నెల్లూరు, మార్చి 9: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధిష్ఠానం నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిలు లేని చోట్ల సమన్వయకర్తల నియామకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఇన్‌చార్జిలు లేని చోట్ల సమన్వయకర్తలతోనే ఎన్నికల వ్యూహానికి పదును పెట్టాలని ఆ పార్టీ పెద్దలు భావించారు. ప్రధానంగా వివిధ నియోజకవర్గాల్లో ఒకరు కంటే ఎక్కువ సంఖ్యలో పార్టీ తరఫున ఆశావహులు తయారైనందున అలాంటి పరిస్థితిని అధిగమించేందుకే సమన్వయకర్త పదవుల పందారానికి పూనుకున్నట్లు భోగట్టా. ఈ క్రమంలో తిరుపతి లోక్‌సభస్థానం పరిధిలో ఉన్న జిల్లాకు చెందిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు తాజాగా సమన్వయకర్తలు నియమితులయ్యారు. నెల్లూరుజిల్లాలో తిరుపతి లోక్‌సభ స్థానానికి సంబంధించి నాలుగు నియోజకవర్గాలుండగా మూడింటికి మాత్రమే ఇప్పుడు సమన్వయకర్తల్ని నియమించారు. అందులో సర్వేపల్లి నియోజకవర్గానికి జిల్లా పార్టీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న కాకాణి గోవర్దనరెడ్డిని సమన్వయకర్తగా నియమించారు. గూడూరు నియోజకవర్గానికి పోటాపోటీ ఆశావహులుగా తయారైన మాజీ మున్సిపల్ చైర్మన్ పాశం సునీల్‌కుమార్, రిటైర్డ్ డిఐజి కె బాల చెన్నయ్యలిద్దరినీ సమన్వయకర్తలుగా ప్రకటించడం గమనార్హం. వెంకటగిరి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి తనయుడు గౌతమ్‌రెడ్డిలను సమన్వయకర్తలుగా నియమించారు. ఆత్మకూరు నుంచి వెంకటగిరి నియోజకవర్గానికి వలస వచ్చిన కొమ్మికి తనతోపాటు గౌతమ్‌ను కూడా సమన్వయ కర్తగా నియమించడం వెనుక స్థానిక పార్టీ పెద్దల రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. కొమ్మి వెంకటగిరికి వచ్చినా ఆయనకు ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న బలమైన కేడర్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు దూరం కారాదనే ముందు జాగ్రత్త తీసుకున్నట్లు అంచనా. అందుకోసమే వెంకటగిరిలో కొమ్మితోపాటు గౌతమ్‌ను కూడా సమన్వయకర్తను చేశారని తెలుస్తోంది. ఇదిలాఉంటే జిల్లాలో ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాలకు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలున్నారు. నెల్లూరు నగర ఇన్‌చార్జిగా అనిల్‌యాదవ్‌ను గతంలో ప్రకటించి ఉన్నారు. కావలి, ఆత్మకూరు నియోజకవర్గాలకు వరుసగా అక్కడి నేతలైన రామ్‌రెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌సి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిల్ని నియమించే అవకాశాలున్నాయి. అయితే ప్రధానంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కనీసం ఇద్దరు సమన్వయకర్తల్ని నియమించే అవకాశాలున్నాయి. వైఎస్‌ఆర్‌సి కృష్ణా జిల్లా పరిశీలకునిగా వ్యవహరిస్తున్న కోటంరెడ్డి శ్రీ్ధరరెడ్డి, నెల్లూరు నగర పార్టీ కన్వీనర్ ఆనం వెంకట రమణారెడ్డిలను నియమించనున్నారు. అయితే సదరు నేతల నడుమ సమన్వయమే లేదు. వీరిద్దరూ సమన్వయకర్తలైనా పార్టీ వ్యవహారాల్ని ఒక కొలిక్కి తీసుకురావాలంటే అతిశయోక్తే.
నగరంలో రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు
నెల్లూరు , మార్చి 9: వందేళ్ల చలన చిత్రంలో ప్రజా అభిమాన నటుడు ఎన్టీఆర్ అని ఐబిఎన్ లైవ్ సర్వేలో తేలడంతో శనివారం అఖిల భారత ఎన్‌టిఆర్ అభిమాన సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నర్తకి సెంటర్‌లోని ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాల వేసి టపాకాయలు పేల్చి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రమేష్‌రెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ భారతీయ సినిమాకు వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఐబిఎన్ లైవ్ సంస్థ నిర్వహించిన సర్వేలో బాలీవుడ్ దిగ్గజాలను సైతం వెనక్కి నెట్టి ఎన్టీఆర్ నెంబర్ వన్‌గా నిలిచారన్నారు. రాముడిగా, కృష్ణుడిగా వెండితెర వేలుపుగా అవతరించిన ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్‌టిఆర్ తిరుగులేని కథానాయకుడని స్పష్టమైందన్నారు. భారతదేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన ఏకైక నటునిగా ఎన్‌టిఆర్ నిలవడం ఆయన అభిమానులకే కాదని, యావత్ తెలుగువారికే ఆనందకరమన్నారు. అనంతరం టపాకాయలు పేల్చి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రూరల్ కన్వీనర్ కిలారి వెంకటస్వామినాయుడు, నాయకులు వైవి సుబ్బారావు, ధర్మవరపు సుబ్బారావు, మండవ రామయ్య, ఉచ్చి భువనేశ్వరప్రసాద్, పడవల కృష్ణమూర్తి, భాలకృష్ణచౌదరి, బాలాజీ, మోహిద్దీన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
జాబ్‌మేళా
నెల్లూరు, మార్చి 9: రాజీవ్ యువకిరణాలలో భాగంగా ఐటిఐ పాస్ అయిన నిరుద్యోగులకు ఎలక్ట్రికల్, మోటార్ మెకానిక్, డీజీల్ మెకానిక్, ఫిట్టర్ ఇతర ట్రేడ్‌లలో పాసైన నిరుద్యోగులకు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఉదయ భారతి శనివారం ఒకప్రకటనలో తెలిపారు. ఈ నెల 12న వెంకటేశ్వరపురం ఐటిఐ కళాశాల ఆవరణలో ఇంటర్వూలు నిర్వహిస్తామన్నారు. 14న ఐటిఐ కళాశాల వెంకటగిరిలో ఇంటర్వూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 15న ఐటిఐ కళాశాల గూడూరులో ఇంటర్వూలు ఉంటాయన్నారు. ఉదయం 11 గంటల నుంచి ఇంటర్వూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ జాబ్‌మేళాకు వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఇంటర్వూ హాజరై నిరుద్యోగులు వారితో పాటు సర్ట్ఫికెట్లు, రేషన్ కార్డు జెరాక్స్, రెండు ఫోటోలను తీసుకుని రావాలని సూచించారు.
