కొత్తగూడెం, మార్చి 13: అవరోధాలను అధిగమిస్తూ 2012-13 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 55.4మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి సింగరేణి సంస్థ క్రమక్రమంగా చేరువవుతోంది. ఈనెల 11వతేదీ వరకు లక్ష్యం 50.90మిలియన్ టన్నుల లక్ష్యానికి గాను 49.46మిలియన్ టన్నులు సాధించి మెరుగైన ఉత్పత్తి ఫలితాలను సాధిస్తోంది. నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11ఏరియాలలో కొత్తగూడెం రీజియన్ పరిధిలోని కొత్తగూడెం ఏరియా ఇప్పటికే నిర్దేశిత లక్ష్యసాధనను అధిగమించి 108శాతం ఉత్పాదకరేటును సాధించింది. రీజియన్ పరిధిలోని ఇల్లెందు ఏరియా 128శాతంతో సంస్థలోనే ప్రథమస్థానంలో నిలువగా, మణుగూరు ఏరియా 113శాతంతో ద్వితీయస్థానంలో ఉంది. ఈమూడు ఏరియాలు కాకుండా రామగుండం -3 ఏరియా కూడా 105శాతంతో మెరుగైన ఉత్పత్తి ఫలితాలను గడచిన 11మాసాల 11రోజులలో సాధించింది. ఇవికాకుండా ఆడ్రియాల ప్రాజెక్టు అత్యల్పంగా 51శాతం ఉత్పాదక రేటుతో అన్ని ఏరియాల కంటే వెనుకబడి ఉంది. భూపాలపల్లి ఏరియా 56శాతం, ఆర్‌జి-1 ఏరియా 91శాతం, ఆర్‌జి-2 ఏరియా 88శాతం, బెల్లంపల్లి ఏరియా 97శాతం, మందమర్రి ఏరియా 74శాతం, శ్రీరాంపూర్ ఏరియా 93శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకున్నాయి. ప్రధానంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనకు సింగరేణిలో ఉన్న 14ఓపెన్‌కాస్ట్ గనుల కృషి కీలకంగా ఉంది. ఇప్పటివరకు 35.96మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 38.54మిలియన్ టన్నులు సాధించి మెరుగైన బొగ్గు ఉత్పత్తిని సాధిస్తూ సంస్థ పురోగతికి దోహదపడుతున్నాయి. అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న 36్భగర్భగనుల నుండి మాత్రం నిరాశజనకమైన ఉత్పత్తిని సంస్థ అందుకుంటోంది. ఇప్పటివరకు 14.94మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాల్సివుండగా 10.92మిలియన్ టన్నుల ఉత్పత్తి మాత్రమే సాధించాయి. ఈమాసంతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న కారణంగా ఓపెన్‌కాస్ట్ గనులపై మరింత దృష్టి సారించి నిర్దేశిత ఉత్పత్త లక్ష్యసాధనకు యాజమాన్యం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నది. ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తే ప్రతికార్మికునికి ప్రోత్సాహక బహుమతుల పథకానికి సంబంధం లేకుండా రూ .500నగదు బహుమతి కూడా ఇస్తామని ఇప్పటికే సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుతీర్ధ్భట్టాచార్య ప్రకటించారు.
