Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పంచాయతీ పోరుకు రంగం సిద్ధం!

$
0
0

కర్నూలు, మార్చి 23: జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ నాయకులు సిద్ధపడుతున్నారు. వచ్చే మే నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ గుర్తులు లేకుండా నిర్వహించే ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందుకు ఆయా పార్టీలు సిద్ధపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు తాజా ఓటర్ల జాబితా ప్రకారం గ్రామాల్లోని ఓటర్లలో బిసి, ఎస్సీ, ఎస్టీ ఓటర్లను వర్గీకరించి ఏ గ్రామంలో ఏ వర్గానికి చెందిన ఓటర్లు ఎంత మంది ఉన్నారనే దానితో పాటు గత ఎన్నికల్లో ఆయా గ్రామాల రిజర్వేషన్ల వివరాలతో కూడిన నివేదికను కూడా జిల్లా అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. కొత్త ఓటర్ల జాబితా ప్రకారం పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ప్రతి 500 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని, అవసరమైతే ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్న చోట కూడా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఎలాంటి అవాంతరాలు లేని పక్షంలో మే నెల తొలి వారంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారని అభిప్రాయపడుతున్నారు. అధికారికంగా తాము ఇప్పటికే సిద్ధపడ్డామని, నివేదికలు కూడా పంపామని వారంటున్నారు.
ఇక రాజకీయ పార్టీల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గ్రామ స్థాయిలో వార్డుల వారీగా పార్టీ కార్యకర్తలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించే పనిలో పడ్డారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ కమిటీలు ఏర్పాటు చేసి పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించే బాధ్యత వారికి అప్పగించనున్నట్లు పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. డిసిసి అధ్యక్షులతో సమావేశమైన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించే వారికి తగిన గుర్తింపునిస్తూ పార్టీ, ప్రభుత్వ పదవులకు వారి పేర్లను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడిస్తున్నారు. మరో 15 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి కమిటీల నియామకం పూర్తి చేస్తామని ఆ తరువాత ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తామని వెల్లడిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల కంటే ముందు జిల్లాలోని ప్రముఖ నేతలు, ఎమ్మెల్యేలతో గతంలో మాదిరిగానే బస్సు యాత్ర చేసే అవకాశాలపై సమాచాలోచనలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్నా నమ్మలేమని విపక్ష పార్టీలు తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార పార్టీ ఎన్నికలు నిర్వహించబోదని వారు ధీమాతో ఉన్నారు. అయితే ఎన్నికలు ఏ క్షణాన నిర్వహించినా తాము సిద్ధంగా ఉన్నామని, గెలుపు తమదేనన్న విశ్వాసాన్ని రెండు పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు. టిడిపి ఇప్పటికే బూత్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామంలో కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించి ఎన్నికలకు సిద్ధపడాలని సూచించింది. జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను ప్రకటించిన ఆ పార్టీ ఆయా నియోజకవర్గాల్లో విజయం సాధించే బాధ్యత వారికి అప్పగించింది. వైకాపా విషయానికొస్తే ఇంకా గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయలేదు. జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలకు సైతం నియోజకవర్గ ఇన్‌చార్జిలను నియమించాల్సి ఉంది. ఆ ప్రక్రియను తొందరలోనే పూర్తి చేస్తామని పేర్కొంటున్న ఆ పార్టీ నేతలు ప్రజా బలంతో తాము విజయం సాధించడం ఖాయమన్న ధీమాతో ఉన్నారు. మొత్తం మీద వేసవి ఎండలతో పాటు రాజకీయ వేడి క్రమేణా రాజుకుంటోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
రుణం తీర్చుకుంటా..
