అమలాపురం, మార్చి 13: కళ్లముందు జిగేలు మంటున్నవి కొండలనుకుంటున్నారా, కానేకాదు.అక్రమంగా ఇసుక సిండికేట్లు అధికారుల కళ్లెదుటే ఘరానాగా నిల్వచేసిన ఇసుక కొండలు జాతీయ రహదారి పక్కనే బాహాటంగా ఇసుక కొండల్ని తలపించేలా నిల్వచేస్తున్నా కనీసం స్పందించలేని దుస్థితిలో అధికార యంత్రాంగం ఉందంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో కొద్దోగొప్పో భయం ఉందని భావించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ భయం కూడా సిండికేట్ అక్రమార్కులకు లేదని మరోసారి తేటతెల్లం అయ్యింది. ఇసుక ర్యాంపుల్లో సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ జుళిపించిన కొరడా పట్టుసడలింది. పేరుకే విజిలెన్స్ దాడులు జరిగినా అక్రమంగా నిల్వచేసిన లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వల్ని అంగుళం మేర జరపలేకపోగా, మళ్లీ అవే కొండలపై ఇంకా ఇసుకను నిల్వచేస్తున్నా, విక్రయాలు జరుపుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. విజిలెన్స్ దాడులంటే అక్రమ ఇసుక నిల్వదార్లకు, సిండికేట్లకు ఏమాత్రం భయం ఉందన్నది ఈ సంఘటనతో తేటతెల్లం అవుతోంది. గత గురువారం మందపల్లి, కపిలేశ్వరపురం, వేమగిరి, కడియపులంక, జొన్నాడ తదితర ప్రాంతాల్లో ఉన్న ఇసుక ర్యాంపులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందాలు దాడులు జరిపి పలు పొక్లెయిన్లు, లారీలు స్వాధీనం చేసుకుని ఆయా మండల తహసీల్దార్లకు అప్పగించాయి. అడ్డగోలు వ్యాపారాలకు వేదికగా మారిన ర్యాంపుల్లో గోదావరి గర్భాన్ని ఇష్టారాజ్యంగా యంత్రాలతో తవ్వేస్తున్నారు. కాంట్రాక్టు గడువు ముగిసినా నష్టం లేని రీతిలో నెలల తరబడి అమ్ముకోవడానికి వీలుగా కొండలను తలపించే రీతిలో ఇసుకను అక్రమంగా నిల్వలు చేస్తున్నారు. ఈ వ్యవహారాలపైనే దాడులు నిర్వహించి నేటికి వారం రోజులు దాటినా ఇంతవరకూ విజిలెన్స్ అధికారులు పత్తాలేకుండా పోవటం విడ్డూరంగా మారింది. తమ దాడుల్లో అక్రమంగా నిల్వచేసిన ఇసుకను స్వాధీనం చేసుకుని తహశీల్దార్లకు అప్పగించగా, వాటిపై మళ్లీ నిల్వ చేస్తుండటం విశేషం. ఈ పరిస్థితులు విజిలెన్స్ పవర్‌ని ఎగతాళిచేస్తున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. విజిలెన్స్ ఎస్‌పి స్థాయి అధికారుల నేతృత్వంలో జరిగిన దాడులకే అతీగతీ లేకపోతే పరిస్థితి ఏమిటని నిట్టూరుస్తున్నారు. జొన్నాడ ర్యాంపులో సీజ్‌చేసిన యంత్రాలు అలమూరు తహశీల్దార్‌కి అప్పగించినా వాటి పనులు అవి యథావిథిగా సాగిస్తునట్లు ఆరోపణలున్నాయి. ఇసుక సిండికేట్లను అధికార్లను కట్టడిచేయలేకపోగా, వారినే సిండికేట్లు కట్టడిచేశాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దాడుల తర్వాత సిండికేట్లు మరింత తెగించి ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపిస్తున్నారు. లారీల్లో రేయింబవళ్లు జెసిబిలు, మిషన్లతో ఇసుక లోడింగ్ మూడుపువ్వులు, ఆరుకాయలుగా సాగిపోతోంది.