పెంచిన విద్యుత్ చార్జీలభారాన్ని ప్రభుత్వమే భరించాలి
* డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రమోహన్ డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, మార్చి 13: పెంచిన విద్యుత్‌చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని, సర్‌చార్జీలను ఎత్తివేయాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె చంద్రమోహన్ డిమాండ్‌చేశారు. బుధవారం డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యుత్‌చార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విద్యుత్ చార్జీలు పెంచేది లేదని తెగేసి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చిన ప్రజలపై భారాలు మోపుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో విద్యుత్‌చార్జీలు పెంచటం దారుణమన్నారు. విద్యుత్ చార్జీలను ప్రజలు సకాలంలో చెల్లిస్తున్నప్పటికీ విద్యుత్ కోతలు విధించటం అమానుషమన్నారు. అదనపు భారాలు, విద్యుత్ కోతలతో ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు. సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అనంతరం ఆ సంఘం జిల్లా కార్యదర్శి నాదెండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు ఉచిత ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం రైతులకు మూడు గంటలకు నిరంతరాయంగా సరఫరా చేయని దుస్థితిలో ఉందని ఆరోపించారు. విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోవటంతో రైతులు ఏమి చేయలో అర్థం కాని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ హత్యలన్ని ప్రభుత్వమే పరోక్షకంగా చేయిస్తుందని ఆరోపించారు. విద్యుత్ కోతల వల్ల పరిశ్రమలు మూతపడి యువతకు ఉపాధి అవకాశాలు పూర్తిగా మసకబారుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్ చార్జీలను ప్రభుత్వమే భరించాలని, విద్యుత్‌కోతలను ఎత్తివేయాలన్నారు. లేకుంటే తమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, నాయకులు దాసరి నాగేశ్వరరావు, నాగేశ్వరరావు, బాణోతు మధు, భుక్యా రమేష్, హిమామ్, సుధాకర్, సునీల్, వంశీ, అఫ్జల్, సోమరాజ్, నర్సింహారావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులకు
దిక్కుతోచని స్థితి
* ఓ వైపు అధికారుల ఒత్తిడి, మరోవైపు పోలీస్ కేసులతో సతమతం
ఖమ్మం రూరల్, మార్చి 13: స్థానిక పోలేపల్లి గ్రామపంచాయతీలోని రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపున బ్యాంక్ అధికారుల ఒత్తిడి, మరోవైపుల పోలీస్ స్టేషన్‌లో కేసుల నమోదుతో అటు అమ్ముకున్నవారు, ఇటు ఆ ఇళ్లను కొనుగోలు చేసినవారు సమస్యల వలయంలో చిక్కుకున్నారు. 2006-07లో ప్రభుత్వం నిరుపేదలకు రాజీవ్ గృహకల్ప సముదాయాలను నిర్మించింది. మొత్తం 32 బ్లాక్‌లలో 768 ప్లాట్లను కేటాయించింది. అందుకుగాను ఒక్కొక్క లబ్ధిదారుని వాటా కింద రు.7,500లు, సభ్యత్వ రుసుము కింద వెయ్యి రూపాయలను గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో వసూలు చేశారు. ఇంటి నిర్మాణం కోసం ఒక్కొక్క లబ్ధిదారుడికి బ్యాంక్ ద్వారా 74,250 రూపాయలను కూడా ఇప్పించారు. గృహప్రవేశం చేసిన కొంతకాలం తరువాత కొంతమంది లబ్ధిదారులు ఆర్థిక పరిస్థితులు బాగాలేక వాటిని అమ్ముకున్నారు. అయితే బ్యాంక్ రుణ వాయిదాలను అటు ప్లాట్లను విక్రయించినవారుగానీ, కొనుగోలు చేసినవారుగానీ చెల్లించకపోవడంతో తరచూ బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేయడం, ఇళ్ళకు సీల్ వేయడం పరిపాటైంది. 