* మండిగిరి సభలో కేంద్ర మంత్రి కోట్ల హామీ
ఆదోని, మార్చి 23 : ఈ ప్రాంత ప్రజలు తమ కుటుంబాన్ని రాజకీయంగా ఆదరించడం వల్ల ఎన్నో ఉన్నత పదవులు పొందామని, అందు కు ప్రతి ఫలంగా ఇక్కడి ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకుంటానని రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధి లోని మండిగిరి గ్రామంలో శనివారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కోట్ల మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించి రుణం తీర్చుకుంటానన్నారు. తాను కేంద్ర మంత్రి కాకముందు దక్షిణ మధ్య రైల్వేకు బడ్జెట్లో రూ. 400 కోట్లు కేటాయించేవారని, ఇప్పుడు రూ. 1,040 కోట్లు తీసుకు వచ్చానన్నా రు. కర్నూలులో రైల్వేకోచ్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి ఈ ప్రాంతంలోని ప్రజలకు ఉపాధి కల్పిస్తానన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే 5 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దక్షిణాది ప్రాంతానికి గతంలో రైల్వే బడ్జెట్లో అన్యాయం జరిగిందని, ఇప్పు డు జరగకుండా చూస్తానని చెప్పారు. తుంగభద్ర నదీనీరే తమకు భవిష్యత్తు అని పేర్కొన్నారు. ఎల్లెల్సీ నీరు రావాలంటే అదనపు పైపులైన్ వేసి తీసుకురావాలన్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో నీటి ఎద్దడి ఉందని, రూ. 10 కోట్లు ఖర్చు చేసి బోర్లు వేసిన భూగర్భజలాలు లేకపోవడం వలన ఫలితం లేకుండాపోయిందని చెప్పారు. కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడి తాము నీరు తీసుకొచ్చామన్నారు. తుంగభద్ర నీటితోనే తాగునీటి సమస్య తీరుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్య, మాజీ కౌన్సిలర్లు నీలకంఠప్ప, రామచంద్ర, చిరంజీవి అభిమాన నాయకులు మల్లప్ప, మాజీ ఉప ఎంపిపి శ్రీకాంతరెడ్డి, ఆదినారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విట్టాకిష్టప్ప, డిప్యూటీ జాయింట్ కలెక్టర్ రామస్వామి, తహశీల్దార్ బాలగణేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రుణాలు పొందాలంటే
నమ్మకం ముఖ్యం
* మంత్రి టిజి వెంకటేష్
కల్లూరు, మార్చి 23: బ్యాంకుల ద్వా రా రుణాలు పొందాలంటే నమ్మకం ఎంతో ముఖ్యమని, ఇది వరకే రుణా లు తీసుకున్న వారు క్రమం తప్పకుం డా చెల్లించి ఇతరులకు మార్గదర్శకం గా నిలిచినప్పుడే బ్యాంకులు, ఖాతాదారులు అభివృద్ధి బాటలో నడుస్తారని మంత్రి టిజి వెంకటేష్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో శనివారం ఆంధ్ర బ్యాంకు జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో డిఆర్‌ఐ పథకం ద్వారా వెయ్యి మంది లబ్ధిదారులకు అందజేస్తున్న కోటి రూపాయల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి టిజి ప్రారంభించారు. తొలుత ఆంధ్రబ్యాంకు వ్యవస్థాపకులు పట్ట్భా సీతారామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రబ్యాంకు పేద ప్రజల పక్షాన నిలబడి రుణాలు ఇవ్వడం అభినందనీయమన్నారు. చిన్న వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అతితక్కువ వడ్డీతో రుణాలు అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. వరదల్లో నష్టపోయిన కర్నూలు నగర ప్రజలు ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి బాటలో నడవాలన్నారు. పావలా వడ్డీ సక్రమంగా చెల్లించి ఖాతాదారులకు వడ్డీ లేని రుణాలు అందించడానికి బ్యాంకులు ముందుకు రావడం సంతోషదాయకమన్నారు. గతంలో వున్న కర్నూలు నగరానికి ప్రస్తుతం ప్రజలకు కనబడుతున్న నగరానికి ఎంతో తేడా వుందన్నారు. నగరంలో రోడ్లు, కాలువలు, పార్కులు, తాగునీటి సౌకర్యం అందిస్తున్నామని, రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా నగరంలో మురికి వాడల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నామన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన సౌకర్యాలను అందించడానికి సిద్ధంగా వున్నానని మంత్రి హామీ ఇచ్చారు. జెసి కన్నబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను బ్యాంకులు తమ భుజ స్కంధాలపై మోసి పేదలకు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో ఎల్‌డిఎం అండావర్, ఆంధ్ర బ్యాంకు డిజిఎం దుర్గా ప్రసాద్, ఎజిఎం మురళీకృష్ణ, నగరంలోని బ్యాంకు మేనేజర్లు, అధికారులు, మాజీ కార్పొరేటర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
‘పది’ ప్రశ్నపత్రం
తారుమారుపై విచారణ
* పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర పరిశీలకుడు నిజాముద్దీన్
నందికొట్కూరు, మార్చి 23: 10వ తరగతి పరీక్షల ప్రారంభం రోజే తెలుగు పేపర్-1 ప్రశ్నపత్రం తారుమారుపై విచారణలో భాగంగా శనివారం రాష్ట్ర పరిశీలకుడు నిజాముద్దీన్ పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలుగు పేపర్-1కు బదులు సంస్కృతం పేపర్ ఇవ్వడంపై జరిగిన సంఘటన గురించి విద్యార్థుల నుంచి సమాచారం సేకరించి, బాధ్యులైన ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్లు రాధమ్మ, హైమావతిలను పరీక్ష కేంద్రం చీఫ్ వసంత, డిపార్ట్‌మెంట్ ఉమాశంకర్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలో తమకు సంస్కృతం పేపర్ ఇచ్చారని, ఇన్విజిలేటర్లకు తెలిపినా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు. దీంతో ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించి, తదుపరి విచారణకు డిఇఓను ఆదేశించారు. అనంతరం మిడ్తూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశాడు.
