Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సెక్స్ వయోపరిమితి తగ్గిస్తే ఊరుకోం

$
0
0

జైపూర్, మార్చి 17: పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనేవారి వయో పరిమితిని 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు కుదించాలనే ప్రభుత్వ యోచన పట్ల ఆర్‌ఎస్‌ఎస్ తీవ్రంగా విరుచుకుపడింది. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలకు కనీసం 18 ఏళ్లు నిండాలన్న నియమానికి ప్రభుత్వ ఆలోచన భంగం కలిగిస్తోందని, శృంగారానికి వయోపరిమితిని 16 ఏళ్లకు కుదించడం ద్వారా పెళ్లికి ముందే లైంగిక సంబంధాలను ప్రభుత్వం కోరుకుంటున్నట్లా అని ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు భైయా జోషి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమాజం అంగీకరించదన్న ఆయన ఆర్‌ఎస్‌ఎస్ దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తుందని స్పష్టం చేశారు. గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన 2013 నేర చట్టం సవరణ బిల్లులో చేసిన ప్రతిపాదనల్లో శృంగారానికి వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలనేది కూడా ఉంది. దీనిపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, ముస్లీం సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు రోజులపాటు జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ ముగింపు సందర్భంగా ఆదివారం ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్‌డోలీలో మీడియాతో జోషి మాట్లాడారు. కాగా, ముస్లీం ఆధిపత్య దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని హిందువులపై జరుగుతున్న హింసపై సభలో ఓ తీర్మానాన్ని ఆమోదించామన్నారు. ఈ తీర్మానంలో పాక్, బంగ్లాదేశ్‌లలో హిందువుల భద్రత పట్ల స్పష్టమైన హామీనిస్తూ ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆ రెండు దేశాల నుంచి వచ్చిన హిందూ శరణార్థులకు పునరావాసం కల్పించి, వారికి సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్నిచ్చేలా ఓ జాతీయ శరణార్థి పునరావాస విధానానికి ముసాయిదాను తీసుకురావాలని తీర్మానం డిమాండ్ చేసింది. ఇదిలావుంటే మార్చి 15న జమ్‌డోలీలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రారంభించిన ఈ సభకు 1,350 మంది సభ్యులు హాజరయ్యారు.
అబార్షన్లు పెరుగుతాయి
న్యూఢిల్లీ: సెక్స్ వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు కుదిస్తే దేశంలో అబార్షన్లు పెరుగుతాయంటూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తప్పుబట్టారు. పశ్చిమ దేశాల సంస్కృతిని మరింతగా అమల్లోకి తీసుకొచ్చే చర్యగా దీన్ని అభివర్ణించిన ఆయన దీని మూలంగా అవాంఛిత గర్భధారణలు అధికమవుతాయని హెచ్చరించారు. అంతేగాక యువతలో ఎయిడ్స్ వంటి లైంగిక వ్యాధులు ప్రబలే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

లంక సమస్యపై మిత్రపక్షాలతో చర్చిస్తాం

విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్

లక్నో, మార్చి 17: శ్రీలంక తమిళుల సమస్యపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్‌లో తీర్మానంపై ఓటింగ్ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు డిఎంకెతో పాటుగా ఇతర మిత్రపక్షాలను సంప్రదిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆదివారం స్పష్టం చేసారు. ‘మిత్రపక్షాలు, ముఖ్యంగా డిఎంకెతో సమావేశమైన తర్వాతే ఈ నెలాఖరులో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్‌లో శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానంపై ఓటు చేసే విషయంలో యుపిఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’ అని ఖుర్షీద్ చెప్పారు. అయితే ఇద్దరు భారతీయ జాలర్ల హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ దేశానికి చెందిన ఇద్దరు నావికులను భారత్‌కు తిప్పి పంపడానికి ఇటలీ నిరాకరించిన అంశంపై మాత్రం ఎక్కువగా మాట్లాడడానికి మంత్రి ఇష్టపడలేదు. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై చర్చించలేనని అన్నారు. విదేశాంగ మంత్రిగా ఉన్న తాను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కూడా ఆయన అన్నారు.
ప్రధానిపై బురదచల్లడం సరికాదు: టిఎన్‌సిసి
శ్రీలంక తమిళుల సమస్యపై తమిళనాడులోని తమిళ అనుకూల గ్రూపులు ప్రధానిపైన, కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వంపైన బురదచల్లడానికి ప్రయత్నించడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్‌లో శ్రీలంకకు వ్యతిరేకంగా అమెరికా ప్రతిపాదించే తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. శ్రీలంకపై ఆర్థిక ఆంక్షలు విధించాలన్న డిమాండ్ల వల్ల అక్కడి తమిళులకే నష్టం జరుగుతుందని, లంకలోని తమిళలుకోసం గృహ నిర్మాణ ప్రాజెక్టు సహా భారత్ చేపట్టిన పలు పునరావాస పథకాలు లాంటివి ఆగిపోతాయని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు కూడా అయిన బిఎస్ జ్ఞాన దేశికన్ అన్నారు.
శ్రీలంకలోని తమిళుల తరఫున మాట్లాడుతున్నది భారత్ ఒక్కటేనని, ఒకవేళ ద్వైపాక్షిక సంబంధాలను తెగతెంపులు చేసుకున్నట్లయితే వాళ్లు ఇబ్బందుల్లో పడతారని పార్టీ తరఫున విడుదల చేసిన ప్రకటనలో ఆయన అన్నారు.