2011లో జీవో నెం.42 ప్రకారం ప్రతి నెలా 500 రూపాయల చొప్పున వాయిదాలు చెల్లించిన లబ్ధిదారులకు సబ్సిడీతో పాటు వడ్డీని మాఫీ చేసేందుకు బ్యాంక్, గృహనిర్మాణ శాఖ వెసులుబాటు కల్పించాయి. కొన్ని నెలల పాటు సజావుగానే చెల్లింపులు చేసిన లబ్ధిదారులు ఆతరువాత మానుకోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు గృహనిర్మాణశాఖ అధికారులు ఇళ్లు అమ్ముకున్న లబ్ధిదారులపై పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. దీంతో ఇళ్ళను అమ్ముకున్నవారిలో, కొన్నవారిలో కూడా ఆందోళన మొదలైంది. ఇల్లు ఉంటుందో రద్దు చేస్తారో అని అసలైన లబ్ధిదారులు, తాము ఇల్లు కొనుగోలు చేసిన ఇల్లు లేదా సొమ్ము తిరిగి వస్తుందో రాదోనని కొనుగోలుదారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదిలావుండగా తాము బ్యాంక్ అధికారులకు నెలనెలా చెల్లించిన వాయిదా సొమ్మును వడ్డీ కింద జమచేసుకుంటూ ఏడాదికేడాది వేలకువేలు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం పట్ల గృహకల్పవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టి మరుసటిరోజు బిల్లులు వసూలు చేసేందుకు రాజీవ్‌గృహకల్పకు వెళ్ళిన బ్యాంక్ అధికారులు, గృహనిర్మాణశాఖ అధికారులపై లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పరువు బజారుకీడ్చి తిరిగి బ్యాంక్ వాయిదాలు చెల్లించాలని కోరడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈక్రమంలో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈసందర్భంగా రాజీవ్ గృహకల్పవాసులు మండెపూడి సాంబశివరావు, ఎస్‌డి సిరాజుద్దీన్, బండారు శ్రీనివాసరావు, నాగమణి తదితరులు పనికి వెళ్తేనే పూట గడుస్తుందని, ఇటువంటి దుస్థితిలో బ్యాంక్ అధికారులు రుణ వాయిదాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తుంటే చావాలా బతకాలా అని ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ మరోసారి ఆలోచించి నెలకు 500 రూపాయల చొప్పున రుణ వాయిదాలు చెల్లించే అవకాశం కల్పించాలని వారు కోరారు. ఒకేసారి 50 నుంచి 60వేలు చెల్లించాలంటే తమకు ఆత్మహత్యలు తప్ప మరో మార్గమేలేదని వాపోయారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
బూర్గంపాడు/ కూసుమంచి మార్చి 13: జిల్లాలో బుధవారం నాడు వేర్వేరు మండలాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే...బూర్గంపాడు మండలం వెంకటాపురం పాములేరు బ్రిడ్జి సమీపంలోని జామయిల్ తోట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చత్తీస్‌గఢ్‌కు చెందిన మడివి లక్మా (27) అనే యువకుడు మృతి చెందాడు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా తెల్లంగి గ్రామానికి చెందిన మడివి లక్మా గత కొద్ది రోజుల కిందట జామాయిల్ కర్ర నరికివేతకు సారపాకకు వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం పాములేరు సమీపంలోని జామాయిల్ కర్రను నరికేందుకు వెళ్లాడు. లక్మా ట్రాక్టర్‌ను నడిపేందుకు ప్రయత్నిస్తుండగా ట్రాక్టర్ బోల్తా కొట్టింది. దీంతో లక్మా ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నానుతండా వద్ద యువకుడి మృతి
కూసుమంచి: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన బధవారం చోటు చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని నానుతండా వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గైగొళ్ళపల్లి శివారు హట్యాతండాకు చెందిన బాదావత్ నాగరాజు(22), బాలుడు లాలు ద్విచక్రవాహనంపై నర్సింహుల గూడెం నుంచి పాలేరు వైపు వెళ్తున్నారు. ఈక్రమంలో ఎదురుగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనటంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా, లాలు తీవ్ర గాయాలపాలయ్యాడు. తీవ్రంగా గాయపడిన లాలును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కూసుమంచి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో కుటుంబీకులు, తండావాసులు విషాధంలో మునిగారు.
