Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మల్టీపర్పస్ కో-ఆపరేటివ్ సొసైటీలతో ఆర్థిక పరిపుష్టి

$
0
0

గుంటూరు, మార్చి 13: మల్టీపర్పస్ కో-ఆపరేటివ్ సొసైటీల విధానంతో సహకార సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధించడంతో పాటు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. బ్యాంకును సందర్శించిన నాబార్డు సిజిఎం కెఆర్ నాయర్‌తో మల్టీపర్పస్ సొసైటీల రూపకల్పనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముమ్మనేని మాట్లాడుతూ రైతుకు అవసరమయ్యే గుండుసూది నుంచి పెట్రోల్ బంకుల వరకు సహకార సంఘాలే నిర్వహించడం వల్ల ఆర్థికంగా బలపడే అవకాశముందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 40 సొసైటీలను గుర్తించి ఆ మేరకు రుణాలు అందించేందుకు నివేదికలు రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే మంగళగిరి మండలం నూతక్కి సహకార సంఘానికి ఈ విధానం కింద 2 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని అన్నారు. పరిశ్రమలకు లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇస్తున్న ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని మాత్రం చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. మల్టీ పర్పస్ సొసైటీలు లాభాల కోసం రైతుల అవసరాల దృష్ట్యా వ్యాపారం నిర్వహిస్తాయన్నారు. ఆప్కాబ్ నుంచి పెద్దఎత్తున నిధులు తెచ్చుకునేందుకు వీలుగా డిపాజిట్ల సేకరణపై దృష్టిసారిస్తామని చెప్పారు. తమ హయాంలో రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ముమ్మనేని తెలిపారు. నాబార్డు సిజిఎం కెఆర్ నాయర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతులకు అన్ని విధాలా సహాయ సహకారాలందించే సహకార సంఘాలకు నిధుల విడుదలలో పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయంతో పాటు అనుబంధ పరిశ్రమలైన మిల్క్ డెయిరీలు, ఫౌల్ట్రీ, ఉద్యానవన, ఫిషరీ పరిశ్రమలకు పెద్దఎత్తున రుణాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు సిఇఒ బి విశ్వనాథం మాట్లాడుతూ గోడౌన్లు ఉన్నచోట రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు నిల్వ ఉంచుకునేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా నిల్వ ఉంచిన పంటకు ఏడు శాతం వడ్డీతో రుణాలు అందించనున్నట్లు చెప్పారు. ప్రతి సొసైటీని జిడిసిసి బ్యాంకు శాఖగా తయారు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామని విశ్వనాథం తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ కుర్రి సుబ్బారెడ్డి, డైరెక్టర్లు వాసిరెడ్డి జయరామయ్య తదితరులు పాల్గొన్నారు.

అక్రమ మైనింగ్ నిరోధానికి పటిష్ఠ చర్యలు

* కేసుల నమోదుకు వెనుకాడొద్దు: కలెక్టర్ సురేష్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, మార్చి 13: జిల్లాలో అక్రమ మైనింగ్, ఇసుక తరలింపును నిరోధించేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ అక్రమ తరలింపును నిరోధించే విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గద్దని స్పష్టం చేశారు. అవసరమైతే కేసులు నమోదు చేసేందుకు సైతం వెనుకాడొద్దని సూచించారు. పిడుగురాళ్ల సమీపంలోని కొండమోడు, దాచేపల్లి రవాణా చెక్‌పోస్టుల నుండి అనధికారికంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక, మట్టిని పెద్దఎత్తున తరలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తక్షణం అక్రమ రవాణాను అడ్డుకోవాలని, ఇందుకు సంబంధించి ప్రతివారం ఒక నివేదిక తనకు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో మైనింగ్ శాఖ డిడి వైఎన్‌ఆర్‌బి ప్రసాద్, డ్వామా పిడి అనిల్‌కుమార్, జిల్లా అటవీశాఖ అధికారి షేక్ సలామ్, మైనింగ్ ఎడి జగన్నాధరావు, పోలీసు, రెవెన్యూ తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

వస్తవ్య్రాపారుల దీక్షలకు
బార్ సంఘీభావం
గుంటూరు (లీగల్), మార్చి 13: రాష్ట్రప్రభుత్వం వివిధ వ్యాపారాలపై వ్యాట్ విధించడం ద్వారా ప్రభుత్వాధికారుల అవినీతికి మరింత బలం చేకూరుస్తుందని గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లావు అంకమ్మచౌదరి ఆరోపించారు. స్థానిక జిన్నాటవర్ సెంటర్‌లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వద్ద నిరాహార దీక్షలు చేస్తున్న వస్తవ్య్రాపారుల శిబిరాన్ని బుధవారం సందర్శించిన బార్ అధ్యక్షుడు అంకమ్మచౌదరి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి వారికి సంఘీభావం వ్యక్తం చేశారు. అంకమ్మచౌదరి మాట్లాడుతూ వ్యాట్ ద్వారా వసూలు చేసిన పన్నులను పూర్తిగా ప్రభుత్వానికి చేరవేయడం లేదన్న అంశాన్ని గుర్తించాలన్నారు. బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల్లో ఒకటైన వస్త్రాలపై ఇంతటి భారం మోపడం సరికాదన్నారు. వ్యాట్ వసూలు చేసి పథకాలు అమలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హైకోర్టు బెంచ్ సాధన ఉద్యమంలో వస్త్ర వ్యాపారులు తమకు ఎంతో సహకరించారని, ప్రస్తుతం తాము కూడా వారు చేస్తున్న దీక్షలకు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్ కార్యవర్గ సభ్యులు సిద్దా సత్యనారాయణ, మాదాను రాజారావు, బాబు, కుమారి తదితరులు పాల్గొన్నారు.

