Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘మధ్యాహ్న భోజనం’ అమలులో రాష్ట్రంలోనే జిల్లాకు మొదటి స్థానం

$
0
0

చిత్తూరు, మార్చి 18: మధ్యాహ్న భోజన పథకం అమలు కార్యక్రమంలో రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉందని ఆ శాఖ కేంద్ర డైరెక్టర్ గయాప్రసాద్, రాష్ట్ర డైరెక్టర్ ప్రణతిసుహాసినిలు ప్రశంసల వర్షం గుప్పించారు. ఈనెల 2వ తేది నుండి 17వ తేది వరకు జిల్లాలోని పలు మండలాల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలుపై తాము పరిశీలించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు సంవత్సరంలో కనీసం రెండు వందల రోజులైన పౌష్టికాహారం అందించాలనే సదుద్దేశంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తుందన్నారు. ఈపథకం అమలుపై దేశంలోనే చిత్తూరు జిల్లాను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి మధ్యాహ్న భోజన అమలుపై గత పదిహేను రోజులుగా చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా సోమవారం జిల్లా కేంద్రమైన చిత్తూరులోని షర్మన్ బాలికోన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామాజిక తనిఖీ జాతీయ డైరెక్టర్ గయాప్రసాద్, స్టేట్ డైరెక్టర్ ప్రణతిసుహాసినిలు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రతినిత్యం అందించే మధ్యాహ్న భోజన పథకాన్ని చిత్తశుద్దితో అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి పొరబాట్లు జరిగినా భోజనం వండే కార్మికులను నిష్పక్షపాతంగా విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం విజయవంతంగా జరగడం సంతోషదాయకమన్నారు. ఈసందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేస్తూ తనకు మంచి పేరు తెచ్చిపెట్టిన వర్కర్లకు అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో వందలాది మంది మధ్యాహ్న భోజన వర్కర్లు, చిత్తూరు రూరల్ మండలం ఎంఇఓ జయప్రకాష్, సోషియల్ ఆడిట్ వర్కర్ కవిత తదితరులు పాల్గొన్నారు.

కన్నుల పండువగా కోదండరాముని రథోత్సవం
తిరుపతి, మార్చి 18: శ్రీకోదండరాముని నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు సోమవారం సీతాపతి సతీసమేతంగా దారురథంలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. స్వామివారి రథం ముందు సైన్యంగా రాజదర్పంతో గజరాజులు, ఆశ్వాలు, నందులు కదులుతుండగా.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి వైభవం రసరమ్యంగా సాగింది. మరోవైపు కోలాటాలు, చెక్క్భజనలు, కేరళ ఉడిపి వాయిద్యాలు, భక్తజన సందోహాల మధ్య అత్యంత వేడుకగా రథోత్సవం సాగింది. భక్తులు చేసే సీతారామ. రామ.. రామ.. రామ నామ స్మరణల మధ్య సాగిన రథవైభవం వర్ణనాతీతం. ఈ రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. మాడావీధుల్లో బారులు తీరి మంగళ హారతులు పలుకుతూ భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. కుంభలగ్నంలో ప్రారంభమైన ఈ రథోత్సవం మాడావీధుల విహారం అనంతరం యథాస్థానానికి చేరిన అనంతరం వేద శాత్తుమొర నిర్వహించి హారతి పలికారు. ఈ కార్యక్రమంలో టిటిడి పెద్ద జియ్యర్ స్వామి, చిన్న జియ్యర్‌స్వామి, ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం, జెఇఓ వెంకట్రామిరెడ్డి, సివిఎస్‌ఓ జివిజి అశోక్‌కుమార్, అర్బన్ ఎస్‌పి రాజశేఖర్‌బాబు, ఎస్‌ఇ సుధాకర్‌రావు, స్థానిక ఆలయాల కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్‌పిళ్లై, ఎఇఓ ప్రసాదమూర్తిరాజు, సూపరింటెండెంట్ సురేష్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు, ఆంజనేయులు, శేషారెడ్డి తదితర అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అశ్వ వాహనంపై కనువిందు చేసిన తేజోవంతుడు
శ్రీకోదండరామస్వామి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవరోజు సోమవారం రాత్రి అశ్వ వాహనంపై తేజోవంతుడైన శ్రీరామచంద్రుడు కల్కి అవతారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చాడు. సర్వాలంకార భూషితుడైన సీతారాముడు చర్నాకోల్ చేతబట్టి పురవీధుల్లో విహరిస్తూ భక్తుల కోర్కెలను ఈడేర్చారు. కలియుగాంతంలో కల్కి రూపం ధరించి కత్తిచేతబూని అశ్వ వాహనంపై స్వామి దుష్టజన సంహారం చేస్తాడని పురాణాలు చెపుతున్నాయి. ప్రతి యుగంలోనూ తాను అవతరిస్తానని తెలియజెపుతూ ఈ అవతారం తెలియజేస్తుంది. శ్రీమహావిష్ణువు తొలిచూపుల వేళ, ప్రణయవేళ, పరిణయవేళ సాక్షిగా నిలిచినది అశ్వమే. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి వైభవాన్ని తిలకించేందుకు భక్తులు బారులు తీరి మంగళ హారతులు పలికారు. వాహనం ముందు కోలాటాలు... పండరి భజనలు. చెక్క్భజనలు.. సాంస్కృతిక కార్యక్రమాలు గుజ్జన గూళ్లు, తప్పెటగుళ్లు.. డప్పుల నృత్యాలు.. మహిళా బృందాలతో కూడిన భజన మండళ్లు భక్తులను కనువిందు చేశాయి. కోరిన కోర్కెలు తీర్చే కోదండరాముని దర్శనంతో భక్తజనం పులకించింది.
శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
శ్రీకోదండరామస్వామి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎమిదవరోజు సోమవారం ఉదయం 7.30 గంటలకు శ్రీస్వామివారికి స్నపన తిరుమంజన సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాహన మండపంలో మూడు దఫాలుగా నిర్వహించే స్నపన తిరుమంజన వేడుకలను ఆగమ శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.

ఎస్వీ మెడికల్ కళాశాల హాస్టల్‌లో ఎంబిబిఎస్ విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతి, మార్చి 18: ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న సుష్మ (23) అనే విద్యార్థిని సోమవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు పట్టణంలో చిన్నపాటి వ్యాపార దుకాణం నడుపుతున్న చంద్రశేఖర్‌రెడ్డి తన ఒక్కగానొక్క కుమార్తెను డాక్టర్‌గా చూడాలని కలలుగన్నారు. అందుకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఎంబిబిఎస్ సీటుసాధించిన సుష్మ తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో చేరింది. చదువులో కూడా మంచి ప్రతిభ కనపరిచే సుష్మా సోమవారం మధ్యాహ్నం కళాశాలకు వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉండిపోయింది. సాయంత్రం కళాశాల ముగిసిన తరువాత హాస్టల్‌కు వెళ్లిన తోటి విద్యార్థినులు సుష్మ గదిలో ప్యాన్‌కు వేలాడుతూ ఉండటాన్ని చూసి జీర్ణించుకోలేకపోయారు. ఏమి జరిగిందో ఏమో కాని జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి విద్యార్థులు చెపుతున్నారు. తన బిడ్డ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించడం చూపరులను కంటతడిపెట్టించింది. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

‘సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి’
కలికిరి, మార్చి 18: ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సిఎం సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో పడా ప్రత్యేక ప్రత్యేకాధికారి పెంచల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహిళా సంఘాల సమావేశంలో వారు మాట్లాడుతూ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గానికి అదనంగా 12వేల గ్యాస్‌కనెక్షన్‌లు దీపం పథకం కింద మంజూరైనట్లు తెలిపారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు అవిరళ కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికే వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కలికిరి పంచాయతీ పరిధిలోని తుమ్మలపేట, సత్యాపురం, చక్కరవాండ్లపల్లె, రాజువారిపల్లె, అంకింవారిపల్లె, చెరువుముందరపల్లె, చింతలవారిపల్లె, గడావాండ్లపల్లె, కొత్తపేటవీధి, ఇందిరమ్మకాలనీ, అమరనాధ్‌రెడ్డినగర్, బిడికాలనీ, రెడ్డివారిపల్లె, కురవపల్లె, మంగమ్మనగర్, పొట్టేకులవారిపల్లెకు చెందిన మహిళా సంఘాలకు 780 గ్యాస్ కనెక్షన్‌లు దీపం పథకం కింద పంపిణీ చేశారు. రేషన్‌కార్డులు మంజూరు చేయాలని మహిళలు విన్నవించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర అధికార భాషా సంఘం సభ్యుడు వెంపల్లె అబ్దుల్ ఖాదర్, మండల తహశీల్దారు కులశేఖర్, సింగిల్‌విండో అధ్యక్షులు సురేంద్రరెడ్డి, మండల ప్రత్యేకాధికారి నరసింహులునాయక్, మాజీ ఎంపిపి రహమతుల్లా, జిల్లా ఉల్మా ఉపాధ్యక్షులు హజరత్‌ముస్త్ఫా, ఎంపిడిఓ రాజశేఖర్‌రెడ్డి, వెలుగు సిసి మధుసూదన్‌రెడ్డి, మండల సాక్షరభారత్ కోఆర్డినేటర్ శంకర్, నల్లారి కుటుంబీకులు, సంఘమిత్ర లీడర్లు లైలా, కన్యాకుమారి, అధికసంఖ్యలో మహిళా సంఘాలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకునిపై హత్యాయత్నం