వరకట్న వేధింపుల కేసు
ఒడిశా మాజీ మంత్రి
కుమారుడి అరెస్టు
భువనేశ్వర్/కటక్, మార్చి 17: వరకట్నం కోసం భార్యను వేధించిన కేసులో ఒడిశా మాజీ న్యాయశాఖ మంత్రి రఘునాథ్ మొహంతి కుమారుడు రాజశ్రీ మొహంతీని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వేధింపులకు సంబంధించి సాక్ష్యాధారాలు ఉండటంతో కటక్ వద్ద రాజశ్రీని అరెస్టు చేసినట్లు ఒడిశా పోలీసు శాఖకు చెందిన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ (హెచ్‌ఆర్‌పిసి) అడిషనల్ డైరెక్టర్ జనరల్ విజయ్‌కుమార్ శర్మ తెలిపారు. మాజీ మంత్రి రఘునాథ్ మొహంతి సహా ఇతర కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తారా అని విలేఖరులు ప్రశ్నించగా, విచారణ కొనసాగుతోందని, అవసరమైన మేరకు చర్యలు తీసుకుంటామని శర్మ పేర్కొన్నారు. బాధితురాలి భర్తపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నామని, సాక్ష్యాధారాలను బట్టి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రాజాశ్రీని ఎక్కడ అరెస్టు చేశారనే దానిపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా శర్మ దాటవేశారు. ఈ పరిస్థితిలో ఆ వివరాలు వెల్లడించడం అంత మంచిది కాదన్నారు. ఆదివారం రాజాశ్రీని విచారించామని, బాలసోర్ కోర్టులో హాజరుపరుస్తామని, రిమాండ్‌కు తీసుకునే ఆలోచన ఏదీ లేదన్నారు. కాగా, ఈ నెల 14న రాజాశ్రీ భార్య బర్షావౌని చౌధురి బాలాసోర్‌లో వరకట్న వేధింపుల కేసు దాఖలు చేశారు. దీంతో రాజాశ్రీ ముందస్తు బెయిల్ కోసం ఒడిశా హైకోర్టును ఆశ్రయించారు. ఎనిమిది నెలల క్రితమే వీరి వివాహమైంది. వరకట్న వేధింపుల ఆరోపణలు వచ్చిన మరుసటి రోజే నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న రఘునాథ్ మొహంతి రాజీనామా చేశారు.

