చెన్నై, మార్చి 17: శ్రీలంక తమిళుల సమస్యను కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంపై మండిపడుతున్న యుపిఏ భాగస్వామ్య పక్షం డిఎంకె ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్‌లో ఈ అంశంపై అమెరికా ప్రతిపాదించే తీర్మానానికి సవరణలు తీసుకురాని పక్షంలో సంకీర్ణ ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని మరోసారి హెచ్చరించింది. ‘మా డిమాండ్లను నెరవేర్చని పక్షంలోయుపిఏ కూటమితో మా సంబంధాలు కొనసాగుతాయన్నది అనుమానమే.. కొనసాగబోమని కచ్చితంగా చెప్తున్నాను’ అని డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధి ఆదివారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. కాగా, ఈ అంశంపై ప్రభుత్వ వైఖరి తనను ఆశాభంగానికి గురి చేసిందని పేర్కొంటూ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఆయన మరో లేఖ రాసారు.
శ్రీలంకలో యుద్ధ నేరాలకు సంబంధించి, అలాగే వీటిపై అంతర్జాతీయ విచారణకు డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్‌లో అమెరికా ప్రతిపాదించే తీర్మానానికి సవరణలను ప్రతిపాదించాలన్న తమ డిమాండ్‌ను అంగీకరించని పక్షంలో కేంద్ర ప్రభుత్వంలోని తమ పార్టీ నామినీలను ఉపసంహరించుకుంటామని కరుణానిధి ఇంతకుముందు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేస్తూ ఈ వ్యాఖ్యలు చేసారు. ఆదివారం హడావుడిగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కరుణానిధి మాట్లాడుతూ, భారత్ చేసే సవరణలను అమెరికా అంగీకరిస్తుందా లేదా అనే దానితో సంబంధం లేకుండా మానవ హక్కుల కౌన్సిల్‌లో మన దేశం ఈ సవరణలను ప్రతిపాదించాలని అన్నారు. ప్రభుత్వం నుంచి తమ పార్టీ తప్పుకుంటుందని తాను హెచ్చరించిన తర్వాత కేంద్రం నుంచి ఎవరు కూడా తనను సంప్రదించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా కరుణానిధి చెప్పారు.
2004నుంచి యుపిఏ భాగస్వామ్య పక్షమైన డిఎంకెకు లోక్‌సభలో 18 మంది సభ్యులతో పాటుగా కేంద్ర మంత్రివర్గంలో ఒక క్యాబినెట్ మంత్రి, నలుగురు సహాయ మంత్రులున్నారు.
కాగా, ఈలం తమిళులపై శ్రీలంక సైన్యం, ప్రభుత్వం మూకుమ్మడి మారణకాండకు, యుద్ధ నేరాలకు పాల్పడిందని, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలపై ఒక విశ్వసనీయమైన, స్వతంత్ర అంతర్జాతీయ కమిషన్ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ అమెరికా తీర్మానానికి భారత్ సవరణలు తీసుకు రావాలని ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి మరోసారి రాసిన లేఖల్లో కరుణానిధి డిమాండ్ చేసారు. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం దృష్ట్యానే తాను ఈ లేఖలు రాయక తప్పడం లేదని శనివారం రాత్రి ఫ్యాక్స్‌లో ప్రధానికి, సోనియా గాంధీకి పంపిన లేఖల్లో కరుణానిధి స్పష్టం చేసారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో తమిళులకు అన్యాయం జరుగుతోందన్న భావన రాష్ట్రంలోని వివిధ వర్గాల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో ఉందని ఆయన అన్నారు. తాను ఎంతో ఆవేదనతో, కేంద్ర ప్రభుత్వం తనను నిరాశకు గురి చేస్తోందన్న భావనతో ఈ లేఖలు రాస్తున్నట్లు ఆయన అంటూ, తీర్మానానికి సవరణలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికయినా తమిళుల్లో నెలకొని ఉన్న ఈ భావాలను పోగొట్టడానికి చర్యలు తీసుకుంటుదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. తంజావూరులో ఒక బౌద్ధ సన్యాసిపై దాడి చేసి కొట్టడం గురించి విలేఖరులు అడగ్గా, అది సరికాదని కరుణానిధి అన్నారు.
తప్పకుండా శుభవార్త వింటాం: చిదంబరం
2009లో శ్రీలంకలో జరిగిన యుద్ధ నేరాలపై స్వతంత్రమైన, విశ్వసనీయ దర్యాప్తుకు డిమాండ్ చేసే పక్షంలో అమెరికా తీర్మానాన్ని భారత్ సమర్థిస్తుందన్న నమ్మకం తనకు ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం శనివారం తన నియోజకవర్గం శివగంగలోని కారైకుడిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. ‘మీరు తప్పకుండా ఓ శుభవార్త వింటారు. అప్పటిదాకా ఓపికతో ఉండండి. నాకు ఆ విశ్వాసం ఉంది. అంతేకాదు, ఐరాసలో అమెరికా తీర్మానం ప్రతిపాదించే ఈ నెల 22 దాకా తాను జనానికి ఈ విషయం చెప్తూనే ఉంటానని కూడా ఆయన అన్నారు.
తమిళనాడులోని విద్యార్థులు నిరసన ప్రదర్శనలు జరుపుతుండడమే కాకుండా ఈ నెల 20న భారీ ప్రదర్భ నిర్వహించాలని అనుకుంటున్న విషయం తనకు తెలుసునని చిదంబరం అంటూ, విద్యార్థుల్లో కూడా ఈ విషయాన్ని ప్రచారం చేయాలని పార్టీ కార్యకర్తలను కోరారు.
లంక తమిళుల సమస్యపై కరుణానిధి మరోసారి హెచ్చరిక * ప్రధానికి, సోనియాకు మళ్లీ లేఖ
english title:
maa
Date:
Monday, March 18, 2013