మహబూబ్‌నగర్, మార్చి 17: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజకీయ జెఎసి ఇచ్చిన సడక్ బంద్ సమయం దగ్గర పడుతుండటంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒకపక్క పోలీసులు, మరోపక్క తెలంగాణ వాదులు సమాయత్తమవుతున్న నేపథ్యంలో 21న జిల్లాలో ఏమి జరుగుతుందోనని ఉత్కంఠత నెలకొంది. జాతీయ రహదారిపై పోలీసు బలగాలను ఇప్పటికే మోహరింపజేశారు. కెసిఆర్ ఎంపిగా ప్రాతినిథ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లాలో సడక్ బంద్ కార్యక్రమం ఉండటంతో ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేయాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పిలుపునివ్వడమే కాకుండా పార్టీ ఎమ్మెల్యేలను సడక్ బంద్‌కు ఇన్‌చార్జిలుగా నియమించారు. సడక్ బంద్ కార్యక్రమం జెఎసి కార్యక్రమంగా కాకుండా టిఆర్‌ఎస్ కార్యక్రమంగా భావించి ప్రత్యక్ష కార్యచరణానికి దిగాలని పార్టీ శ్రేణులకు కెసిఆర్ హితబోధ చేయడంతో జిల్లాలో తెరాస ఎమ్మెల్యేలు ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం అన్ని నియోజకవర్గాలలో విస్తృత స్థాయి సమావేశాల పేరిట చైతన్య సదస్సులను నిర్వహించారు. షాద్‌నగర్, కొత్తకోట, అలంపూర్, మహబూబ్‌నగర్, గద్వాల, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, కొల్లాపూర్ తదితర నియోజకవర్గాలలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, కెటిఆర్, జూపల్లి కృష్ణారావు, వినయభాస్కర్, ఈటెల రాజేందర్, జోగు రామన్నతో పాటు పలువురు ఎమ్మెల్యేలు చైతన్య సదస్సుల్లో పాల్గొన్నారు. ఈనెల 21న జరిగే సడక్ బంద్‌లో టిఆర్‌ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని, సడక్ బంద్‌ను నిర్వహించి మరోసారి తెలంగాణ ఉద్యమ సత్తాను చాటాలని ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. ఒకపక్క కెసిఆర్ సోమవారం పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీకి వెళ్తుండగా మరోపక్క టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సడక్ బంద్‌పై సన్నాహాలను మొదలుపెట్టారు. సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణపై తీర్మానం పెట్టాలని కూడా పట్టుబట్టి అసెంబ్లీని నడవనీయకుండా అడ్డుకునేందుకు కూడా టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో సడక్ బంద్ కార్యక్రమం రావడంతో మరోసారి తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని టిఆర్‌ఎస్ శ్రేణులు మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, రోడ్లపైకి జనం వస్తే ఎలా ఎదుర్కోవాలనే వాటిపై పోలీసు యంత్రాంగం ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఏదిఏమైనా సడక్ బంద్ సమయం దగ్గర పడుతుండటం జిల్లాలో మాత్రం ఉత్కంఠత నెలకొంది.
* రంగంలోకి తెరాస శ్రేణులు * రహదారి దిగ్బంధానికి ఆరు పాయింట్లు ఎంపిక
english title:
sadak bandh
Date:
Monday, March 18, 2013