స్విస్ టూరిస్టుపై గ్యాంగ్ రేప్

నేరాన్ని అంగీకరించిన
ఐదుగురు గ్రామస్థులు

భోపాల్, మార్చి 17: మధ్యప్రదేశ్‌లో స్విట్జర్లాండ్ పర్యాటకురాలిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి ఐదుగురు గ్రామస్థులు తమ నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు. భర్తతో కలసి బాధితురాలు భారత్‌లో సైకిల్ యాత్ర చేస్తుండగా ఆరుగురు దుండగులు శుక్రవారం రాత్రి వారిపై దాడి జరిపి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆ దంపతుల వద్దగల విలువైన వస్తువులను దోచుకున్నట్టు పోలీసులు తెలిపారు. దాతియా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని, అయితే 20 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి డి.కె.ఆర్య తెలిపారు. శుక్రవారం రాత్రి ఏడెనిమిది మంది దుండగులు తన భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, అయితే ఆ సమయంలో చీకటిగా ఉండటంతో ఈ దారుణానికి ఒడిగట్టిన దుండగులు ఎంతమంది అన్నది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నామని ఆ దంపతులు పోలీసులకు వివరించారు. కాగా, బాధితురాలికి శనివారం గ్వాలియర్ నగర సమీపంలోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందించి ఆ తర్వాత విడుదల చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
టూరిస్టుపై సామూహిక అత్యాచారం అత్యంత దురదృష్టకరమని, అయితే విదేశీ టూరిస్టులు నిబంధనలు పాటించడం లేదని మధ్యప్రదేశ్ హోంమంత్రి ఉమాశంకర్ గుప్తా వ్యాఖ్యానించారు. విదేశీ టూరిస్టులు తమ ప్రయాణ సమాచారాన్ని స్థానిక పోలీసులకు తప్పనిసరిగా తెలియజేయాలని, ఈ పద్ధతిని ఎవరూ పాటించడం లేదని అన్నారు. టూరిస్టులు తమ ప్రణాళికను స్థానిక పోలీస్ సూపరింటెండెంట్‌కు అందజేయాలన్నారు. పట్టణ శివారు ప్రాంతంలో స్విట్జర్లాండ్ టూరిస్టులు టెంట్ వేసుకున్నారని, అయితే జరిగిన సంఘటన దురదృష్టకరమని ఉమాశంకర్ వ్యాఖ్యానించారు. ఇకముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా మరిన్ని చర్యలు చేపడతామన్నారు.
స్విస్ ప్రభుత్వం దిగ్భ్రాంతి
భారత్‌లో తమ పర్యాటకురాలు అత్యాచారానికి గురవడం దిగ్భ్రాంతి కలిగించిందని స్విట్జర్లాండ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ దారుణానికి పాల్పడిన దుండగులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని స్విట్జర్లాండ్ విదేశాంగ శాఖ బెర్న్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఈ విషయమై భారత్‌లోని తమ దౌత్యాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, బాధిత దంపతులకు అవసరమై సహాయాన్ని అందించాల్సిందిగా వారిని ఆదేశించామని స్విస్ ప్రభుత్వం పేర్కొంది.

పిడుగు పడి
12 మంది మృతి
భోపాల్, మార్చి 17: మధ్యప్రదేశ్‌లో అకాల వర్షాలు ముంచెత్తుతున్న తరుణంలో పిడుగుల బారిన పడి 12మంది మృతిచెందారు. శనివారం రాత్రి సాగర్ జిల్లాలో పిడుగు పడి వేర్వేరు ప్రాంతాల్లో ఓ బాలుడు సహా ఐదుగురు మరణించారు. పొలంలో పనిచేస్తున్న సమయంలో వీరు పిడుగు బారినపడ్డారు. అలాగే రాజ్‌ఘడ్ జిల్లాలో మరో ఇద్దరు, బెరాసియా తహశీల్ పరిధిలో మరో ఇద్దరు, దామోహ్, తికమ్‌గఢ్ జిల్లాల్లో ఒక్కొక్కరు, బేగంగంజ్ తహశీల్‌లో మరొకరు మృతి చెందారు. మృతులను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

కాగా, పిడుగుపాటుతో జరిగిన ప్రాణనష్టంతో పాటు అకాల వర్షాలవల్ల గోధుమ పంట తీవ్రంగా దెబ్బతింది. మామిడి తోటలకు విపరీతమైన నష్టం వాటిల్లింది. పంట నష్టం అంచనా వేయాలని రెవెన్యూ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

‘అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు అనవసరం’
న్యూఢిల్లీ, మార్చి 17: అగ్రవర్ణాల్లోని పేదల సంక్షేమం కోసం బీహార్‌లోని జెడి (యు)-బిజెపి ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయడంపై జెడి (యు) సీనియర్ నాయకుడు శివానంద్ తివారీ ఆదివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్ల కోటా ద్వారా ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం లేదని, పేదరికం నుంచి బయటపడేందుకు వీలుగా వారికి సరైన ఆదాయం లభించేలా ప్రభుత్వం చర్యలు చేపడితే సరిపోతుందని ఆయన అన్నారు. కేవలం వెనుకబడిన తరగతులు, దళితులకు మాత్రమే ఉద్దేశించిన రిజర్వేషన్ల ద్వారా అగ్రవర్ణాల్లోని పేదలకు ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం ఉందని తాను భావించడం లేదని శివానంద్ తివారీ పేర్కొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ హెచ్చరిక
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>