రేణిగుంట, మార్చి 18: అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్ జ్యోతినారాయణపై సోమవారం ఉదయం హత్యాయత్నం జరిగింది. పోలీసుల కథనం మేరకు జ్యోతినారాయణ తన ద్విచక్ర వాహనంలో పాంచాలినగర్ గంగమ్మగుడి వెనుక వైపున నుంచి వస్తుండగా, వడ్డిమిట్టకు చెందిన వాసు (25) అనే యువకుడు వెనుక వైపున నుంచి తన స్కూటర్‌తో ఢీకొట్టి కత్తితో పొత్తికడుపు, భుజం మీదా పొడిచి గాయపరిచాడు. రక్తపు మడుగులో పడివున్న ఆయన్ను స్థానికులు, బంధువులు తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గతంలో సర్పంచ్‌గా పని చేసిన ఆయన అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారని కితాబుయిచ్చారు. అటువంటి వ్యక్తిపై హత్యాయత్నం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ ఊహగానాలు మొదలవడంతో కుట్ర పూరితంగా హత్యాయత్నం జరిగిందన్నారు. ఈ సంఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని పోలిసులను కోరారు. పట్టణంలోని ప్రజలు ఆశీస్సులతో వున్నంత వరకు అతనికి ఏమికాదన్నారు. గంగమ్మతల్లి ఆశీస్సులతో తొందరగా కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని డిసిసిబి వైస్‌చైర్మన్ సిద్దాగుంట సుధాకర్‌రెడ్డి పరామర్శించారు. అర్బన్ సిఐ రమణకుమార్ కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
టిడిపి జిల్లా నేత జెఎంసి ధ్వజం
గంగాధరనెల్లూరు, మార్చి 18: అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు జెఎంసి శ్రీనివాసులు ధ్వజమెత్తారు. సోమవారం పల్లెపల్లెకు తెలుగుదేశంపార్టీ కార్యక్రమం సందర్భంగా సాయంత్రం తూగుండ్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు జగన్మోహన్‌రెడ్డి లక్షల కోట్ల నిధులను అడ్డదారిలో సంపాదించుకొని పార్టీ పెట్టి మరో పర్యాయం ప్రజలను ఏమార్చేందుకు జైలునుంచే పన్నాగాలు పన్నుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విఫలం చేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రైతాంగానికి తొమ్మిది గంటల పాటు విద్యుత్‌తోపాటు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ఎంతో కృషి చేశారన్నారు. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర దిగ్విజయంగా జరుగుతోందని, రైతులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు చంద్రబాబు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని, రానున్న స్థానిక, అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, దీన్ని గుర్తెరిగి నాయకులు, కార్యకర్తలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరారు. ఈకార్యక్రమానికి విచ్చేసిన జెఎంసి శ్రీనివాసులకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దేవసుందరం, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మనోహర్‌నాయుడు, నాయకులు వెంకటేశ్, రామ్‌బాబురెడ్డి, జీవ, శాంతకుమార్, సుధాకర్‌రెడ్డి, అశోక్‌నాయుడులతోపాటు భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెద్దిరెడ్డి చేరికతో వైఎస్‌ఆర్‌పి బలోపేతం
* చింతల రామచంద్రారెడ్డి స్పష్టం
పీలేరు, మార్చి 18: పుంగనూరు ఎమ్మెల్యే, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసిపిలో చేరికతో జిల్లా అంతటా 14 నియోజకవర్గాల్లో గ్రామీణస్థాయి నుంచి పార్టీ బలోపేతం అవుతుందని మాజీ ఎమ్మెల్యే, పీలేరు నియోజకవర్గ వైసీపి ఇన్‌చార్జ్ చింతల రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం స్థానిక పి.ఎల్.ఆర్ ఆవరణంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు ప్రతి గడపకు చేరాయన్నారు. ఆయన మరణం తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సంక్షేమ పథకాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించిన ఆయన వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సిఎం వైఖరితో విసుగు చెందిన పెద్దిరెడ్డి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో జిల్లావ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు నూతనోత్తేజంతో మే నెలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధవౌతున్నట్లు చెప్పారు. ఈనెల 20న పెద్దిరెడ్డి జిల్లాకు వస్తున్న సందర్భంగా పీలేరు నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలకాలని పేర్కొన్నారు. 20వతేదీ తర్వాత స్థానిక సంస్థల పోరుకు నాయకులు, కార్యకర్తలతో చర్చించి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో నాయకులు నారే వెంకట్రమణారెడ్డి, జిలానీ, షఫీ, ఉదయ్‌కుమార్, సతీష్‌రెడ్డి, కత్తిరామలింగారెడ్డి, సర్వోత్తమరెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.