మరో పసిమొగ్గ రాలిపోయింది
రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో ఆగని మరణ మృదంగం - వైఎస్సార్ కాంగ్రెస్ ఆందోళన
రాజమండ్రి, మార్చి 13: రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో బుధవారం తెల్లవారుజామున మరో పసిమొగ్గ రాలిపోయింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మరణించిందని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడురోజులుగా వరుసగా ముగ్గురు పసికందులు గర్భంలోనే మరణించిన సంగతి తెలిసిందే. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే గర్భిణీలకు గర్భశోకాన్ని మిగిల్చారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలో బుధవారం మరో పసిగుడ్డు కన్నుమూసింది. శాటిలైట్‌సిటీకి చెందిన నిండుగర్భిణీగా ఉన్న షేక్ పర్వీన్ తన అత్తగారి ఊరైన విజయవాడ నుంచి మంగళవారం కారులో రాజమండ్రి చేరుకుని, నొప్పులు తీవ్రమవడంతో ప్రభుత్వాసుపత్రిలో చేరింది. సత్వర చికిత్సను అందించాలని వైద్యులను కోరగా నిర్లక్ష్యం వహించారని, చివరకు సాధారణ కాన్పు ద్వారా శిశువు జన్మించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పుట్టిన బిడ్డ 2గంటల్లోనే కన్నుమూసిందని తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బిడ్డ మరణించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆసుపత్రి వైద్యులు మాత్రం షేక్ పర్వీన్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదని స్పష్టం చేశారు. సాంకేతిక, అనారోగ్య కారణాల వల్లే శిశువు మరణించిందని చెబుతున్నారు. ప్రభుత్వాసుపత్రిలో శిశు మరణాలపై ఆర్డీఓ ఎం వేణుగోపాలరెడ్డి ఆసుపత్రికి చేరుకుని విచారణ నిర్వహించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సంబంధిత వైద్యులు, ఆర్‌ఎంఓను పిలిచి వరుసగా జరుగుతున్న శిశు మరణాలపై ఆరా తీశారు. ఐయుడి కేసులను కూడా సాధారణ కాన్పు కేసులుగా ఎందుకు పరిగణిస్తున్నారని ఆర్డీఓ మండిపడ్డారు. ప్రతీరోజూ శిశువులు మరణించడం ఎలా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యావంతుల్లా ప్రవర్తించాలని, పేదలకు వైద్యసేవలు అందించడంలో చిత్తశుద్ధితో పనిచేయాలని క్లాసుపీకారు. సిబ్బంది కొరత వల్లే శిశువులు మరణిస్తున్నారన్న సాకును ఆయన తప్పుపట్టారు. తన విచారణలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువులు మరణించినట్లు తేలితే సంబంధిత వైద్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తానన్నారు. కాగా, ప్రభుత్వాసుపత్రిలో శిశు మరణాలపై వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ నాయకులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ గత కొంతకాలంగా ప్రభుత్వాసుపత్రిలో వైద్యసేవలు దారుణంగా ఉంటున్నాయన్నారు. వైద్యులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని, నర్సులే వైద్యం చేసేస్తున్నారన్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలు కూడా హీనంగా ఉన్నాయన్నారు. ఆసుపత్రి సమస్యలపై ఆరోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో నగర కన్వీనర్ బొమ్మన రాజ్‌కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
అనర్హత వేటు తప్పదా!
ద్వారంపూడి వ్యవహారంపై పార్టీలో చర్చ
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, మార్చి 13: గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై అనర్హత వేటు వేసేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ద్వారంపూడి ఇటీవల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ మారినప్పటకీ ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేసేది లేదని అప్పట్లో ప్రకటించారు. అయితే కాంగ్రెస్ సింబల్ పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన శాసన సభ్యుడి పదవికి రాజీనామా చేయకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే రాజీనామా చేయడం పట్ల అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై అనర్హత వేటు వేశారు. ఆయన దారిలోనే నేడు ద్వారంపూడి ప్రయాణిస్తున్న నేపధ్యంలో ఈయనపై అనర్హత వేటు ఎందుకు వేయడం లేదంటూ అధికార కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే దివంగత నేత వైఎస్ అభిమాని ఎమ్మెల్యే అయిన తాను ఆయన నాయకత్వంలోనే ఎమ్మెల్యే ఎన్నికయ్యానని అందుచేత తాను ఈ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు చంద్రశేఖరరెడ్డిపై అనర్హత వేటు వేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కాగా రాష్ట్రంలో ఇటీవల జగన్ పార్టీలో చేరిన కొందరి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధం కావడం ఆ జాబితాలో ద్వారంపూడి కూడా ఉండడంతో అతి త్వరలో ఆయనపై అనర్హత వేటు తప్పదని నేతలు భావిస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో మధ్యంతర ఎన్నికలకు అస్కారం ఉంటుందా లేదా అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది.