మానవసేవే మాధవ సేవ
* సుప్రీంకోర్టు జడ్జి సింఘ్వీ
పెద్దకడుబూరు, మార్చి 23: మానవసేవయే మాధవసేవగా గుర్తించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్ సింఘ్వీ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని హనుమాపురం గ్రామశివార్లలో న్యాయవ్యాది పురుషోత్తంరెడ్డి సహకారంతో వెంకమ్మ చార్టిబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేదలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్ సింఘ్వీ చేతులమీదుగా దుస్తులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమాజసేవను దృష్టిలో ఉంచుకొని దానగుణం అలవర్చుకోవాలని సూచించారు. తల్లిపేరిట చార్టిబుల్ ట్రస్టును స్థాపించి నిరుపేదలకు సేవ చేయడాన్ని అభినందించారు. పుట్టిన ప్రతిజీవి మొదటిగా అమ్మ అంటుందన్నారు. అన్ని ప్రేమలకన్నా తల్లిప్రేమ మిన్న అని, తల్లిని గౌరవించడం పిల్లల బాధ్యత అని వివరించారు. సమాజసేవలో భాగస్వాములు కావడం ఆదృష్టంగా భావించాలన్నారు. సమాజంలో ఎందరో అనాధలు, అభాగ్యులను చేరదీసి వారిపట్ల మానవత్వాన్ని చూపించాలని కోరారు. సమాజసేవ చేస్తూ తల్లిదీవెనలు పొందడం గొప్ప భాగ్యమని వెల్లడించారు. ప్రతి ఒక్కరు సేవాదృక్పదంతో మెలగాలని, ఇతరుల పట్ల సోదరభావాన్ని కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రమణ, హైకోర్టు న్యాయమూర్తులు జస్టీస్ సుభాష్‌రెడ్డి, జస్టీస్ శేషషయనారెడ్డి, జస్టీస్ నరసింహారెడ్డి, హైకోర్టు న్యాయవాది పురుషోత్తంరెడ్డి, జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, జస్టీస్ చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా న్యాయమూర్తులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
కన్నుల పండువగా
యాగంటీశ్వరుని రథోత్సవం
ఓర్వకల్లు, మార్చి 23: మండల పరిధిలోని ఎన్.కొంతలపాడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున యాగంటీశ్వరస్వామి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. అలంకరించిన స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను రథంపై వుంచి దేవాలయం నుంచి గ్రామం వరకూ లాగి తిరిగి యథాస్థానంలో వుంచారు. రథోత్సవానికి వివిధ గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నందికోల సేవ, ప్రొద్దుటూరు సెవెన్ స్టార్ గోల్డెన్ ఆర్కెస్ట్రా వారి సంగీత విభావరి అలరించింది. అంతకుముందు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, కెడిసిసి బ్యాంకు డైరెక్టర్ మల్లికార్జున రెడ్డి, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ నాగ తిరుపాలు, కాల్వబుగ్గ చైర్మన్ పెద్దచంద్రస్వామి, నేతలు మద్దయ్య, మల్లికార్జునప్ప, ఇఓ చంద్రశేఖర్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
సిఇఓ సోమన్న ఆచూకీ తెలపండి
* టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు కెఇ