ప్రతి చిన్నారికి విటమిన్-ఎ ఇవ్వాలి
డిఎంహెచ్‌ఓ డాక్టర్ దశరథరామయ్య ఆదేశం
బైరెడ్డిపల్లె, మార్చి 18: మండల కేంద్రమైన బైరెడ్డిపల్లెలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డిఎంహెచ్‌ఓ డాక్టర్ ఎన్ దశరథరామయ్య సందర్శించారు. ఈసందర్భంగా ఆయన చిన్నారులకు విటమిన్-ఎ ద్రావణం పంపిణీ కార్యక్రమంపై ఆరా తీశారు. ఈనెల 18నుండి 23వ తేదీ వరకు కొనసాగే ఈకార్యక్రమం విజయవంతం చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అంధత్వ నివారణకు ఈకార్యక్రమం దోహదపడుతున్నందున వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు అంగన్‌వాడీ కార్యకర్తలు ఈకార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలన్నారు. బైరెడ్డిపల్లె పిహెచ్‌సి పరిధిలో బైరెడ్డిపల్లె, బేలుపల్లె, కమ్మనపల్లె, జాలారుపల్లె గ్రామాల్లో 11 అంగన్‌వాడీ కేంద్రాల్లో అంధత్వ నివారణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించినట్లు వైద్యాధికారి నూరుల్లా పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో 9నెలల నుంచి 12నెలల వయస్సు గల 65మంది చిన్నారులకు 1ఎంఎల్ ద్రావణం తాగించాలని, 1-5 సంవత్సరాల వయస్సు గల 430మంది చిన్నారులకు 2ఎంఎల్ విటమిన్ ఎ తాగించాలని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మండలంలోని తీర్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాలుగు గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సోమవారం 0-5 వయస్సు కలిగిన 225మంది చిన్నారులకు విటమిన్ ఎ తాగించామని వైద్యాధికారి మహేష్‌బాబు పేర్కొన్నారు.

ఎర్రచందనం పట్టివేత
పుత్తూరు, మార్చి 18: పుత్తూరు మండలంలోని తడుకు వద్ద అటవీ అధికారులు చేసిన తనిఖీల్లో వాహనంతో సహా ఎర్రచందనం పట్టివేసినట్లు అటవీశాఖాధికారి నాగరాజు వెల్లడించారు. సోమవారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం ప్రకారం ఈనెల 17వతేది రాత్రి తడుకు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ లారీ అతివేగంగా వెళ్లిందన్నారు. లారీని వెంబడించగా లారీలోని వారు పారిపోయినట్లు ఆయన చెప్పారు. లారీలోని 116 ఎర్రచందనం దుంగల బరువు 4వేల 137కేజిలు ఉన్నాయని, లారీతో కలసి సుమారు 20లక్షల రూపాయలు విలువ ఉంటుందన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ తనిఖీలో ఆర్. జయశంకర్, బి. శ్రీరాములు, నారాయణవనం బీట్ ఎ. సుబ్రహ్మణ్యం, టి.నాగయ్య, డ్రైవర్లు సురేష్, తారక్ తదితరులు పాల్గొన్నారు.

