విశాఖపట్నం, మార్చి 17: విశాఖపట్నం జిల్లా మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై ఇప్పటివరకూ రాజకీయ నాయకులు అటూఇటూ తేల్చకుండా చేస్తున్న ప్రకటనలకు తెరదించుతూ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు కచ్చితమైన ప్రకటన చేశారు. మన్యంలోని గూడెం కొత్తవీధిలో ఆదివారం జరిగిన సమగ్ర గిరిజన ప్రగతి సదస్సుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రులు జైరాం రమేష్, కిశోర్ చంద్రదేవ్, రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, బాలరాజు, గంటా శ్రీనివాసరావు, ధర్మాన ప్రసాదరావు తదితరులు హాజరయ్యారు. సదస్సులో మన్యంలో జరుగుతున్న బాక్సైట్ తవ్వకాలపైనే ప్రధానంగా ప్రసంగం సాగింది. బాక్సైట్ తవ్వకాలను కిశోర్ చంద్రదేవ్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా చట్ట వ్యతిరేకంగా తవ్వకాలు జరపబోమని చెబుతున్నారు. నాలుగేళ్ళ కిందటే విశాఖ మన్యంలో పర్యటించిన్పప్పుడు జైరాం రమేష్ కూడా బాక్సైట్ తవ్వకాలపై తుది నిర్ణయం తీసుకోలేదని, జరిగిన ఒప్పందాలను పునఃపరిశీలిస్తామని వెల్లడించారు. కానీ ఆదివారం ఈ ముగ్గురూ కలిసి స్పష్టమైన ప్రకటన చేశారు. ముందుగా కిశోర్ చంద్రదేవ్ మాట్లాడుతూ ఫిబ్రవరి నాలుగో తేదీన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఒక సమావేశం జరిగిందని వివరించారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి చిదంబరం, హోం మంత్రి షిండే, పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్, గనుల శాఖ మంత్రి, న్యాయ శాఖ మంత్రి హాజరయ్యారన్నారు. దేశంలోని షెడ్యూల్డ్ ప్రాంతాలన్నీ రాజ్యాంగంలో భాగమని అన్నారు.
గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు భూములు కొనుగోలు చేయడానికి కానీ, లీజుకు తీసుకోడానికి కానీ వీల్లేదని స్పష్టంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఉభయ పార్టీలు అవగాహనా రాహిత్యంతో ఒప్పందాలు చేసుకున్నారని కిశోర్ చంద్రదేవ్ అన్నారు. వారు తెలుసో తెలియకో చేసుకున్న ఒప్పందాలు చెల్లవని ఆయన స్పష్టం చేశారు. 1/70 చట్ట ప్రకారం ఆ ఒప్పందాలను అమలు చేయాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. ఆ ఒప్పందాల ఆధారంగా బాక్సైట్ మైనింగ్ చేయడానికి అవకాశం లేదని మంత్రి కిశోర్ చంద్రదేవ్ తెలిపారు. ఈ విషయమై గిరిజనులకు ఎటువంటి భయం అక్కర్లేదని అన్నారు. తను పార్వతీపురం ఎంపిగా ఉన్నప్పుడే, బాక్సైట్ ఒప్పందాలను వ్యతిరేకించానని కిశోర్ గుర్తు చేశారు.
చట్ట వ్యతిరేకంగా వ్యవహరించం: ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల విషయంలో తాము చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించబోమని స్పష్టం చేశారు.
తవ్వకాలపై 20 ఏళ్ళ నిషేధం విధించాలి: జైరాం
కేంద్ర అటవీశాఖ మంత్రి జైరాం రమేష్ మాట్లాడుతూ విశాఖ మన్యంలో బాకైట్ తవ్వకాలను తను, రాష్ట్ర మంత్రి బాలరాజు వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంతంలో మైనింగ్ తవ్వకాలపై 20 ఏళ్ళపాటు నిషేధం విధించాలని ఆయన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు గిరిజనులకు చక్కని విద్య, ఆరోగ్యం, వౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో గిరిజనులు ప్రయోజనం పొందిన దాఖలాలు ఎక్కడా లేవని ఆయన అన్నారు. మైనింగ్ లీజులు తీసుకున్న వారికి మాత్రమే లాభం చేకూరిందని అన్నారు. మావోయిస్టు కార్యకలాపాలను అణచివేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని జైరాం రమేష్ అన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మావోయిస్టు సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. మావోయిస్టుల అణచివేతలో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్న చర్యలను పై రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని చూస్తున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం వలన మావోయిస్టు సమస్యను అధిగమించగలిగిందని అన్నారు. గిరిజనులకు కనీస సౌకర్యాలను అందించడం ద్వారా మావోయిస్టుల సమస్యను తుడిచివేయగలిగిందని అన్నారు. అన్నింటికీ మించి రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండడం వలన మావోలు ఈ రాష్ట్రంలోకి అడుగుపెట్టలేకపోతున్నారని జైరాం రమేష్ అన్నారు. భారత దేశంలో 82 జిల్లాల్లో మావోయిస్టుల సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. అందులో జార్ఘండ్, ఛత్తీస్‌గడ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధానంగా ఉందని అన్నారు. గిరిజనులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నా, అసంతృప్తితో ఉన్నా, పనుల్లేక వలస పోయే పరిస్థితులు ఉన్నా, మావోయిస్టులు వారికి ఆశ్రయం కల్పించి, తద్వారా ప్రభుత్వాన్ని అస్థిర పరుస్తారని అన్నారు. అయితే, ఈ రాష్ట్రంలో అటువంటి పరిస్థితుల్లేవని రమేష్ అన్నారు. ఒక శుభోదయాన పాడేరు ఐటిడిఎ మావోయిస్టు ఫ్రీ ప్రాంతంగా ప్రకటించేందుకు నోచుకుంటుందని మంత్రి జైరాం ఆశాభావం వ్యక్తం చేశారు.
బాక్సైట్‌పై వీరి భావమేమి?
రద్దని చెప్పేందుకు నీళ్ళు నమిలిన మంత్రులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 17: విశాఖ మన్యంలో విలువైన బాక్సైట్ ఖనిజ తవ్వకాలపై రాష్ట్ర మంత్రులకు ఏపాటి అవగాహన ఉందో అర్థం కావట్లేదు. జికె వీధి పర్యటనలో పాల్గొన్న కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వై.కిశోర్‌చంద్రదేవ్ బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి రెండు గంటలు గడవక ముందే రాష్ట్ర మంత్రులు బాక్సైట్ తవ్వకాలపై అర్థంకాని ప్రకటన చేశారు. బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తారా? అని విలేఖరులు ప్రశ్నించగా, వారు కచ్చితమైన సమాధానమిచ్చేందుకు వెనుకంజ వేశారు. ఈ విషయంలో చట్టపరంగా, రాజ్యాంగ బద్ధంగా ముందుకు వెళ్తామని గిరిజన సంక్షేమమంత్రి పి.బాలరాజు, ఓడరేవులు, వౌలికవసతుల కల్పన మంత్రి గంటా శ్రీనివాస రావు పేర్కొన్నారు. దీనిపై తమ ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారని దాటవేత ధోరణి అవలంబించారు.