పారిశుద్ధ్య పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
ఎమ్మెల్యే ముంగమూరు హెచ్చరిక
నెల్లూరుసిటీ, మార్చి 9: పారిశుద్ధ్య పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని నెల్లూరుసిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి హెచ్చరించారు. శనివారం 14వ డివిజన్‌లోని మల్లపుకాలువ పూడిక తీత పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నీటి పారుదల కాలువ అయిన మల్లపుకాలువ ఎన్నో వేల ఎకరాలకు నీరు అందిస్తుండేదని ప్రస్తుతం ఆక్రమణలకు లోనై కుచించుకు పోయి చిన్న కాలువగా అయినందున కాలువ పూడిక సరిగా తీయలేక పోవడం వల్ల మట్టి, గుర్రపుడెక్క పేరుకుని పోయిన దోమలు విపరీతంగా ఉన్నాయన్నారు. ప్రజల కోరిక మేరకు ఈ కాలువ పూడికతీత పనులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పూడిక తీసిన అనంతరం ఆయిల్‌బాల్స్ కూడా వేయాలని సూచించారు. ప్రజలందరూ చెత్తచెదారాన్ని డస్ట్‌బిన్, చెత్త తరలించే వాహనాల్లో వేయాలని కోరారు. చెత్తచెదారాలను కాలువలో వేయడం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. నగరంలో పూర్తిగా దోమలను నిర్మూలించేందుకు త్వరలోనే అండర్‌గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటు చేస్తున్నటు చెప్పారు. త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజికి టెండర్లు పిలస్తామని తెలిపారు. అనంతరం 41వ డివిజన్‌లోని సుబేదారుపేట ప్రాంతంలో డ్రైనేజి లీక్ అయి కలుషిత నీరు మంచినీటి పైపులైన్‌లో కలుస్తుందని ఆ ప్రాంత వాసులు ఫోన్ ద్వారా తెలియచేయడంతో ఈ ప్రాంతంలో పర్యటించి మంచినీటిని పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం ఆయన స్పందిస్తు ఈ ప్రాంతంలో కలుషిత నీరు రాకుండా అధికారులు యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆనం రంగమయూర్‌రెడ్డి, కొట్టే వెంకటేశ్వర్లు, అల్లంపాటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దాతృత్వానికి స్పందించే హృదయం ఉంటే చాలు
నెల్లూరు, మార్చి 9: దాతృత్వానికి డబ్బు, ప్రణాళిక అవసరం లేదని స్పందించే హృదయం ఉంటే చాలని ఆర్‌ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గంగపట్నం లలిత రాజశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్‌జిఓ హోమ్‌లో జరిగిన వేడుకలలో విశ్వనేత్ర అంధుల పాఠశాలకు చెందిన అంధ విద్యార్థులు ఆలపించిన పాటలకు ముగ్ధులై తన ఫౌండేషన్ తరఫున 5వేల రూపాయలను నగదును స్ర్తి శిశుసంక్షేమశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆర్ సూయిజ్ చేతులు మీదుగా అందచేశారు.
విశ్వనేత్ర అంధుల పాఠశాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ
నెల్లూరు, మార్చి 9: పిసిఎస్‌ఆర్ ఫాండేషన్ ఆధ్వర్యంలో టక్కెమిట్టలో గల విశ్వనేత్ర అంధుల పాఠశాల విద్యార్థులకు శనివారం నిత్యావసర వస్తువులను ఆ సంస్థ అధ్యక్షుడు పావుజన్ని చంద్రశేఖర్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి చిరంజీవి ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా పిసిఎస్‌ఆర్ ఫాండేషన్ పనిచేస్తుందన్నారు. ఈ పాఠశాలలో ఉండే అంధులు స్వశక్తితో పనిచేస్తుంటారని కళ్ళు లేకపోయిన చాలా బాగా పుస్తకాలకు బైడింగ్ వర్క్, స్పైరల్ బైడింగ్ చేస్తుంటారని తెలిపారు. పిసిఎస్‌ఆర్ ఫాండేషన్ అవసరాలలో ఉన్నవారిని కలిసి వారికి కావాల్సిన వస్తువులను వారిని అడిగి తెలుసుకుని ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, గణేష్, చందు, మురళీ, రాము, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.