మేడారం, ఫిబ్రవరి 11: మహాతల్లులు సమ్మక్క-సారలమ్మల ఆశీస్సులతో రెండుసంవత్సరాలకు ఒకమారు జరిగే మేడారం జాతర శనివారం విజయవంతంగా ముగిసింది.. జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 60కోట్లరూపాయలను విడుదల చేయగా.. కొన్నిచోట్ల పనులు జాతర ముగిసేవరకు కొనసాగడం.. జాతరలో పోలీసుల ప్రవర్తనపై వెల్లువెత్తిన విమర్శలు తప్పితే.. జాతర విజయవంతమైందనే చెప్పవచ్చు. ఐదు రాష్ట్రాలకు చెందిన కోటిమంది భక్తజనం జాతరకు తరలివచ్చి అమ్మల దీవెనలు పొందింది. కలెక్టర్ రాహుల్, జాయింట్ కలెక్టర్ వాకాటి కరుణ, ఎస్పీ రాజేశ్‌తోపాటు వివిధ శాఖల సెక్టోరల్ అధికారులు జాతరలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాతర జరిగిన నాలుగురోజులు మేడారం భక్తిపారవశ్యంలో ఓలలాడింది. దూరతీరాలనుండి తరలివచ్చిన భక్తజనులు వనదేవతల దీవెనల కోసం పోటీపడ్డారు. శివసత్తుల పూనకాలు ఉద్విగ్నత రేకెత్తించాయి. బుధ, గురువారాల్లో సారలమ్మ, నాగులమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, సమ్మక్క గద్దెను ఎక్కగా..శుక్రవారం పెద్దసంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం అమ్మవార్ల వనప్రవేశంతో జాతర పరిసమాప్తమైంది. జాతరలో పలుశాఖలు విఫలమయ్యాయి. భక్తుల మంచినీటి అవస్థలు వర్ణనాతీతం. పెద్దసంఖ్యలో ట్యాంకులు ఏర్పాటుచేసినా పలు ప్రాంతాలలో మంచినీరు లభించక భక్తులు నానా ఇక్కట్లు పడ్డారు. 150రూపాయలకు ఒక వాటర్ క్యానును భక్తులు కొనుగోలు చేయవలసి వచ్చింది. ఆరోగ్యశాఖ సేవలు ఈపర్యాయం భేష్ అనిపించుకునేలా ఉన్నాయి. భక్తుల వైద్య చికిత్సలకోసం గద్దెలపక్కన 50పడకల ఆసుపత్రితోపాటు అత్యవసర ఆపరేషన్లకోసం మొబైల్ ఆపరేషన్ థియేటర్ ఏర్పాటుచేశారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో మరో 20పడకల ఆసుపత్రిని ఏర్పాటుచేశారు. ఇక జాతర క్యూలైన్లలో సొమ్మసిల్లిపడిపోయే భక్తులను అప్పటికప్పుడు వలంటీర్లు ఆసుపత్రికి చేర్చి చికిత్స జరిపించారు. గద్దెల ప్రాంగణంలో భక్తులు అస్వస్థతకు గురైతే వారికి సింగరేణి రెస్క్యూ టీం వెంటనే ప్రాథమిక చికిత్స జరిపి ఆసుపత్రికి చేర్చడం ద్వారా ప్రశంసలు పొందింది. భక్తులకు దర్శనం కోసం ఏర్పాటుచేసిన క్యూలైన్లలో రద్దీ విపరీతంగా పెరిగిన కారణంగా కొంత తొక్కిసలాట జరిగింది. చంటిపిల్లల తల్లులను, వృద్దులను జాతర జరిగిన మొదటి రెండురోజులు అధికారులు నేరుగా దర్శనం కోసం అనుమతించకపోవడంతో ఇబ్బంది జరిగింది. ఆర్టీసీ భక్తులను చేరవేయడంలో కొంత వైఫల్యం చెందిందనే విమర్శలు మూటకట్టుకుంది. ఆర్టీసీ బస్సులు వచ్చినవి నిలిపిన చోటు, వెళ్లే ప్రదేశం దూరంగా ఉండడంతో భక్తులు అవస్థలు పడ్డారు. ఆయా ప్రాంతాలకు వెళ్లేలా క్యూలైన్లను ఏర్పాటుచేసినా..