గత వారం విడుదలైన ‘గుండెల్లోగోదారి’ సినిమా చాలా బాగుంది. దర్శకులు ప్రేక్షకులను 1985-86 సంవత్సరానికి తీసుకొని వెళ్లారు. ఇళయరాజాగారి సంగీతం, మంచి సాహిత్యం చక్కని గ్రామీణ కథాంశం గోదావరి చుట్టుతా సాగినతీరు సూపర్. అందాల భామ తాప్సీ నటన బాగుంది. లక్ష్మి నిర్మాతగా అంతకుమించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మంచు లక్ష్మి మంచి అభిరుచిగల నిర్మాత అని నిరూపించిన చిత్రం ‘గుండెల్లోగోదారి..’
- గొల్లపూడి శ్రీ వీరవేంకట సత్యనారాయణ, కాకినాడ
సింప్లీసూపర్బ్
‘గుండెల్లో గోదారి..’ సింప్లీసూపర్బ్ అని చెప్పుకోవచ్చు. నటీనటులు వాళ్ళ పాత్రల్లో జీవించారు. గోదావరి నది, నదీపరివాహక అందాలు అద్భుతంగా చిత్రీకరించారు. ముఖ్యంగా ‘ఫ్లడ్ సిట్యుయేషన్’ని చాలా గొప్పగా చిత్రీకరించారు. గోదావరి జిల్లాల ప్రజల జీవనవిధానం వాళ్ళ వేషధారణ చక్కటి యాస, భాష అన్నీ కలిపి అచ్చతెలుగు సినిమాగా చెప్పుకోవచ్చు. ఆది పినిశెట్టికి తెలుగులో మంచి బ్రేక్ దొరికినట్లే. ఇళయరాజా సంగీతం, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి మంచి ప్లస్ అయ్యాయి. చాలాకాలం తరువాత అచ్చమైన ఆహ్లాదకరమైన చిత్రాన్ని చూసిన అనుభూతి కలిగింది. డేరింగ్ నిర్మాత మంచులక్ష్మిని తప్పక అందరూ అభినందించాల్సిందే.
- పంచకర్ల గోవర్ధనరావు, కంకిపాడు
మనల్ని గౌరవించుకోవాలి
వందేళ్ల సినిమా ఉత్సవాల్లో మనకు సముచిత స్థానం లేనందుకు విచారించనేల? మనం అత్యధికంగా కాంగ్రెస్ ఎంపీలను పంపి కేంద్ర ప్రభుత్వాన్ని బలపరిచినా అరకొర అప్రధాన మంత్రి పదవులే దక్కితే మనం కిక్కురుమనలేదు. మన విశాఖపట్టణాన్ని తూర్పుకోస్తా రైల్వేలో కలిపేస్తే మనం నిరసించలేదు. సకల సౌకర్యాల కొత్త రైలుకోచిలను ఇతర రైల్వే జోన్లకు కేటాయించి వాళ్లు వదిలేసిన డొక్కు కోచిలను మన ముఖాన కొట్టినా మనకు పౌరుషం రాలేదు. మన గ్యాస్ మనకు దక్కకుండా కరెంట్ కష్టాలు పడుతూ కిక్కురుమనడం లేదు. సినిమా ఉత్సవాల్లో, పద్మపురస్కారాల్లో అన్యాయం జరిగితే ఆక్రోశం ఎందుకు? మొదట మనల్ని మనం గౌరవించుకోవడం, ఆత్మాభిమానం పెంచుకోవడం తర్వాత హక్కులకోసం పోరాడటం నేర్చుకోవాలి. అవేవీ లేకుండా ఊరకే విచారిస్తూ కూచుంటే ప్రయోజనం ఏమిటి?
- చంద్ర, కాకినాడ
కస్తూరి వ్యాసం బాగుంది
హాస్యానికి కస్తూరి సుగంధం. తొలి స్టార్ కమెడియన్ కస్తూరిగారి గురించి అందించిన వ్యాసం చాలా బాగుంది. ఆయన జీవితం గురించి చదివి మా హృదయాలు ద్రవించాయి. సినిమావాళ్ళ జీవితాలు సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే భవిష్యత్తు ఎంత దుర్భరంగా వుంటుందో రచయిత తెలియజేశారు. ఇలాంటివారి జీవిత విశేషాలు తెలియజేసినందుకు మా అభినందనలు.