అరకొర కేటాయింపులు
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మార్చి 18: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం శాసన సభలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు ఆశించిన స్థాయిలో నిధుల కేటాయింపులు జరగలేదు. జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో ప్రారంభించిన నీటిపారుదల ప్రాజెక్టుల్లో చాలా వరకు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇప్పటి వరకు ఖర్చు చేసిన వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరయింది. చివరికి నిర్వాసితులకు చెల్లించాల్సిన బకాయిలు సైతం వందల కోట్లలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్మాణాల కోసం రూ. 639.10 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ నిధులతో ప్రాజెక్టుల ప్రగతి నత్తతో పోటీ పడక తప్పదు. తెలుగుగంగకు రూ.154 కోట్లు, గాలేరు నగరకి రూ.321 కోట్లు, పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు రూ.82 కోట్లు, మైలవరం ప్రాజెక్టు మరమ్మతుల కోసం రూ.10 కోట్లు, కెసి కెనాల్ అధునీకరణకు రూ.70 కోట్లు, చెయ్యేరు ప్రాజెక్టు నిర్వహణకు రూ.2 కోట్లు, బుగ్గవంక ప్రాజెక్టు అధునీకరణకు రూ. 10 లక్షలు కేటాయించారు. ఈ కేటాయింపులతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. బడ్జెట్‌లో అన్ని రంగాలకు అరకొరగానే నిధుల కేటాయింపు జరిగింది. దీంతో జిల్లాలో జలయజ్ఞం కింద జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఇప్పట్లో పూర్తి అయ్యే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. నీటిపారుదల శాఖ కేటాయించిన నిధులు కేవలం సిబ్బందిజీతభత్యాలకే సరిపోయే పరిస్థితి ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో అనేక ప్రాజక్టులను మంజూరు చేశారు. ఆయన చొరవతో నీటిపారుదల ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. దీనితో జిల్లాలో చాల వరకు ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా సాగింది. ఆయన మరణానంతరం ముఖ్యమంత్రి కె రోశయ్య కానీ ప్రసుత్త ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కానీ పెద్దగా నిధులు విడుదల చేయలేదు. దీంతో జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టుల నిర్మాణం అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే అయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు లభించే అవకాశాలు ఉన్నాయి. నిధుల కోసం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నోళ్లు తెరుచుకుని ఎదురూ చూసినా ఈ బడ్జెట్‌లో ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వక పోవడం గమనార్హం. అన్ని రంగాలలో కూడా రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు ఏమాత్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో జిల్లా అభివృద్ధి కుంటుపడే అవకాశాలున్నాయి. జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం, రిమ్స్ మెడికల్ కళాశాల, పశువైద్యశాల, పులివెందులలో పశు పరిశోధన కేంద్రానికి కూడా బడ్జెట్‌లో పెద్దగా నిధులు కేటాయించలేదు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ పుణ్యమాని సంబంధిత వర్గాలకు, హాస్టల్ విద్యార్థులకు గుడ్డి కన్నా మెల్ల నయం అనే చందంగా ఉంది. మిగిలిన అన్నీ సంక్షేమ పథకాలకు అరకొరగా నిధులు విదిల్చి చేతులు దులుపుకున్నారు. బడ్జెట్‌లో జిల్లాకు జరిగిన కేటాయింపులపై జిల్లా వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చిన్నారి హత్యకేసు దర్యాప్తులో నిర్లక్ష్యం
అగ్రహించిన మహిళలు
చెన్నూరు, మార్చి 18: చెన్నూరు మండలం శివాల్‌పల్లి గ్రామానికి చెందిన మానస (8) హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై మహిళల్లో ఆగ్రహం పెల్లుబికింది. వారం రోజుల కిందట పాఠశాలకు వెళ్లిన బాలికపై అత్యాచారం జరిపి, హత్య చేసిన సంఘటనలో నిందితులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కడప, చెన్నూరుకు చెందిన మహిళా సంఘాలు మండల సమాఖ్య సభ్యులు చెన్నూరు, శివాల్‌పల్లెకు చెందిన గ్రామ ప్రజలు సోమవారం ఉదయం నుంచి కొత్త రోడ్డు జాతీయ రహదారిపై మహిళలు బైఠాయించారు. 3 గంటల పాటు రోడ్డు దిగ్బంధం చేయడంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సిఐ శివన్న, ఎస్సై రాజగోపాల్ రాస్తారోకో జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని మహిళలకు సర్దిచెప్పడానికి విఫలయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు మహిళా నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డి ఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి రంగంలోకి దిగినా ఫలితం కనిపించలేదు. దీనితో ఎస్పీ మనీష్‌కుమార్‌సిన్హా స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య సంఘటన జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ నిందితులను పట్టుకోవడంలో సిఐ శివన్న నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఎస్పీకి మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. చివరకు ఎస్పీ న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. హత్యకు గురైన బాలిక తల్లి కుటుంబ సభ్యులతో ఎస్పీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్న సిఐ శివన్నను తొలగించి మరో సిఐ నాగేశ్వరరెడ్డితో కేసు దర్యాప్తు చేస్తామని, ఈ కేసుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నిందితులను పట్టుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఆర్‌ఆర్ పాఠశాలకు సంబంధించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని బాధితులకు ఎస్పీ నచ్చచెప్పారు. ఎస్పీ చెన్నూరు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి మానస హత్య కేసుతో పాటు శనివారం రాత్రి జరిగిన పేరిజాన్ అనే మహిళ కేసు విషయంపై సిఐ, ఎస్సైలతో చర్చించారు.