మల్లారం రెవెన్యూ సదస్సులో
అధికార్లపై రైతుల ఆగ్రహం
మధిర, మార్చి 13: మండల పరిధిలోని మల్లారం గ్రామంలో బుధవారం జరిగిన రెవెన్యూ సదస్సు రసాభాసగా మారింది. జాలిముడి ప్రాజెక్టు కారణంగా నిర్మిస్తున్న పంట కాల్వలు తీసేందుకు నిర్వహించిన సర్వే అవకతవకలుగా జరిగిందని, రీసర్వేచేసి తమకు న్యాయం చేయాలని ఆ గ్రామానికి చెందిన దళితరైతులు రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ సిబ్బంది సర్వే చేసి తయారుచేసిన నివేదికలో తమ పేర్లు లేవని, తమ పేర్లు లేకపోతే తమకు నష్టపరిహారం ఎలా వస్తుందని ప్రశ్నించారు. అంతేగాకుండా మరికొంతమంది దళిత రైతులు గ్రామరాశికి చెందిన భూమిని తమకు ఇస్తున్నట్లు గతంలో పట్టాలు ఇచ్చారని, కానీ నేటి వరకు ఆ పొలం ఎక్కడ ఉన్నదో తమకు చూపించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పట్టా జిరాక్స్ కాపీలను చింపివేశారు. గ్రామంలోనే రైతుల సమక్షంలో మరో సారి కాల్వల కారణంగా కోల్పోతున్న భూముల లబ్ధిదారుల వివరాలను ప్రకటించి, తమకు న్యాయంచేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు తమ దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని ఆర్డీవో దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. అదే విధంగా సదస్సులో పలు పాస్ పుస్తకాలకు సంబంధించి దరఖాస్తులను అందించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ కృష్ణయ్య, విఆర్వో బాలయ్య, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కరివేద వెంకటేశ్వరరావు, మందడపునాగేశ్వరరావు, మందడపు ఉపేంద్ర పాల్గొన్నారు.
ప్రమాదం జరిగితే
సమాచారం అందించాల్సిందే
* అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఖానాపురం హవేలి, మార్చి 13: జిల్లాలో ఏదైనా సంఘటన, ప్రమాదం జరిగినట్లయితే ఆ వివరాలను వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని గ్రామ, మండల స్థాయి అధికారులను జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించారు. అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న ఇతర ప్రభుత్వ ఉద్యోగులందరిపై బాధ్యత ఉందన్నారు. సంబంధిత ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్ కార్యాలయానికి సమాచారాన్ని వెంటనే చేరవేయాలని సూచించారు. సంఘటన జరిగిన వెంటనే జిల్లా పౌర సంబంధాల అధికారికి సమాచారం అందిస్తే వెంటనే తగు చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
ప్రజలపై భారాలు మోపడమే ప్రభుత్వ ధ్యేయం
* సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం విమర్శ
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, మార్చి 13: ప్రజలపై భారాలు మోపడమే ప్రభుత్వ ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు బుధవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ఇప్పటికే అన్ని రకాల పన్నులను పెంపుదల చేశారని, ఒక్క విద్యుత్‌పైనే 34 వేల కోట్ల వసూలు చేస్తున్నారని, ఇది చాలదన్నట్లు ఏప్రిల్ నుండి 754 కోట్ల రూపాయల సర్‌చార్జీలను వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైందని ఆయన ఆరోపించారు. దేశ చరిత్రలో ఇంతటి విద్యుత్ సంక్షోభాన్ని ప్రభుత్వం ఏనాడు ఎదుర్కోలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికారికంగానే 12 గంటలో కోత విధించిన ప్రభుత్వం అనధికారికంగా మరో నాలుగు గంటలు కోత విధిస్తుందన్నారు. విద్యుత్ కోత కారణంగా పరిశ్రమలు మూత పడటంతో జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. విద్యుత్ కోతలు, చార్జీల పెంపుకు నిరసనగా ఈ నెల 14న జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయముల ముందు ఆందోళన నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు పనులు ఎక్కడికి అక్కడే నిలిచి పోయాయని, గతంలో చేపట్టిన పనులు శిధిలావస్థకు చేరుకున్నాయన్నారు. రెవెన్యూ సదస్సులు కేవలం మొక్కుబడిగా సాగుతున్నాయని, దళిత వాడల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో పోడు భూముల సమస్యలు పరిష్కరించకుండా రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తే ఫలితం ఉండదన్నారు. 18న ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు సంతృప్తికరంగా లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 22, 23 తేదీలలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశాలు భధ్రాచలంలో నిర్వహిస్తామన్నారు. సామావేశంలో జమ్ముల జితేందర్‌రెడ్డి, శింగు నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.
