నాగపూర్, మార్చి 17: కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన పంట రుణాల మాఫీ పథకంలో జరిగిన అవకతవకలకు సంబంధించి తన వద్ద తగినన్ని సాక్ష్యాలున్నాయని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అమలుచేసిన పంట రుణాల మాఫీ పథకంలో 52వేల కోట్ల రూపాయలు అసలైన లబ్ధిదారులకు చేరలేదని ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) బయట పెట్టిన నేపథ్యంలో హజారే ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. వేల కోట్ల విలువ కలిగిన ఈ పథకంలో రికార్డులను కూడా తారుమారు చేశారని కాగ్ వెల్లడించిన విషయం విదితమే. రుణమాఫీ పథకంలో దారితప్పిన నిధులకు సంబంధించిన సాక్ష్యాధారాలను పరిశీలించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిన పక్షంలో వాటిని అందజేస్తానని హజారే స్పష్టం చేశారు. మహారాష్టల్రో నెలకొన్న కరవు పరిస్థితులు మనిషి సృష్టించినవేనని, ప్రకృతిసిద్ధంగా ఏర్పడినవి కావన్నారు. అయితే ఆయన దగ్గరున్న సాక్ష్యాధారాలకు సంబంధించిన వివరాలను మాత్రం వివరించలేదు. రాజకీయ నాయకుల ఉదాసీనత, అవినీతి కలగలసి నీటి వనరులను సంరక్షించడంలో విఫలం కావడానికి దోహదపడ్డాయని హజారే ఆరోపించారు. నీరు, నేల సంరక్షణలో శాస్ర్తియ విధానాలను పాటించకుండా ఏళ్ల తరబడి అలసత్వాన్ని ప్రదర్శించారని, దాని ఫలితాన్ని ఇప్పుడందరూ అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న జాతీయ సమస్యలను రాహుల్‌గాంధీ గానీ, నరేంద్రమోడీగానీ పరిష్కరించలేరని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గుజరాత్‌లో లోకాయుక్త నియామకాన్ని మోడీ వ్యతిరేకించడాన్ని హజారే తప్పుబట్టారు.
పంట రుణాల మాఫీ కుంభకోణంపై అన్నా హజారే
english title:
naa
Date:
Monday, March 18, 2013