కష్టాల సాగుతో నష్టాల దిగుబడి!
రాజంపేట, మార్చి 18: వర్షాభావంతో వరుసగా రెండేళ్లు కరవును ఎదుర్కొన్న రాజంపేట డివిజన్‌లోని ఆయకట్టు రైతాంగంతో పాటు బోరు బావుల కింది వాణిజ్య పంటలపై ఆధారపడే రైతులు కూడా ఈ ఏడాది కష్టకాలంలో నడుస్తున్నారు. వర్షాలు పడితే తప్ప వారి బతుకులు బాగుపడే పరిస్థితి కనిపించడం లేదు. చినుకు రాలకపోతే వ్యవసాయానికి స్వస్తి చెప్పి ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలోఇతర వృత్తులపై ఆధారపడక తప్పనిసరి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2011, 2012 సంవత్సరాలు వరుసగా వర్షాభావ పరిస్థితులతో డివిజన్‌లోని ఆయకట్టు మొత్తం బీడుగా మారింది. ఎక్కడ చూసినా కంప చెట్లు, బీడు భూములే దర్శనమిచ్చాయి. పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిన డివిజన్‌లో ప్రస్తుతం రైతాంగానికి ప్రకృతి కరుణిస్తే తప్ప గడవని పరిస్థితి ఉంది. ఈ ప్రాంతలో పూర్తిగా వర్షాధారంపైనే అత్యధికశాతం రైతులు ఆధారపడి ఉన్నారు. రైతుల కష్టాలు కళ్ల ముందు కదలాడుతునప్పటికీ పాలకులు చలించడం లేదు. భూగర్భ జల వనరులను రైతులకు అందుబాటులోకి తెచ్చే పథకాలపై దృష్టి సారించడం లేదు. దీనికి తోడు రైతు ప్రకృతితో పోరాడాల్సి వస్తోంది. ప్రతిఏడు పెనుగాలుల రూపంలో ప్రకృతి వైపరీత్యాలు, గిట్టుబాటుధరలు లేకపోవడం, సరైన మార్కెటింగ్ వసతుల కొరత, పండ్ల నాణ్యత తగ్గడం, తెగుళ్లు తదితర కారణాలతో పండ్ల తోటల రైతాంగం నష్టాలను చవి చూస్తోంది. వర్షాలు లేక చెరువులు, కుంటలు, మడుగులు ఎండిపోయి ఆయకట్టు రైతులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. గత రెండేళ్లూ సరైన వర్షాలు లేని కారణంగా మామిడి పూత తగ్గింది. దీనితో మామిడి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయానికి విద్యుత్తు సరఫరాను ఒక ఫీడర్ కింద నిరాటంకంగా 7 గంటలపాటు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరో ఫీడర్ కింద మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఇస్తే పండ్లతోటలకు వసతిగా ఉంటుంది. అయితే విద్యుత్ కోతకు తోడు, నిరంతరాయంగా సరఫరా లేకపోవడం కూడా రైతుల కష్టాలకు కారణమవుతోంది. గతంలో రాత్రుళ్ళు మాత్రమే విద్యుత్ సరఫరా ఉండడంతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఏర్పడడంతో సహనం కోల్పోతున్నారు. తగినన్ని వర్షాలు లేకపోవడంతో అందుబాటులో ఉన్న వనరులతో సాగులోకి దిగిన రైతులకు అప్పుడప్పుడూ వీచే గాలులు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అరటి, ప్రొద్దుతిరుగుడు, బొప్పాయి పంటలకు ఏ మాత్రం గాలులు వీచినా కోట్ల రూపాయల్లో నష్టాలు వస్తాయి. ఈ పండ్ల తోటలు ఈ డివిజన్‌లో విస్తారంగా ప్రస్తుతం రైతులు బావులు, బోర్లకింద ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి సహకరిస్తే తప్ప రైతులు బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. అలాగే పెనుగాలులు లేకుండా కరుణిస్తేనే పంట చేతికి వస్తుంది. గతంలో పలుసార్లు వీచిన పెనుగాలుల కారణంగా రాజంపేట, పుల్లంపేట, ఓబులవారిపల్లి, ఒంటిమిట్ట, రైల్వేకోడూరు, నందలూరు, చిట్వేలి, పెనగలూరు