మేడారం, ఫిబ్రవరి 11: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించగలిగామని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. జాతరలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తిచేశామని చెప్పారు. శనివారం సాయంత్రం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జాతరలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులు భక్తులకు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు. అంతర్గత రోడ్లు నిర్మించడం, ఎడ్లబండ్ల బాటను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో భక్తులకు ఎంతో సౌకర్యం కలిగిందని తెలిపారు. జాతరకు భక్తులు అధికసంఖ్యలో వస్తారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వారు పుణ్యస్నానాలు ఆచరించేందుకు జంపన్నవాగు వద్ద గతంలో కన్న ఎక్కువ స్నానాల ఘాట్లను నిర్మించామని చెప్పారు. ఆరుకోట్ల రూపాయలతో తాగునీటి సౌకర్యం, సానిటేషన్, బస చేసే భక్తులకు తాత్కాలిక గుడిసెలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జాతరలో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించారని, జాతర ప్రాంతాన్ని 36సెక్టార్లుగా విభజించి నిరంతరాయం విధులు నిర్వహించేందుకు జిల్లా స్థాయి అధికారులు సమర్థవంతంగా పనిచేశారని చెప్పారు. ప్రతి జాతర విధుల నిర్వహణలో అధికారులు అప్రమత్తతో వ్యవహరించారని, ప్రయాణికుల సౌకర్యార్థం 3160 ఆర్టీసి బస్సులు 45పాయింట్ల నుండి నడిచాయని తెలిపారు. మేడారం పవిత్రతను కాపాడడానికి, పర్యావరణ పరిరక్షణకు, అటవీ అభివృద్ధికి 20లక్షల చెట్లను పెద్దఎత్తున నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కలెక్టర్ వివరించారు. మేడారం సమ్మక్క, సారలమ్మ ప్రాశస్త్యాన్ని తెలియజేయడానికి పుస్తకాన్ని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా రూపొందిస్తామని చెప్పారు. జాతర అనంతరం నాలుగు ప్రధాన శాఖలతో 10-15రోజుల్లో శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయితీరాజ్, మెడికల్ అండ్ హెల్త్, పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ మాట్లాడుతూ మేడారం జాతరలో వనదేవతలను 80లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని పేర్కొన్నారు. ఆర్టీసి ద్వారా 14లక్షల మంది భక్తులు అమ్మవార్లను సేవించుకున్నారని, ప్రతి జాతరలోను గత జాతర కంటే అధికంగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని చెప్పారు. జాతరలో విధినిర్వహణలో గాయపడిన వారికి నష్టపరిహారం చెల్లిస్తామని, జాతరలో జరిగిన చిన్నచిన్న పొరపాట్లకు క్షమించాలని కోరారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ అమ్మవార్ల దయతో భక్తులు సందర్శించుకుని సంతోషంగా తిరిగి వెళ్లారని అన్నారు. అందరి సహకారంతో జాతర విజయవంతం చేయగలిగామని, జాతర ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. ఎంపి గుండు సుధారాణి మాట్లాడుతూ మేడారం జాతర తెలంగాణ కుంభమేళాగా అభివర్ణించారు. అధికారులు ముందు నుండి సూక్ష్మస్థాయిలో ప్రణాళికతో ముందుకు సాగడంతో జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగలేదని తెలిపారు. విలేఖరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ వాకాటి కరుణ, మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్ నాలి కన్నయ్య, ప్రధాన పూజారి సిద్ధబోయిన జగ్గారావు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజేశ్వర్‌రావు, ములుగు సబ్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
మేడారం నుంచి
తిరుగు టపా
మేడారం, ఫిబ్రవరి 11: మేడారం సమ్మక్కసారలమ్మ దేవతల దర్శనార్థం ఎడ్లబండ్లపై తరలివచ్చిన భక్తులు శనివారం తిరుగు ప్రయాణం పట్టారు. మేడారం జాతర గిరిజన జాతర అయినప్పటికీ రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది మంది గిరిజనేతర భక్తులు తరలివచ్చారు. ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో భక్తులు జాతరకు తరలివచ్చారు. కానీ మేడారం జాతరకు ఎడ్లబండ్లపై రావడానికే ఎక్కువ ఇష్టపడుతుంటారు. ప్రభుత్వపరంగా 3600 ఆర్టీసీ బస్సులు, లెక్కకు అందని రీతిలో ప్రైవేటు వాహనాల సౌకర్యం ఉన్నప్పటికీ వివిధ ప్రాంతాల నుండి సుమారు వెయ్య వరకు ఎడ్లబండ్లు ఈ జాతరకు తరలివచ్చాయి. జాతరకు రెండు రోజులు ముందస్తుగానే మేడారం చేరుకుని జాతర చుట్టుపక్క ప్రదేశాలలో ఉన్న కంకవనంలో విడిది చేసి అమ్మవారలు కొలువుదీరిన అనంతరం డబ్బు వాయిద్యాలతో అమ్మవార్ల సన్నిధికి వచ్చి మొక్కులు చెల్లించుకుని అమ్మవార్లు వనప్రవేశం చేసిన తరువాత వీరంతా ఎడ్లబండ్లపై తిరుగు ప్రయాణం పట్టారు.