మేడారం, ఫిబ్రవరి 11: సమ్మక్క-సారలమ్మ తల్లులూ చల్లంగ చూడండంటూ.. మేడారం వచ్చిన భక్తుల్లో అధికులు వనదేవతలు కొలువుదీరిన గద్దెలతో ముద్రించిన చిత్రపటాన్ని ఇంటికి తీసుకెళ్లడం కనిపించింది. మేడారం జాతర నుంచి తిరుగు ముఖం పట్టిన భక్తులు దేవతల ప్రసాదమైన బెల్లం, కొబ్బరి, ప్యాలాలు తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. దీనితో భక్తులు జాతరకు గుర్తుగా భావించే అమ్మవార్ల చిత్ర పటాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా జాతర నుంచి తిరుగు పయనమైన అనేక మంది చేతుల్లో అమ్మవార్ల అందమైన చిత్ర పటాలుండటం విశేషం. చిత్రపటాన్ని ఇళ్లలోని దేవుని గదిలో పెట్టి నిత్యం పూజలు నిర్వహించి తల్లుల దీవెనలు తమకు ఎల్లపుడూ అందేలా కోరుకుంటామని భక్తులు విశ్వాసంతో చెప్పడం గమనార్హం. దీనితో జాతరలో అమ్మవార్ల చిత్రపటాల అమ్మకాలు ఈ సారి గణనీయంగా పెరిగి వ్యాపారులకు లాభాల పంట పండించాయి. పదిరూపాయలకు ఒక చిత్రపటం లక్షలాదిగా విక్రయించారు.
ఏర్పాట్లు భేష్
గత స్మృతులను
నెమరేసుకున్న ప్రభాకర్‌రెడ్డి
మేడారం, ఫిబ్రవరి 11: వరంగల్ జిల్లా కలెక్టర్‌గా గతంలో పనిచేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేషీలో కీలక బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఐఎఎస్ అధికారి ప్రభాకర్‌రెడ్డి శనివారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని గత స్మృతులను నెమరేసుకున్నారు. జంపన్నవాగు బ్రిడ్జిని 27రోజుల్లో పూర్తిచేసి ఏజెన్సీ ప్రజల ప్రశంసలు పొంది అప్పటి మేడారం జాతర పూర్తిస్థాయిలో విజయవంతం కావడానికి కారణమైన ప్రభాకర్‌రెడ్డి అమ్మల సేవలో తన అనుబంధాన్ని నెమరేసుకున్నారు. అమ్మలకు మొక్కులు చెల్లించుకున్న ప్రభాకర్‌రెడ్డి తన 72కిలోల నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు సమర్పించుకున్నారు. మేడారం రావడం తనకు సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. అనంతరం సమాచార శాఖ ముద్రించిన ప్రత్యేక సంచికను ఆసక్తిగా తిలకించడంతోపాటు ఆలనాటి జాతర ఫొటోలను చూసి ప్రశంసించారు.