తదితర మండలాల్లో పండ్ల తోటల రైతాంగాన్ని తీవ్రంగా నష్టాల పాలు చేసింది. ప్రస్తుతం వేల ఎకరాల్లో ఈ పంటలు సాగవుతున్న నేపధ్యంలో రైతుల పట్ల ఏ మాత్రం ప్రకృతి వికటించినా రైతుల బతుకు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. అలాగే ప్రకృతి కరుణించి సరైన వర్షాలు పడకుంటే ఈ ఏడాది ఆయకట్టు రైతులు బతుకులు ఘోరంగా మారతాయనడంలో సందేహం లేదు. అందుకనే స్థానికంగా ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని, పండ్ల తోటలకు బీమా సౌకర్యాన్ని సరళతరం చేయాలన్న విజ్ఞప్తులు ప్రభుత్వంపై ఎక్కువవుతున్నాయి. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పండ్ల తోటల పెంపకానికి ముందుకొచ్చేందుకు ప్రకృతి వైపరీత్యాల ఏర్పడితే నష్టపోకుండా ఉండేందుకు బీమా సౌకర్యాన్ని సరళతరం చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది. వర్షాధారంపై ఇక్కడి రైతులు ఆధారపడకుండా ఇక్కడి భూగర్భజలవనరులను వెలికితీసే పథకాలకు శ్రీకారం చుట్టాల్సి ఉంది. పాలకుల చొరవ, అధికారుల శ్రద్ధ లేకపోవడంతో పంట నష్టపోయిన రైతులకు బీమా సౌకర్యం లభించడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని రకాల బీమా పథకాలు అమల్లోకి తెచ్చినా వాటిని రైతుల దరి చేరనివ్వడం లేదు. గత రెండేళ్లుగా ప్రకృతి కరుణించకపోవడం, సరైన వర్షాలు లేకపోవడం, పెనుగాలుల కారణంగా డివిజన్‌లో అటు ఆయకట్టు రైతులు, ఇటు పండ్ల తోటల రైతాంగం నష్టాల పాలయింది. ఏది ఏమైనా డివిజన్‌లో ఆయకట్టు రైతాంగంతో పాటు పండ్ల తోటల రైతాంగాన్ని ప్రకృతి నష్టాల నుండి రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

కలెక్టరేట్ ఆవరణలోనే లంచావతారం
కడప క్రైం, మార్చి 18: సాక్షాత్తు కలెక్టర్ ఆదేశించిన పనికి కలెక్టరేట్ ఆవరణలోనే లంచం తీసుకుంటున్న ఓ సర్వేయర్‌ను ఎసిబి అధికారులు వల వేసి పట్టుకున్నారు. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలావున్నాయి. చిన్నమండెం మండల కేంద్రానికి చెందిన గురుప్రసాద్‌రెడ్డి గత నెల 18వ తేదీన జరిగిన గ్రీవెన్స్ సెల్‌లో కలెక్టర్‌ను కలిసిన తన తోటను ఆనుకుని ఖాళీగా ఉన్న తన భూమిని మరో వ్యక్తి కబ్జా చేశాడని ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చిన్నమండెం సర్వేయర్ చల్లా మల్లికార్జునరెడ్డి చొరవ చేసి సమస్య పరిష్కరించడానికి తనకు ఐదువేలు లంచంఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ముందుగా రూపొందించుకున్న వ్యూహం ప్రకారం బాధితుడు సర్వేయర్‌తో మాట్లాడారు. అడిగిన సొమ్ము ఎక్కడ ఇవ్వాలని అడిగాడు. కలెక్టరేట్ ఆవరణలోనే అని చెప్పడంతో ఎసిబి అధికారులు అక్కడ వల పన్నారు. బాధితుడి నుండి నాలుగు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడిచేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి డిఎస్పీ కృష్ణార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో సిఐ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఆవరణలో గ్రీవెన్స్ జరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది.