వ్యాట్‌ను ఎత్తివేసే వరకు ఉద్యమాలు ఆగవు
ఖానాపురం హవేలి, మార్చి 13: వస్త్రాలపై విధించిన వ్యాట్‌ను ఎత్తివేసే వరకు ఉద్యమాలు నిర్వహిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కమాన్‌బజార్‌లో చేపట్టిన నిరవధిక దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు వ్యాపారాలు నిర్వహించే పరిస్థితుల్లో యజమానులు లేరని పేర్కొన్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న వ్యాపారులు ప్రస్తుతం వ్యాట్‌రూపంలో అధిక మొత్తంలో భారాలు వేయటంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతం నుంచి ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవటం విచారకరమన్నారు. వస్త్రాలపై వ్యాట్‌ను పెంచటం వ్యాపారులు దుకాణాలు మూసివేసి రోడ్డు పడాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొనటం బాధాకరమన్నారు. కిరణ్‌కుమార్ ప్రభుత్వంలో వస్తవ్య్రాపారులు దుర్భరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దీక్షలకు టైలర్ల సంఘం నాయకులు తదితరులు పూర్తిస్థాయిలో మద్దతును ప్రకటించారు. తమ పార్టీ ఎల్లప్పుడు వస్తవ్య్రాపారులకు మద్దతునిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆయూబ్, రాజ్‌కుమార్, కమర్తపు మురళీ తదితరులు పాల్గొన్నారు.
వైకాపా వికలాంగుల సంఘం
మండల కన్వీనర్ ఆత్మహత్య
మణుగూరు, మార్చి 13: వైఎస్సార్ సిపి మణుగూరు మండల వికలాంగుల సంఘం కన్వీనర్ కిలారు ప్రశాంత్ (21) బుధవారం ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. గత నాలుగు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురవుతూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు ప్రశాంత్ వికలాంగుల సమస్యలపై అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాడు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ప్రశాంత్ మృతి చెందడంతో ఆ పార్టీ నేతలు దిగ్భ్రాంతి చెందారు. ప్రశాంత్ మృతికి పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్, సిజిసి మెంబరు చందా లింగయ్యదొర, స్టీరింగ్‌కమిటీ సభ్యులు పోశం నర్సింహారావు, కీసర శ్రీనివాసరెడ్డి, నాయకులు వట్టం రాంబాబు, నూరుద్ధీన్, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
చెట్టుకొమ్మ విరిగిపడి ఒకరి మృతి
బయ్యారం, మార్చి 13: చెట్టును కొడుతుండగా కింద ఉన్న వ్యక్తి మీద కొమ్మ పడడంతో తీవ్ర గాయాలుకాగా ఆసుపత్రికి తరలిస్తుండగా ఒక మృతిచెందాడు. వివరాలిలావున్నాయి. మండలంలోని గంధంపల్లి గ్రామానికి చెందిన కందగట్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కర్రవ్యాపారం చేస్తున్నాడు. అందులో భాగంగానే బుధవారం దుబ్బగూడెం గ్రామసమీపంలో చింతచెట్టును నరికిస్తుండగా కొమ్మవిరిగి వెంకటేశ్వర్లు తలమీద పడింది. పరిస్థితి ఆందోళనగా వుండడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గంధంపల్లి గ్రామంలో వెంకటేశ్వర్లు న్యూడెమోక్రసీ పార్టీ సానుభూతి పరుడిగా పనిచేస్తున్నాడు.