- టి.రమాదేవి, వినుకొండ
50 ఏళ్ళ వెనక్కివెళ్ళాం
15.3.13 నాటి వెనె్నలలో సి.వి.ఆర్.మాణిక్యేశ్వరిగారి ‘లవకుశ’ సంగీతం, సాహిత్యం చదివి 50 ఏళ్ళ వెనక్కివెళ్ళాం. ఆనందపరవశులయ్యాం. ఘంటసాల సంగీతం-గాత్రం, సదాశివబ్రహ్మం, సముద్రాల వగైరాల సాహిత్యం ఇవన్నీ మరో 50 ఏళ్ళకు కూడా ఆదరణ పొందుతూ వుంటాయి. ‘లవకుశ’ చిత్రం తాలూకు శ్లోకాలు, పద్యాలు, పాటలు ఇవన్నీ వెనె్నలలో ప్రత్యేకంగా ప్రచురణ జరగాలి. పరిశోధకులకు, సాహితీప్రియులకు ఎంతో మేలు. ఆనాటి సాహిత్య విలువలే ప్రామాణికమైనవి. ఎలక్ట్రానిక్ యుగంలో ఈ వైభవం చూడలేము.
- కాసర వెంకటరెడ్డి, జంగారెడ్డిగూడెం
వ్యాసం చదివి చలించిపోయాం
వెనె్నలలో ‘హాస్యానికి కస్తూరి సుగంధం’ అలనాటి హాస్యనటుడు కస్తూరి శివరావు వ్యాసం చదివి చలించిపోయాం. అప్పట్లో శివరావు చిత్రాలలో కనిపిస్తే జనం ఆనందపరవశులయ్యేవారు. ఎన్నో హాస్యపాత్రలు పోషించి తనకంటూ ఒక ఇమేజిని సంపాదించగలిగారంటే శివరావు ఎటువంటివారో అర్ధమవుతుంది. ప్రఖ్యాత దర్శకులు కె.వి.రెడ్డిగారు గుణసుందరి చిత్రానికి శివరావుని, అందులో ఒక హాస్య నటుణ్ణి హీరో పాత్రను ధరింపజేసి తన సాహసాన్ని చాటుకొని గుణసుందరి చిత్రం అఖండ విజయానికి కృషిసల్పిన కె.వి.రెడ్డి ఎంతైనా అభినందనీయులు.
- మార్కస్ మణిరాజ్, ముద్దనూరు
ఆపాత మధురాలు
పరిశోధించి రాసిన వ్యాసం ‘వందేళ్ళ భారతీయ సినిమా’ వ్యాసంలో చక్కని వివరణతో చదువరులను ఆకట్టుకుంది. వ్యాసకర్త అభిప్రాయం నూటికి నూరుపాళ్ళు వాస్తవమే. 1950-90నాటి కాలం నిజంగా స్వర్ణయుగమే. అంతకుముందు వచ్చిన సినిమాలన్నీ నాటక ఫక్కిలోనుండగా, ఆ తరువాతి కాలంలో నటన, సంగీతం, సంభాషణలు, సన్నివేశాల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 1990 తరువాత దిగజారుడు యుగంలో కూడా చక్కని నటులు, రచయితలు లేకపోలేదు. అయితే కొత్త కొత్త సంగీత వాయిద్యాల హోరులో పాటల మాధుర్యం అందకుండా పోయింది. వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెనె్నల సీతారామశాస్ర్తీలు ఆనాటి కవుల రచనలకు తీసిపోకుండా రాసినా ఢమఢమ వాయిద్యాల మధ్య నలిగి పోతున్నాయి. థియేటర్లో ప్రేక్షకులకు గుండె నొప్పిని తెప్పిస్తున్నాయి. పాటలో సంగీతం అంతర్లీనంగా ఉండాలి. పాట వినిపిస్తున్నప్పుడు వాయిద్యాల బాదుడు పూర్తిగా తగ్గాలి. థియేటర్లోంచి బయటకు వచ్చిన ప్రేక్షకుడు సినిమాలోని పాటలను కూనిరాగాలు తీస్తూ యిల్లు చేరాలి. ఆ పరిస్థితి యిప్పుడు ఏమాత్రంలేదు. కాబట్టి ఈనాటి పాటలు కొద్ది కాలానికే పరిమితమవుతున్నాయి. ఈనాటి నటీనటుల సంగతి వ్యాసకర్త రాయనే రాసారు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాదు
మాకు ధనం మీకు శ్రమ
తొలిరోజుల్లో ఒక సినిమా తీయాలనుకుంటే నటులకు మంచి ఆలోచన దర్శక నిర్మాతల అభిరుచులు కూడ ఒక తాటిపై వుండేది. కాని మార్పు అనేది సహజం. ఇప్పుడు ఆ ఆలోచన మారి ప్రేక్షకులు దేనిని ఆదరిస్తారో అది తియ్యాలి. సినిమా ఒక కళాఖండం. కాని కొంతమంది నిర్మాతలు సినిమాను వ్యాపారంగా మలచుకొని డబ్బులు దండుకొంటున్నారు. ఇప్పటి సినిమాలలో హీరోయిజం కనిపించడం లేదు. హీరోలు విలన్లు అవుతున్నారు విలన్లు హాస్య నటులవుతున్నారు. హాస్య నటుల ట్రెండే లేదు. ఏదో రెండు షాట్లు విదేశాల్లో తీసినట్లు భ్రమ కలిగిస్తున్నారు. తమ అభిమాన నటుడు నటించిన సినిమా ఆడితే అభిమానులు సూపర్, వంద రోజులు ఆడుతుంది అనేవారే గానీ ఆ సినిమాలో వారికి ఏమి నచ్చింది, కథ నచ్చిందా! ఎందుకు నచ్చింది అనే ఆలోచన లేదు. మేము తీస్తున్నాం, మీరు చూస్తున్నారు. మేం మీకు చెవులో పుష్పాలు పెడుతున్నాం. మీరు పెట్టించుకొంటున్నారు. మాకు ధనం మీకు శ్రమ ఇది కథ.