విజృంభిస్తున్న విషజ్వరాలు
సుండుపల్లె, మార్చి 18: మారుమూల గ్రామాల అభివృద్ది కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతోంది. అయితే ఇందుకు భిన్నంగా మండలంలోని పూజారివాండ్లపల్లె సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. అధికారుల పర్యవేక్షణాలోపం కారణంగా ఈ గ్రామంలో మంచినీటి పథకం పని చేయడంలేదు. దోమల వల్ల విష జ్వరాలు బెంబేలెత్తిస్తున్నాయి. మండలంలోని చిన్నగొల్లపల్లె పంచాయతీ పూజారివాండ్లపల్లెలో 40 కుటుంబాల వారు జీవిస్తున్నారు. వీరంతా కూలిపని చేసుకొని పొట్ట నింపుకొంటున్నారు. అయితే గ్రామంలోని మంచి నీటి పథకం రెండు నెలల నుంచి పనిచేయడం లేదు. దీంతో గ్రామంలో ఉన్న చేతి పంపుపై ఆదారపడ్డారు. అయితే ఈ చేతి పంపులో చిలుము, మట్టితో కూడిన నీరు వస్తోంది. గత్యంతరం లేక ఆ నీటిని తాగేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. పశువులు, ఇంటి అవసరాల కోసం గ్రామానికి పక్కనే ఉన్న పాచి బావిలో నీరు తీసుకొస్తున్నారు. ఈ నీటిని ఉపయోగిస్తున్నప్పటి నుండి గ్రామస్థులు రోగాల బారిన పడ్డారు. ఇంటికి ఒకరు, ఇద్దరు చొప్పున మలేరియా, టైపాయిడ్ వంటి విష జ్వరాలతో మంచానపడ్డారు. కొందరు స్థానిక ఆసుపత్రులలో చికిత్సచేసుకొనగా, మరి కొం దరు రాయచోటి, కడపలలో వేలాది రూపాయలు వెచ్చించి చికిత్స చేయించుకొన్నారు. అలాగే గ్రామానికి సరైన బస్సు సౌకర్యంతో పాటు కనీసం ఆటో కూడా గ్రామానికి రాదు. దీంతో ఆసుపత్రికి వెళ్ళాలంటూ రూ. 200 వెచ్చించి ఆటోను తీసుకెళ్ళాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు బోరు మరమ్మతులు చేయించి వైద్య శిబిరాన్ని నిర్వహించాలని కోరుతున్నారు.

రిమ్స్‌లో రిలే నిరాహారదీక్షలు
కడప (క్రైం), మార్చి 18: రిమ్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సోమవారం రిలే నిరాహార దీక్షలను సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి ఓ శివశంకర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు రిమ్స్ ఆస్పత్రి గుండెలాంటిదని రిమ్స్ అభివృద్ధికి పుష్కలంగా నిధులు ఉన్నా వాటిని నిరుపయోగం చేస్తున్న రిమ్స్ డైరెక్టర్‌ను తక్షణమే తొలగించాని పేర్కొన్నారు. అలాగే తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, రిమ్స్‌లోని డైరక్టర్ పదవికి అర్హత లేని ఆయనను రాజీనామా చేయాలని, రిమ్స్‌లోని మెడికల్, డెంటల్, నర్సింగ్, శానిటేషన్ కార్మికుల పిఎఫ్, ఇఎస్‌ఐ సమస్యలు పరిష్కరించాలని రిమ్స్ కాంట్రాక్టర్లు అయినా ఎజిల్, నక్షత్ర కాంట్రాక్టర్లను రద్దుచేయాలని ప్రధానమైన డిమాండ్లు. డైరెక్టర్ చేస్తున్న ఆగడాలపై కలెక్టర్ విచారించి అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని జైల్‌కు పంపాలని కోరారు. డైరెక్టర్‌ను అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. రిమ్స్‌లో పని చేస్తున్న మెడికల్, డెంటల్, నర్సింగ్, శానిటేషన్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఉన్నత ప్రమాణాలతోనే విద్యార్థులకు భవిష్యత్తు
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మార్చి 18: ఉన్నత విద్య ప్రమాణాలతో ఎదిగినప్పుడే విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని, క్రమశిక్షణ, పట్టుదల ఉన్నప్పుడే విద్యా రంగంలో విద్యార్థులు రాణించగలరని జెఎన్‌టియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె ప్రేమ చంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం కడప నగర పరిధిలోని గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంజనీరింగ్ కళాశాల నిర్వహించడం కష్టతరమేనన్నారు. అయితే గ్లోబల్ కళాశాల అన్నీ హంగులతోపాటు ఉన్నత విద్యా ప్రమాణాలతో నెలకొల్పడడం హర్షణీయమన్నారు. విద్యార్థుల శక్తి సామర్థ్యాలను గుర్తించి కొత్త పరిశోధనలు చేయడం పట్ల ఆయన యాజమాన్యాన్ని అభినందించారు. 2012- 2013 సంవత్సరాల్లో అకడమిక్ కో ఆర్డినేటర్ ఫ్రొఫెసర్ జివి శేషారెడ్డి ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు చేపట్టిన ప్రయోగాల ద్వారా నాలుగు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పొందడం జిల్లాకే గర్వకారణమన్నారు. మాజీ మేయర్ పి రవీంద్రనాధ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ కళాశాల యాజమాన్యం విద్యా బోధన, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వ్యయ ప్రయాసల కోర్చి నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. కళాశాల ముఖ్య సలహాదారుడ

సామాజిక తనిఖీలో కేంద్ర, రాష్ట్ర డైరెక్టర్ల ప్రశంసలు
english title: 
m

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>