ఆధునిక తెలుగు సాహిత్యానికి రాయప్రోలు కృషి ఎనలేనిది
* కలెక్టర్ సురేష్‌కుమార్
గుంటూరు, మార్చి 13: తెలుగు సాహిత్యాన్ని ఆధునీకరించడంలో ఆచార్య రాయప్రోలు సుబ్బారావు కృషి ఎనలేనిదని కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం రాయప్రోలు 122వ జయంతి ఉత్సవాలు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద వైభవంగా జరిగాయి. ముందుగా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్, అతిథులు తెలుగుతల్లి విగ్రహానికి పుష్పమాలలు వేశారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ ఆచార్య రాయప్రోలు సుబ్బారావు కవిత్వంలో భారతీయత స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రాయప్రోలు రచించిన ‘ఏదేశ మేగినా, ఎందుకాలిడినా పొడగరా నీ తల్లి భూమి భారతిని’ అనే దేశభక్తి గేయాన్ని గుర్తుచేశారు. రాయప్రోలు జన్మించి 122 సంవత్సరాలైన సందర్భంగా తెలుగుతల్లి సాక్షిగా ఆ మహానుభావుని జయంతి ఉత్సవాలు జరపడం సంతోషదాయకమన్నారు. ఇన్‌చార్జి జెసి శారదాదేవి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా తమ ప్రాంత సాహిత్యాన్ని గొప్పగా చెప్పుకోవడంలో తప్పులేదన్నారు. జెడ్పీ సిఇఒ జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ రాయప్రోలు దాదాపు 90 సంవత్సరాలు జీవించారని, ఆయన 1984లో మరణించే నాటికి ఎన్నో గొప్ప రచనలు చేశారన్నారు. అనంతరం కలెక్టర్ సురేష్‌కుమార్ జంధ్యాల పాపయ్యశాస్ర్తీ కుమారుడు, ప్రముఖ సాహితీవేత్త జంధ్యాల జయకృష్ణ బాపూజీ, ఒంగోలు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజలక్ష్మిలను దుశ్శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె నాగబాబు, సాహితీవేత్త లక్ష్మీనారాయణ, వైవి బాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

నిజమైన లబ్ధిదారుల రేషన్‌కార్డుల పునరుద్ధరణకు చర్యలు
గుంటూరు, మార్చి 13: బోగస్ కార్డులుగా గుర్తించి తొలగించిన వాటిలో పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్న వాటిలో నిజమైన లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి జెసి శారదాదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని డిఆర్‌సి సమావేశ మందిరంలో గుంటూరు నగర ఆహార సలహా సంఘ సమావేశం ఇన్‌చార్జి జెసి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శారదాదేవి మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్న ఆహార పదార్ధాల్లో కల్తీ నిరోధానికి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే కేసులు నమోదు చేయాలని సూచించారు. అన్ని చౌకధరల దుకాణాల్లో వినియోగదారులకు అవసరమైన కందిపప్పు, గోధుమలు, లభ్యమయ్యేలా చూడాలని కోరారు. ఇప్పటివరకు కార్డుకు అరకిలో ఇస్తున్న పంచదారను అదనంగా మరో అరకిలో కలిపి కిలో పంచదారను వినియోగదారులకు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో డిఎస్‌ఒ రవితేజా నాయక్, పౌరసరఫరాల సంస్థ డిఎం కృష్ణారావు, ఇన్‌చార్జి ఆర్‌డిఒ డివి రమణారెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

శివాలయంలో పుష్పయాగోత్సవం
మంగళగిరి, మార్చి 13: స్థానిక శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి పుష్పయాగోత్సవం నిర్వహించారు. కైంకర్య పరులుగా మాజేటి నాగేశ్వరరావు దంపతులు వ్యవహరించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. ఆలయ ఇఓ మండెపూడి పానకాలరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈనెల 2న ప్రారంభమైన కనుల పండువగా సాగిన స్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రితో ముగిశాయి.

‘మున్సిపల్ ఎన్నికలకు వెనుకడుగు ఓటమి భయంతోనే’
గుంటూరు (కొత్తపేట), మార్చి 13: కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి భయంతోనే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు జంకుతోందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ విమర్శించారు. పాలకవర్గం లేక మూడేళ్లు కావస్తున్నా ఎన్నికలు నిర్వహించే అంశంపై ప్రభుత్వం స్పష్టత వ్యక్తం చేయడం లేదన్నారు. ఇన్‌చార్జి అధికారులు సరిగా పరిపాల న చేయలేక పోతున్నారని, దీంతో అవినీతి విచ్చలవిడిగా పెరిగి, అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయన్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి సమస్యలు జఠిలమవుతున్నాయన్నారు. రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి కొత్తపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ వస్త్రాలపై విధించిన వ్యాట్, సెన్సిటివ్ యాక్ట్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వస్త్రాలపై వ్యాట్‌ను చంద్రబాబు రద్దు చేస్తారన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎలుకా వీరాంజనేయులు, చిట్టాబత్తిన చిట్టిబాబు, ముప్పాళ్ల మురళి, సింగంశెట్టి వీరయ్య, మన్నవ రఘు, ఆదం, దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

* జిడిసిసి బ్యాంకు చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య
english title: 
m

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>