మేడారం, ఫిబ్రవరి 11: వరంగల్ జిల్లా కలెక్టర్‌గా గతంలో పనిచేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేషీలో కీలక బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఐఎఎస్ అధికారి ప్రభాకర్‌రెడ్డి శనివారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని గత స్మృతులను నెమరేసుకున్నారు. జంపన్నవాగు బ్రిడ్జిని 27రోజుల్లో పూర్తిచేసి ఏజెన్సీ ప్రజల ప్రశంసలు పొంది అప్పటి మేడారం జాతర పూర్తిస్థాయిలో విజయవంతం కావడానికి కారణమైన ప్రభాకర్‌రెడ్డి అమ్మల సేవలో తన అనుబంధాన్ని నెమరేసుకున్నారు. అమ్మలకు మొక్కులు చెల్లించుకున్న ప్రభాకర్‌రెడ్డి తన 72కిలోల నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు సమర్పించుకున్నారు. మేడారం రావడం తనకు సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. అనంతరం సమాచార శాఖ ముద్రించిన ప్రత్యేక సంచికను ఆసక్తిగా తిలకించడంతోపాటు ఆలనాటి జాతర ఫొటోలను చూసి ప్రశంసించారు.
జనంలోంచి వనంలోకి...
* వనప్రవేశం చేసిన దేవతలు
మేడారం, ఫిబ్రవరి 11: అశేష భక్తజనవాళి మొక్కులు స్వీకరించిన అమ్మవార్లు శనివారం జనాన్ని విడిచి తిరిగి వనప్రవేశం చేశారు. భక్తుల కోరికలను తీర్చి.. కొలిచే వారికి కొంగు బంగారంగా మేడారం సమ్మక్క-సారలమ్మలు లక్షలాది మంది భక్తుల విన్నపాలు స్వీకరించి తిరిగి వాటిని నెరవేర్చాలనే సంకల్పంతోనే బైలెల్లిన దేవతామూర్తులు అశేష భక్తజనవాళి సమక్షంలో తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారు. మేడారంలో కొలువైన సమ్మక్క, సారలమ్మలతోపాటు గోవిందరాజులు, పగిడిద్దరాజులు వారి వారి స్థలాలకు చేరుకుని జనారణ్యం నుండి తిరిగి వనారణ్యంలోకి ప్రవేశించారు. మేడారంలోని గద్దెలపై కొలువైన సమ్మక్క తల్లిని సాయంత్రం 6.01గంటలకు ప్రధాన వడ్డె కొక్కర కృష్ణయ్యతోపాటు పూజారులు చిలకలగుట్టకు అమ్మవారిని సాగనంపారు. అదేవిధంగా సారలమ్మ తల్లిని పూజారులు 6.34గంటలకు వడ్డెలు కనె్నపల్లికి తీసుకుని వెళ్లారు. పగిడిద్దరాజును 6.04గంటలకు కొత్తగూడ మండలం పునుగొండ్లకు, గోవిందరాజులును ఏటూరునాగారం మండలం కొండాయికి 6.32గంటలకు పూజారులు తీసుకుని బయలుదేరారు. లక్షలాది మంది భక్తుల ఇలవేల్పుగా మారిన అమ్మవార్లను మరో రెండేళ్లకు మాఘశుద్ధ పౌర్ణమిరోజు గద్దెలపై కొలువవుతామంటూ భక్తుల నుండి సెలవు తీసుకున్నారు. దేవతల వన ప్రవేశ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, దేవస్థానం ఇఓ రాజేశ్వర్‌రావు, ట్రస్టు బోర్డు చైర్మన్ నాలి కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య వలంటీర్ల సహకారంతో అమ్మవార్ల వనప్రవేశం జరిగి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సజావుగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.