భగ్గుమన్న వర్గ వైషమ్యాలు
వివాహ రిసెప్షన్‌లో యువకుడిపై మారణాయుధాలతో దాడి
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం మార్చి 13: అమలాపురం పట్టణంలో ఇరువర్గాల మధ్య దాగిఉన్న వర్గ వైషమ్యాలు మరోసారి భగ్గుమన్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరు వర్గాల మధ్య చాలాకాలంగా వర్గ విభేదాలు ఉన్నాయి. ప్రత్యర్ధిపై పైచేయి సాధించేందుకు ఇరుపక్షాలు పరస్పరం పలు సందర్భాల్లో దాడులు, ప్రతిదాడులకు దిగుతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి పట్టణ శివారు కొంకాపల్లిలో ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న గుమ్మళ్ల సురేష్ అనే యువకుడి వివాహ రిసెప్షన్ జరుగుతుండగా అక్కడికి ఇరుగ్రూపులకు చెందిన యువకులు వెళ్లారు. ఆ సమయంలో ఒక వర్గానికి చెందిన త్సవటపల్లి కిషోర్ అనే యువకుడిపై కనే్నసిన ప్రత్యర్ధులు తొమ్మిదిన్నర గంటలకు కత్తులు, రాడ్లు, బరిసెలతో మెరుపుదాడిచేసారు. ఈసంఘటనలో కిషోర్‌కి తలపైన, కన్నుపైన, బలమైన గాయాలయ్యాయి. గాయపడిన కిషోర్‌ని హుటాహుటిన అమలాపురం కేర్ ఆస్పత్రికి తరలించారు. కన్నుకి బలమైన గాయం తగిలిందని, ప్రాణాపాయ పరిస్థితి లేదని కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అనంతరం గాయపడిన కిషోర్‌ని మెరుగైన వైద్యసేవల నిమిత్తం కాకినాడకు తరలించారు. ఇదిలా ఉండగా ఈ సంఘటనతో పట్టణం ఉలిక్కిపడింది. సమాచారం తెలిసిన వెంటనే వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ప్రత్యర్ధివర్గానికి చెందిన యువకులు ప్రతిదాడి చేయవచ్చన్న ముందస్తు సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అమలాపురం సిఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్‌లను ఏర్పాటుచేశారు. క్షణాల్లో పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పట్టణ ఎస్‌ఐ ఆర్ అంకబాబు ఆధ్వర్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లుచేసారు. ఇదిలా ఉండగా ఒక వివాహ రిస్షెప్షన్‌ని వేదికగా చేసుకుని ప్రత్యర్ధిపై దాడిచేయడానికి ప్రయత్నించటం వెనుక కుట్ర దాగి ఉందని కొందరు అంటుండగా, తమ ఉనికిని కోల్పోతున్న తరుణంలో పట్టు సాధించేందుకు ప్రత్యర్ధివర్గం ఈ దాడికి దిగిందని వైరి వర్గం చెబుతోంది. ఏది ఏమైనా ఒక వివాహ రిసెప్షన్‌ని వేదికగా చేసుకుని దాడులకు దిగిన నేపధ్యంలో ఈసంఘటన ఆధారంగా గొలుసు సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. పట్టణంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసామని సిఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేసారు.
