చందౌలీ(యూపి), ఫిబ్రవరి 10: దేశానికి పెద్ద సవాల్‌గా మారిన అవినీతి, అధికధరలు, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ పెద్దలు ఎందుకు నోరువిప్పరని బిజెపి సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ నిలదీశారు. విధానసభ ఎన్నికల ప్రచారంలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రస్తావించడమే లేదని విరుచుకుపడ్డారు. చందౌలీలో శుక్రవారం ఎన్నికల సభలో మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ అంత అవినీతి పార్టీ మరొకటి లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల మయమని రాజ్‌నాథ్ ఆరోపించారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతూ నీతుల వల్లించడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందని ఆయన అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం ఓ చక్కని ఉదాహరణ అని ఆయన చెప్పారు. 1.760 కోట్ల రూపాయ కుంభకోణం దేశంలోనే అతిపెద్దదని బిజెపి నేత పేర్కొన్నారు.
ఇక అధికార బిఎస్పీ అవినీతికి అంతూపంతూ లేదని రాజ్‌నాథ్ విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు భారీగా దుర్వినియోగం చేసినట్టు ఆయన ఆరోపించారు. ఐదువేల కోట్ల రూపాయల కుంభకోణం చోటుచేసుకున్నట్టు ఆయన తెలిపారు. ఆరోగ్య నిధులు స్వాహా చేశారని అన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు ఓట్ల కోసం ప్రత్యేక కోటా హామీలతో జనాన్ని మోసం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ముస్లిం మైనారిటీలకు కాంగ్రెస్ ప్రకటించిన 4.5 కోటాను బిజెపి నేత తప్పుపట్టారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే తీరులో కాంగ్రెస్ ఉందని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్‌ను నిలదీసిన బిజెపి నేత రాజ్‌నాథ్ సింగ్
english title:
a
Date:
Saturday, February 11, 2012