారు. ఆత్మకూరు పట్టణంలోని షిర్డిసాయిరామ్ పరీక్షా కేంద్రంలో మరొకరు డీబార్ అయ్యారని ఇంటర్‌మీడియట్ బోర్డు నెల్లూరు రీజియన్ అధికారి వై పరంధామయ్య వెల్లడించారు. శనివారం జిల్లావ్యాప్తంగా 24,908 మంది విద్యార్థులకుగాను 975 మంది గైర్హాజరయ్యారని ఆర్‌ఐఓ చెప్పారు. మిగిలిన 23,933 మందిలో ఇద్దరు డీబార్ అయినట్లు వివరించారు. కాగా, తమ పరిశీలన కమిటీ మొత్తం 93 కేంద్రాలకుగాను 72 కేంద్రాల్ని సందర్శించినట్లు తెలిపారు.