కర్నూలు, మార్చి 23: కిడ్నాప్‌కు గురైన క్రిష్ణగిరి మండల సింగిల్‌విండో సిఇఓ కురుబ చిన్నసోమన్న ఆచూకీ తెలిపి, సోమన్నను వారి కుటుంబానికి అప్పగించాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే కెఇ కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. జిల్లా కురుబ సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎస్పీ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. అంతకుముందు రాజ్‌విహార్ సెంటర్, అంబేద్కర్ భవన్ మీదుగా బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కుల, ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీగా ఎస్పీ కార్యాలయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెఇ మాట్లాడుతూ సోమన్న ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆరోపించారు. సోమన్నను కిడ్నాప్ చేసిన క్రిష్ణగిరి సింగిల్‌విండో చైర్మన్ బ్రహ్మారెడ్డి, విశ్రాంత సిఇఓ లాలప్ప, చెరుకులపాడు నారాయణరెడ్డిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. వాయిస్ రికార్డు బహిర్గతం చేసి అందులోని పేర్లు వున్న వారిని శిక్షించాలని లేకపోతే ఈ విషయాన్ని గడప గడపకూ తెలిపి 45 రోజుల తర్వాత మళ్లీ నిరాహార దీక్ష చేపడుతామని హెచ్చరించారు. అనంతరం ఎఎస్పీ వెంకటరత్నంకు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో సిపిఐ రాష్ట్ర నేత రామచంద్రయ్య, జిల్లా నేత జగన్నాథం, సిపిఎం నేతలు ప్రభాకర్‌రెడ్డి, రామాంజనేయులు, వైకాపా నగర నేత బాలరాజు, బిజెపి నేత లక్ష్మిరెడ్డి, మదనమోహచాచారి, దళిత సంఘాల నేత సోమసుందరం, ప్రజా సంఘాల నేతలు నాగేశ్వరరావుయాదవ్, కెసి రాముడు, సమాజ్‌వాది పార్టీ నేతలు యాదవ్, బలరాం, ఎస్‌యుసిఐ సంఘం నేతలు నాగన్న, నల్లారెడ్డి, మంత్రాలయం రామిరెడ్డి, పత్తికొండ నాయుడు, వివిధ కుల సంఘాల నేతలు శేషఫణి, రోషి, లక్ష్మీనర్సింహా, రామకృష్ణ, శ్రీనివాసులు, కురుబ సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేష్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రంగస్వామి, గడ్డం రామకృష్ణ, బత్తిన వెంకటరాముడు పాల్గొన్నారు.
రాయలసీమ వర్శిటీ అభివృద్ధికి కృషి
* రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల హామీ
ఆదోని, మార్చి 23 : రాయలసీమ యూనివర్శిటీ అభివృద్ధికి నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళా శాల ఆడిటోరియంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ యూనివర్శిటీకి నిధుల కొరత తీవ్రం గా ఉందని, నిధులు లేకపోవడం వల్లే భవన నిర్మాణాలు కూడా సాగడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో రాయలసీమ యూనివర్శిటీని అభివృద్ధి చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో విద్యార్థులకు కావాల్సిన నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తానన్నారు. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రోడ్ల నిర్మాణానికి ఎంపి నిధుల నుంచి నిధులు మంజూ రు చేస్తానన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్ సుధాకర్‌రావు, కరస్పాండెంట్ తిమ్మారెడ్డి, చైర్మన్ విట్టాకిష్టప్ప, మాజీ కరస్పాండెంట్ విశ్వనాథ్‌రెడ్డి, మాజీ ప్రిన్సిపాల్ నరసింహులు, తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ యూనివర్శిటీ వైస్ ఛాన్సులర్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ ఆదోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కాలేజీలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ముస్లిం మైనార్టీ విద్యార్థులకు కంప్యూటర్ సర్ట్ఫికెట్లు అందజేశారు. ముస్లిం మైనార్టీ విద్యార్థులకోసం, వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు.
తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు
* కేంద్ర మంత్రి కోట్ల
ఆదోని టౌన్, మార్చి 23: కర్నూలు పార్లమెంట్ పరిధిలో తాగునీటి సమ స్య తీవ్రంగా ఉందని, దీనిని పరిష్కరించి శాశ్వత మార్గం చూపేందుకు యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో చర్చించానని రైల్వేశాఖ సహాయ మం త్రి కోట్ల జయ సూర్యప్రకాష్‌రెడ్డి స్ప ష్టం చేశారు. శనివారం ఆదోని మండలంలోని మండిగిరి పంచాయతీ కా ర్యాలయం వద్ద రూ.6కోట్లతో తాగునీ టి పథకం పనులకు శంకుస్థాపన చేశా రు. ఈపథకం ద్వారా మండలంలోని మండిగిరి, సాదాపురం, గోనబావి, ఉహానూరు, దిబ్బనకల్లు, విరుపాపు రం, బసరకోడు, అలసందుగుత్తి, తం గరడోన గ్రామాలకు తాగునీటి సమ స్య తీరుతుందని మంత్రి కోట్ల స్పష్టం చేశారు. అలాగే అనేక ప్రాంతాల్లో సమస్య ఉందని, అలాగే కేవలం తుంగభద్ర దిగువకాల్వపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. అందువలన ప్రతి గ్రామంలోను తాగునీటి సమస్య తీర్చేందుకు ఎస్‌ఎస్ ట్యాంకు ల నిర్మాణం వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని, పూర్తిగా తాగునీటి సమస్య లేకుండా చేస్తానని స్పష్టం చేశారు. అభివృద్ధి కాంగ్రెస్‌పార్టీ ద్వారానే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పార్టీకి కొంతకాలంగా దూరంగా ఉన్న మాజీ వైస్ ఎంపిపి, ప్రముఖ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌పార్టీలో ఉత్సాహంగా కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డికి మంత్రి కోట్ల కండువావేసి స్వాగతం పలికారు. శ్రీకాంత్‌రెడ్డికి అన్నివిధాలుగా అండగా ఉంటామని కేంద్రమంత్రి కోట్ల పేర్కొన్నారు.
అశ్వవాహనంపై విహరించిన
జ్వాలా నరసింహుడు
ఆళ్లగడ్డ, మార్చి 23: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామి అశ్వవాహనంపై విహరిసూత భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు రవిస్వామి జ్వాలా నరసింహస్వామిని చూడముచ్చటగా అలంకరించి అశ్వవాహనంపై కొలువుదీర్చి పూజల అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కలియుగంలో నరులను రక్షించడం కోసం భగవంతుడు కల్కి అవతారం ఎత్తి అశ్వంపై విహరిస్తారన్నారు. అళ్వార్లలో ప్రసిద్ధి పొందిన శ్రీ తిరుమంగై అళ్వారులకు జ్ఞానోదయం చేసింది కూడా ఈ అలంకారంలోనే. అందుకే అశ్వవాహనంలో కొలువుదీరిన స్వామిని దర్శించుకున్న భక్తులకు జ్ఞానం సిద్ధిస్తుందని ప్రతీతి. ఈ కార్యక్రమానికి తాడిపత్రికి చెందిన జలదుర్గం రంగస్వామి ఉభయదారులుగా వ్యవహరించారు.
దిగువ అహోబిలంలో..
దిగువ అహోబిలంలో రాత్రి ప్రహ్లాదవరదస్వామి శరభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో స్వామిని సుందరంగా అలంకరించి శరభ వాహనంపై కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం అశ్వ వాహనంపై కొలువుదీరిన స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఇకపోతే బ్రహ్మోత్సవాల సందర్భంగా రోజురోజుకూ ఎగు వ, దిగువ అహోబిలలాలకు భక్తుల తాకిడి తీవ్రంగా పెరిగిపోతుంది.