- ఎం.మణిరాజ్, ముద్దనూరు
ఇతరులపై అభియోగాలెందుకు..?
‘ఎందుకు రావాలి మనవాళ్ళకి అవార్డులు’ వ్యాసం చదివి ఒక విషయం సూటిగా చెప్పదలిచాము. నిజమే, మనకు అవార్డులు, రివార్డులు రావట్లేదని ఇతరులపై అభియోగాలు చేస్తున్నవారు ఎంతవరకు తెలుగు చిత్రసీమ గురించి ఆలోచించి, చిత్రాలను నిర్మిస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ సినిమా చూసినా ఇతర భాషాటైటిల్స్ (ఇడియట్, బాద్‌షా, నాయక్, కిల్లర్, జబర్‌దస్త్.. ఇలా ఉన్నాయి) పెట్టి, పరభాషా నటులకు అవకాశాలు కల్పిస్తూ కథ ఎలాఉన్నా కచ్చితంగా ఒక ఐటెంసాంగ్ జోడించి, కేవలం వారసత్వంగా వచ్చి, నటన రాకపోయినా వారిని హీరోలుగా నిలబెట్టేందుకు ప్రయత్నస్తున్న మన చెడ్డ దర్శకులు ఉన్నంతకాలం, మన తెలుగు చిత్ర పరిశ్రమను ఎవ్వరూ గుర్తించరు.
- బి.కృష్ణ, హైదరాబాద్
గతంలోనూ హాస్యం పేరుతో.....
హాస్యం అలనాడు బంగారం, ఇప్పుడు అపహాస్యం అనుకోనక్కరలేదు. ‘శ్రీలక్ష్మమ్మ కథ’ చిత్రంలో శివరావు ‘నీ ఆవకాయ డొక్క, నా అప్పడాల కర్ర’ అని పాడితే ప్రజలు ఛీకొట్టారు. అంజలి, అక్కినేని నటించినా ఆ చిత్రం ఫ్లాప్ అయింది. దానికి పోటీగా నారాయణమూర్తి, కృష్ణవేణి నటించిన ‘లక్ష్మమ్మ’ నీట్‌గా ఉండి హిట్ అయింది. హాస్యం పేరుతో బూతులు శివరావుతోనే ప్రారంభం. అయితే మాటలలో లేని బూతు క్లోజప్‌లలో, కదలికల్లోనూ ఉండొచ్చు. తిరునాళ్లకు వెళ్తూ సూర్యకాంతాన్ని చూస్తూ రేలంగి ‘నగలు జాగ్రత్త ఆ రెండూ జాగ్రత్త’ అంటాడు. అప్పుడు తెర నిండా క్లోజప్‌లో చూపించినది నగలు మాత్రం కాదు! గతంలోనూ హాస్యం పేరుతో బూతు ఉండేది. కాని ఇప్పుడు హీరోలే బూతులాడుతున్నారు!