అక్కడ బస్సులు అందుబాటులో లేక భక్తులు ఇబ్బంది పడ్డారు. దీంతో శుక్రవారం రాత్రి ఆర్టీసీ ప్రయాణప్రాంగణం వద్ద భక్తులు రాస్తారోకో చేశారు. ఇక జాతరలో పోలీసుల దురుసుప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తమ ‘వారిని’ విఐపి ద్వారం ద్వారా అనుమతించడం.. కలెక్టర్ రాహుల్, ఎంపి బలరాం, ఎమ్మెల్యే సీతక్కతోపాటు ట్రాన్స్‌కో అధికారులు, పత్రికలవారిని అడ్డుకోవడం పోలీసుల ప్రవర్తనకు అద్దంపట్టింది. పాసులు ఉన్నా పత్రికలవారిని పక్కకు నెట్టేశారు. క్యూలైన్లలో వచ్చిన సాధారణ భక్తులు అమ్మవార్ల ఆలయంలోకి ప్రవేశించడంతోనే పోలీసులు ఆడ, మగ, ముసలి, ముతక అని చూడకుండా అడ్డదిడ్డంగా నెట్టివేయడం కనిపించింది. ఈ జాతర అనుభవాలను అధికారులు సమీక్షించుకుని మళ్లీ రెండేళ్ల తరువాత వచ్చేజాతర ఏర్పాట్లను మెరుగుపరుచుకోవాలని భక్తజనం కోరుతోంది. కాగా జాతర వచ్చినపుడే సౌకర్యాల కల్పనకు దృష్టిపెడుతున్న అధికారులు శాశ్వత వసతుల కల్పనపై చొరవ తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేవేరుల జాతర జరుగుతున్న మేడారం ప్రాంత అభివృద్దిపైనా దృష్టి సారించాలి.
కానుకల హుండీలు తరలింపు..
సమ్మక్క-సారలమ్మల దేవాలయం నుంచి హుండీల తరలింపు కార్యక్రమం మొదలయింది. మేడారం జాతరకు వచ్చిన భక్తులు అమ్మవార్లకు సమర్పించిన మొక్కులు, కానుకలతో హుండీలు నిండిపోగా రెండు రోజులుగా వాటిని జాగ్రత్తపరిచిన దేవాదాయశాఖ అధికారులు శనివారం నుంచి వాటిని జాగ్రత్తగా పోలీసు బందోబస్తు నడుమ వరంగల్ జిల్లా కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
కాంగ్రెస్, టిడిపి అభ్యర్థుల
డిపాజిట్ గల్లంతే లక్ష్యం
* టిఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీష్‌రావు
స్టేషన్ ఘన్‌పూర్, ఫిబ్రవరి 11: రాబోయో అసెంబ్లీ ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టిడిపి అభ్యర్థుల డిపాజిట్‌లు గల్లంతు చేయడమే తెలంగాణ ప్రజలు లక్ష్యంగా పెట్టుకున్నారని టిఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత తన్నీరు హరీష్‌రావు అన్నారు. నియోజకవర్గ టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హరీష్‌రావుతోపాటు రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, వరంగల్ పశ్శిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌బాస్కర్, జిల్లా అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన పల్లెబాట కార్యక్రమంలో దాదాపు 90శాతం విజయవంతం అయిందని తెలిపారు. ఐదు మండలాల్లో నిర్వహించిన పల్లెబాట కార్యక్రమాన్ని వందశాతం నివేదిక తయారుచేసి సర్వే నిర్వహించగా తెలంగాణ వ్యతిరేకులైన కాంగ్రెస్, టిడిపిల డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమనే అభిప్రాయానికి ప్రజలు వచ్చారని అన్నారు. టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఒక్క నాడు కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించక పోవడం సిగ్గుచేటని ఆరోపించారు. నేడు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా డాక్టరు రాజయ్య తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనేందుకు ముందుకురావడం హర్షణీయమని అన్నారు.
తెలంగాణ ద్రోహులను