పారదర్శక పాలనకు సిఎం కృషి
రెవెన్యూ సదస్సులో మంత్రి విశ్వరూప్
ఉప్పలగుప్తం, మార్చి 13: పరిపాలనలో పారదర్శకత కలిగించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చిత్తశుద్దితో పనిచేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లిలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ముందుగా మండలంలో ఏడు కోట్ల రూపాయల నాబార్డు నిధులతొ నిర్మిస్తున్న రక్షిత మంచినీటి పధకానికి శంకుస్థాపన చేసారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రగతి దశలో ఉన్న లక్షిత మంచి నీటి పధకాలు పూర్తయితే నియోజకవర్గంలో ఎక్కడా త్రాగునీటి సమస్య వుండదన్నారు. ఆర్ డబ్ల్యు ఎస్ మంత్రిగా వుండగా త్రాగునీటి అవసరాల నిమిత్తం జిల్లాకు నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు జేయడం జరిగిందన్నారు. అనాతవరం నుండి మునిపల్లివరకు గల ఆర్ అండ్ బి రహాదారి ని అభివృద్ది చేసేందుకు 12 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటికే మూడు కోట్లరూపాయలు విడుదలకాగా పనులు అనాతవరం నుండి భీమనపల్లివరకు చేపట్లడం జరుగుతుందన్నారు. మారుమూల గ్రామాలన్నింటికి పక్కా రహదారులు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రజలు రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలని మంత్రి అన్నారు. పట్టాదారు పాస్ బుక్స్, టైటిల్ డీడ్స్ తదితర సమస్యలన్నింటిని సత్వరం పరిష్కరిస్తామన్నారు. మాజీ ఎంఎల్‌సి గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ మండలంలో లింకు రోడ్ల ప్రాధాన్యత ఎంతోవుందని వీటిని సత్కరమే పరిష్కరించవలసివుందన్నారు. వీటిని నిర్మించుకుంటే రైతులకు బహుళ ప్రయోజనాలు పొందే అవకాశం వుందన్నారు. తదుపరి మంత్రి మహిళా సంఘాలు నుండి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం కెఎఫ్‌డబ్ల్యు కాలనీలోని పాడుపడిన గృహాలను పరిశీలించి కొత్తవాటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో ఎంఎల్‌సి నిమ్మకాయల చినరాజప్ప, అల్లవరం మార్కెటింగ్ కమిటి చైర్మన్ యిళ్ళ శేషారావు, ఆల్డా చైర్మన్ యాళ్ళ దొరబాబు, ఎఎంసి మాజీ చైర్మన్ దంగేటి కొండయ్య, ఇసుకపట్ల రఘుబాబు, చీకట్ల అబ్బాయి, గెడ్డం సురేష్ బాబు, శిరంగు సత్తిరాజు, ఆర్ డబ్ల్యు ఎస్ డి ఇ ఇ సి హెచ్ రామారవు,తహాశిల్దార్ జె సింహాద్రి, యం పి డి ఓ వై లక్ష్మయ్య బాబు, దాసరి వెంకట రమణ,చిక్కం శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆధార్ అనుసంధానం మార్గదర్శకం
కాకినాడ, మార్చి 13: ఆధార్ అనుసంధానిత విధానాలు మార్గదర్శకంగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార ప్రోగ్రామ్ కంట్రీ డైరెక్టర్ మైకేల్ జెన్సన్ అభిప్రాయ పడ్డారు. ఆధార్ అనుసంధానిత సేవలపై బుధవారం కాకినాడ అర్బన్ తహశీల్దార్ కార్యాలయాన్ని జాన్సన్ బృందం సందర్శించింది.
ఏప్రిల్ 15లోగా గ్యాస్ వినియోగదారులు ‘ఆధార్’ ఇవ్వాలి
కాకినాడ, మార్చి 13: జిల్లాలోని వంట గ్యాస్ వినియోగదారులు తమ ఆధార్ లేటర్, బ్యాంక్ అక్కౌంట్ జిరాక్స్ కాపీలను ఏప్రిల్ 15వ తేదీ లోగా గ్యాస్ డెలివరీ బాయ్, డిస్టిబ్యూటర్‌కు తప్పనిసరిగా అందజేయాలని, లేకుంటే సబ్సిడీ సదుపాయం లేకుండా పూర్తి ధర చెల్లించాలని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం ఆమె కోర్టు హాలులో గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, డీలర్లు, పౌర సరఫరాల అధికారులతో ఆధార్ సబ్సిడీ బదిలీ ప్రక్రియ అమలుపై ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 15వ లోగా ఆధార్ జమ చేయకుంటే సబ్సిడీ ఉండదని, ఈ విషయాన్ని డీలర్లు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెసి బాబు, డిఎస్‌ఓ వి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
యువత సమాజాభివృద్ధికి పాటుపడాలి:కలెక్టర్
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, మార్చి 13: యువత సమాజాభివృద్ధికి పాటుపడాలని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ నగరంలో ఈ నెల 18వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సమైక్యతా శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ దేశంలో యువత పెద్ద సంఖ్యలో ఉన్నారని వారే దేశానికి వెన్నుముఖ అని కొనియాడారు. యువత నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకుని వివిధ రంగాల్లో భాగస్వాములై దేశాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ సమైక్యతను, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు ఈ యువజనోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.