ఐదుగురు మోటారు సైకిళ్ల దొంగల అరెస్టు
బూర్గంపాడు, మార్చి 13: సారపాకలో ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడుతూ మోటారు సైకిళ్లను దొంగిలించిన ఐదుగురు నిందితులను బుధవారం బూర్గంపాడు పోలీసులు అరెస్టు చేశారు. సిఐ వై రమేష్ కథనం ప్రకారం... సారపాకకు చెందిన నారిశెట్టి జవహర్‌పాల్, నాగోతు విఘ్నేష్, దాసరి పవన్ తేజా, మాడా త్రివికమ్, షేక్ సర్ధార్ పాషా అనే యువకులు జల్సాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠా ఇటీవల సారపాక బిపియల్ గేటు వద్ద రెండు మోటారు సైకిళ్లు, సారపాకలోని మసీదు రోడ్డులో ఒకటి, విజయవాడ బస్టాండులో మరో బైక్‌ను అపహరించారు. వీటిని సారపాకకు చెందిన కాసుల నాగేందర్, దారా కార్తీక్, కల్లోజి శ్రీనివాస్‌లకు విక్రయించారు. ఇదిలా ఉండగా బుధవారం సారపాకలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా వీరంతా అనుమానాస్పదంగా కన్పించడంతో అదుపులోకి తీసుకొని విచారించడంతో విషయం వెలుగుచూసింది. ఆ వాహనాలను కొనుగోలు చేసిన దారా కార్తీక్, నాగేందర్‌ల, శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కార్తీక్ ఇటీవల బిపియల్ కాలనీలో గల పూదోట అంతయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో 23 గ్రాముల బంగారు గొలుసును అపహరించాడు. పోలీసుల విచారణలో ఈ విషయం సైతం వెలుగుచూసింది. దీంతో వీరి వద్ద నుంచి వాహనాలను, బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వారిని కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్లు ఎస్‌ఐ సాగర్ తెలిపారు.
క్రికెట్‌లో బ్లూస్టార్, మిర్యాలగూడ జట్ల గెలుపు
ఖమ్మం (స్పోర్ట్స్), మార్చి 13: ఖమ్మం టౌన్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక సర్ధార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ క్రికెట్ పోటీలు పూల్ బి విభాగంలో బుధవారం మ్యాచ్‌లు జరిగాయి. బ్లూస్టార్ గుంటూరు సిసి జట్టుపై ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది. బ్లూస్టార్ బ్యాటింగ్‌లో 18 ఓవర్లలో 10 పరుగుల నష్టానికి 120 పరుగులు చేశారు. జట్టులో డేవిడ్ 69, శేఖర్ 19 పరుగులు చేశారు. గుంటూరు జట్టు బౌలింగ్‌లో అలీ 3 వికెట్లు, మణికంఠ 2, గోపి ఒక వికెట్ తీసుకున్నారు. గుంటూరు బ్యాటింగ్‌లో 18.3 ఓవర్లలో 10 వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేశారు. బ్లూస్టార్ బౌలింగ్‌లో లాలు నాలుగు వికెట్లు, నరేష్ రెండు వికెట్టు తీసుకున్నారు. తరువాత జరిగిన మరో మ్యాచ్‌లో డెక్కన్ బ్లూస్‌పై మిర్యాలగుడ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మిర్యాలగుడ బ్యాటింగ్‌లో 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేశారు. జట్టులో క్రిష్ణ 54, జానీ 16, అనుదీప్ 10 పరుగులు చేశారు. డెక్కన్ బ్లూస్ బ్యాటింగ్‌లో 10 వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేశారు. మిర్యాలగుడ బౌలింగ్‌లో అంజి, ఉపేందర్ చెరి రెండు వికెట్లు, మజీద్ ఒక వికెట్ తీసుకున్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలు కల్పించాలి
ఖమ్మం(స్పోర్ట్స్), మార్చి 13: 108 అంబులెన్స్‌లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అప్పిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్‌లు డిమాండ్ చేశారు. బుధవారం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 108 అంబులెన్స్ సర్వీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు 12 గంటల పాటు పని చేస్తున్నారని, దీని వలన పని భారం పెరుగుతుందని వారన్నారు. కనీస వేతనాన్ని 15 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డిఆర్వోకు వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో ఇమ్మడి వెంకటేశ్వర్లు, రామాచారి, కల్పన, వెంకటరమణ, సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.