- చంద్ర, కాకినాడ
వినోదం పంచివ్వలేకపోతే వ్యర్థం
‘వెనె్నల’ అనబంధంలో వీరోచితమైపోయిన టాలీవుడ్ స్పెషల్ వ్యాసం విశే్లషణాత్మకంగా సాగింది. ఈ సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమ మంచి హిట్ చిత్రాలతో కాసులు కురిపిస్తూ పరిస్థితి ఆశాజనకంగా వుండడం సంతోషకరమైన విషయం. అయితే సినిమా జనరంజకంగా వుండడానికి హీరోల కృషితోపాటు వైవిధ్య భరితమైన కథ, ఆకట్టుకునే కథనం, కమ్మని సంగీతం, చక్కని హాస్యం ఇత్యాది అంశాలు అత్యావశ్యకం. ఈ దిశగా దర్శక నిర్మాత, రచయితలు కృషిచేయాలి. కోట్లు కుమ్మరించినా సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడికి మినిమమ్ గ్యారంటీ వినోదం రెండుగంటలపాటు పంచి యివ్వలేకపోతే ఆ ప్రయత్నం వ్యర్థం అనేది నిర్వివాదాంశం.
- సి.ప్రతాప్, విశాఖపట్నం
వివాదాలు సినిమాను రక్షిస్తాయా?
సినిమా విడుదలకు ముందరే వివాదాలు చుట్టుముడితే అది ఒక రకమైన పబ్లిసిటీగా భావిస్తున్న కొందరు నిర్మాతల్ని ముంచేస్తున్న తరుణమిది. ముఖ్యంగా ఇటువంటి వివాదాల్ని తలకెత్తుకునే రామ్‌గోపాల్‌వర్మ లాంటి వాళ్ళకి బాగా బుద్ధొచ్చేలా చేశాయి ఈమధ్య కొన్ని సినిమాలు. అయితే వివాదాలు అన్నీ పసలేనివి కావని చెప్పలేం. ఉదాహరణకు ‘దేనికైనారెడీ’ చిత్రం. దీనిపై వివాదం కూడ ఎవరో కావాలని పబ్లిసిటీకోసం చేసింది కాదు. ఐతే చిత్రంగా ఈ సినిమా హిట్ అయింది. ఒక వర్గం వారిని కించపరుస్తూ తీసిన ఇటువంటి సినిమాలు హిట్ అవడం మన దౌర్భాగ్యం. ఇదివరలో ఇటువంటి హేయమైన, నీచమైన ఉద్దేశాలు ఎక్కడా ఏ సినిమాలో చూపించలేదు. పాత సినిమాల్లో, దాదాపు ప్రతి పాత్రా హుందాగా వ్యవహరించేది. ముఖ్యంగా బ్రాహ్మణ పాత్రధారుల్ని చాలా ఉన్నతంగా చూపించేవారు. కాని ‘దేనికైనారెడీ’ సినిమాలో బ్రహ్మణుల్ని నీచంగా కేవలం మాంసం మాత్రమే తినడానికి పుట్టిన వారుగా చిత్రించడం దర్శక నిర్మాతల భావదారిద్య్రానికి నిదర్శనం. పాత సినిమాల్లో హీరో హీరోయిన్లు కాని ఇతర నటీనటులు కాని వారు పోషించే పాత్ర ఔచిత్యాన్ని కుల మత పరమైన విషయాలకు దూరంగా ఉంచి కాపాడేవారు. పాత్రధారుల పేర్లు, ఊర్లపేర్లు కూడ కుల మతాలకు అతీతంగా పెట్టేవారు. ఉదా: రఘు, వేణు, గోపి, రాధ, సుగుణ, సీతాపురం, రామాపురం మొ.నవి.
అంచేత వాళ్ళు ఏ కులంవాళ్ళు అన్నది ఎవర్కీ తెలిసేదికాదు. కానీ ఇప్పుడు పేర్ల చివర రెడ్డి, నాయుడు, శర్మ అని పెట్టి ఇదంతా సహజత్వంకోసం అంటున్నారు. దీని మూలాన సమాజంలో ఆయా వర్గాల్లో ఈ ప్రభావం పడుతోంది. కనుక నిర్మాతలూ, దర్శకులూ ఒకసారి ఆలోచించండి. పాత్రల పేర్లు ఏ వర్గాన్ని కించపరచకుండా లేదా గొప్పగా చూపటానికో కాకుండా సినిమాలు నిర్మించండి. ఏ విధమైన వివాదం దరిచేరకుండా, సినిమా సజావుగా విడుదలై నిర్మాతని అనవసరమైన టెన్షన్‌లకి గురిచేయకుండా సినిమాలు నిర్మించి సమాజంలో ఎటువంటి వైషమ్యాలకు చోటివ్వకుండా, ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా చూడడం దర్శక నిర్మాతల బాధ్యత. ఈమధ్య వచ్చిన ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ కూడా ఈ కోవలోకే చెందుతుంది. ఐతే నిర్మాతలు పెద్దగా పట్టింపుకుపోకుండా కొన్ని సన్నివేశాలు కత్తిరించి పెద్దగా గొడవ ముదరకుండా చూశారు కాని సినిమాని నిలబెట్టలేకపోయారు. విమర్శ అనేది వ్యక్తిగతంగా వెక్కిరిస్తున్నట్టుగా ఉండకూడదు. ఉదాహరణకు ఈనాడు సినిమా (హీరో కృష్ణది). ఇందులో దాదాపు ప్రతి రాజకీయ నాయకుణ్ణి (ఆరోజుల్లో) విమర్శించారు. కాని సినిమా అంతా హుందాగా నడిచి జనామోదం పొందింది. అందుచేత నిర్మాతలు, దర్శకులకి చివరగా మనవి చేసేదేమిటంటే సాధ్యమైనంతవరకు వివాదాస్పద ఇతివృత్తాలు తెరకెక్కించేప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి లేదా అటువంటి విషయాల జోలికి వెళ్ళకండి.