మోహినీ అలంకారంలో
ప్రహ్లాద వరదుడు
ఆళ్లగడ్డ, మార్చి 23:బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరద స్వామి ఉత్సవమూర్తికి మోహినీ అలంకారం చేసి ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అలంకారంలో స్వామివారు ఒక చేతిపై పక్షి, మరో చేయి నేలను చూపిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సముద్రంలో మహాలక్ష్మి అలంకారంగా ప్రహ్లాదవరదస్వామికి మోహినీ అలంకారం చేసి గ్రామోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా మోహినీ అలంకారంలో కొలువైన ఉత్సవమూర్తిని అహోబిల మాఢవీధుల గుండా ఊరేగించగా భక్తులు దర్శించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం మోహినీ అలంకారంలో వున్న ప్రహాదవరదుడిని నవనారసింహులలో ఒకరైన ఛత్రవట నరసింహస్వామి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ స్వామికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షాద్‌నగర్‌కు చెందిన విఎల్‌ఎన్ చార్యులు, చెన్నైకు చెందిన దేవికన్ పెరుంగళత్తూర్ ఉభయదారులుగా వ్యవహరించారు. మధ్యాహ్నం దిగువ అహోబిలం ఆలయ ప్రాంగణంలోని మండపంలో ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి, ప్రహ్లాద వరదస్వామి వార్లకు అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు.
ఎగువ అహోబిలంలో..
ఎగువ అహోబిలంలో శ్రీదేవి, భూదేవి, జ్వాలా నరసింహస్వామి ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, పూలమాలలతో అలంకరించి అర్చకులు రవిస్వామి పూజలు నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెంగుళూరుకు చెందిన ఎన్‌హెచ్ విష్ణువర్ధన్‌రెడ్డి ఉభయదారులుగా వ్వవహరించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకం నిర్వహించారు.
వెండి వస్తువుల వితరణ
నవనారసింహులలో ఒకరైన పావన నరసింహస్వామికి జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామానికి చెందిన పల్ల లక్ష్మమ్మ జ్ఞాపకార్థం ఆమె కుమారులు 670 గ్రాముల వెండి సెటారు, హారతి కడ్డీ ఆలయ మేనేజర్ బివి నరసయ్యకు విరాళంగా అందజేశారు. ఇకపోతే ఆదివారం ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామి, అమ్మవార్ల కల్యాణం జరుగుతుందని మేనేజర్ బివి నరసయ్య తెలిపారు. దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరదుడు ఉదయం వేణుగోపాలస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని, రాత్రి గజవాహన సేవ ఉంటుందని తెలిపారు.
ఆదోనిలో సంక్షేమ
పథకాలకు కోట్ల శ్రీకారం
ఆదోని, మార్చి 23: ఆదోనిలో శనివారం కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. మంత్రి 9.30 గంటలకు ఆర్‌అండ్‌బి అతిధిగృహానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కోట్ల కాంస్య విగ్రహాంవద్దకెళ్ళి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఆ తరువాత లక్ష్మమ్మవ్వ దేవాలయానికెళ్ళి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడినుంచి మండిగిరి గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకొని రూ.6కోట్ల నిర్మిస్తున్న మంచినీటి పథకానికి శంఖుస్థాపన చేశారు. మున్సిపల్ కార్యాలయంవద్ద రూ.25లక్షలతో నిర్మించిన స్ర్తిశక్తి భవన్‌కు రూ.2కోట్లతో నిర్మించే రోడ్డు నిర్మాణ పనులకు శంఖుస్థాపన గావించారు. రెడ్డి హస్టల్‌లో జరిగిన పొదుపులక్ష్మి సమావేశంలో పావలావడ్డీ రుణాలను, గ్యాస్ స్టౌలను అందజేశారు. ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కాలేజీకి చేరుకొని కోటి రూపాయలతో నిర్మించిన మహిళా హస్టల్‌ను ప్రారంభించారు. పిజి సెంటర్ భవనానికి బయోలాజీ పార్కుకు శంఖుస్థాపన గావించి పార్కును పరిశీలించారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ విట్టాకిష్టప్ప, మైనార్టీ నాయకులు నసీరుద్దీన్ పటేల్, అప్సర్‌బాష, జమీల్ షఫీ అహ్మద్, మజరూల్ హక్, మాజీ కౌన్సిలర్లు రామచంద్ర, నీలకంఠప్ప, రామలింగేశ్వర్, దీలిప్‌డోకా, యువజన కాంగ్రెస్ నాయకులు సోమశేఖర్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి, జిల్లా మాజీ వైస్ చైర్మన్ తిక్కన్న, ఆడిటర్ దైవాదీనంరెడ్డి పాల్గొన్నారు.

* సర్కారుకు అధికారుల నివేదిక.. * సై అంటున్న ప్రధాన పార్టీలు..
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>