- కె.జి.కె.మూర్తి, విజయవాడ
అసాధారణమైన నటన
8/3/2013 వెనె్నల ఫ్లాష్‌బ్యాక్ శీర్షికలో ‘లవకుశ’ చిత్రం గురించి వ్యాసం చదివి చాలా విషయాలు తెలిసికొన్నాం. ఇంతకు మునుపు రామాయణ కావ్యాన్ని ఇతివృత్తంగా చాలా సినిమాలు, సీరియల్స్ రూపొందించారు. ఇపుడు కూడా తీస్తున్నారు. అయితే రామాయణ కథను ఒక్కొక్క దర్శకుని ప్రతిభకు తార్కాణంగా తీయబడి ప్రేక్షకుల మనోభావాలను తెలిసికొంటున్నారు. లలిత శివజ్యోతి బ్యానర్‌పై నిర్మించిన తొలి రంగుల చిత్రంగా రూపొందిన ‘లవకుశ’ చిత్రంలో శ్రీరాముడు యన్.టి.రామారావు, సీతగా అంజలీదేవి, లక్ష్మణుడిగా కాంతారావు అసాధారణమైన నటనను ప్రదర్శించి అపర సీతగా, అపర రామునిగా కొనియాడబడ్డారు. యన్.ఏ.టి. సంస్థ నిర్మించిన ‘జయసింహ’ చిత్రంలో యన్.టి.రామారావు, కాంతారావు అన్నదమ్ములుగా నటించి సోదర ప్రేమకు ఒక భాష్యం చెప్పిన వీరు, తరువాత లవకుశలో అన్నదమ్ములుగా వీరి నటన అద్వితీయం.
- ఎం.ఎం, ముద్దనూరు
ప్రేక్షకుడిని ఆలోచింపచేస్తుంది
శత్రువుల గుండెల్లో భద్రకాళిగా అవతరించాడు ఈ ‘మహంకాళి’. పోలీస్ అంటే రాజశేఖర్ అన్నట్టుగా ఈ చిత్రం మరోసారి నిరూపించింది. ముఖ్యంగా ఉగ్రవాద నేపథ్యాన్ని కథగా ఎంచుకున్న జీవితగారిని అభినందించాలి. ఈ చిత్రంలో కథ కంటే కథనాన్ని గమనించాలి. తప్పుచేసిన వాళ్ళు దొరికితే జాగుచేయక పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు మహంకాళి. నిజంగా దేశంలో ఇలా జరిగితే ఎంతో బావుంటుంది అని ఈ చిత్రం సగటు ప్రేక్షకుడిని ఆలోచింపచేస్తుంది. రాజశేఖర్ పలికే డైలాగులు పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎక్కువసేపు తెరమీద విలన్లు కనబడటం ఈ చిత్రానికి ఒక మైనస్. ఈ చిత్రంలో సెంటిమెంటు, హాస్యం పండించకపోవటంతో చిత్రం మహిళా ప్రేక్షకులకు పూర్తిగా చేరుకోలేకపోయింది. రొటీన్‌కు భిన్నంగా ఆలోచిస్తే ఈ చిత్రం రొటీన్ చిత్రాలకంటే కొంతవరకు భిన్నంగా కన్పించగలదు.
- వెలిశాల దుర్గాప్రసాదు, కృష్ణాజిల్లా
==================
‘మీ వ్యూస్’కు
మీ అభిప్రాయాలను పంపవలసిన
మా చిరునామా : ఎడిటర్, వెన్నెల,
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 500003
మీ వ్యూస్
english title:
mee views
Date:
Friday, March 29, 2013