న్యూఢిల్లీ, మార్చి 28: ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) మనదేశ కరెంట్ ఖాతా లోటు (సిఎడి) గరిష్ఠంగా 6.7 శాతానికి పెరిగింది. ఇందుకు వాణిజ్య లోటు పెరగడమే ప్రధాన కారణమని రిజర్వ్ బ్యాంక్ గురువారం విడుదల చేసిన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ నివేదికలో తెలిపింది. దేశంలోకి వచ్చే విదేశీ మారక ద్రవ్యం, బయటకు వెళ్లే మారక ద్రవ్యం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కరెంట్ ఖాతా లోటు (సిఎడి)గా వ్యవహరిస్తారు. ‘ద్వితీయ త్రైమాసికంలో సిఎడి (జూలై-సెప్టెంబర్)లో 5.4 శాతం ఉండగా మూడవ త్రైమాసికంలో ఇది జిడిపిలో 6.7 శాతం గరిష్ఠ స్థాయికి చేరింది. ప్రధానంగా వాణిజ్య లోటు పెరగడమే ఇందుకు కారణం’ అని ఆర్‌బిఐ ఆ నివేదికలో తెలిపింది.
డిసెంబర్, 2012తో ముగిసిన మూడవ త్రైమాసికంలో ఎగుమతుల వాణిజ్యం పెరగపోవడం, దిగుమతులు 9.4 శాతం పెరగడం, ముఖ్యంగా చమురు, బంగారం దిగుమతులు బాగా పెరగడం ఇందుకు ప్రధాన కారణం. అందువల్ల వాణిజ్యలోటు 4860 కోట్ల డాలర్ల నుంచి 5960 కోట్ల డాలర్లకు (మూడవ త్రైమాసికంలో) పెరిగిందని ఆర్‌బిఐ వెల్లడించింది.
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో సిఎడి పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ‘సిఎడి నాకు ఆందోళన కలిగించే పెద్ద అంశం’ అని అన్నారు. చమురు, బొగ్గు తదితర దిగుమతులపై మనం ఆధారపడడం, దేశంలో బంగారం అంటే విపరీతమైన వ్యామోహంతో వాటి దిగుమతులు కూడా వృద్ధి చెందడం, ఎగుమతులు వృద్ధి చెందకపోవడం తదితర అంశాలన్నీ సిఎడి పెరగడానికి కారణమని చెప్పారు.
2012 సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ త్రైమాసికంలో సిఎడి జిడిపిలో 5.4 శాతం (7170 కోట్ల డాలర్లు) ఉండగా, 2011 సంవత్సరం ఇదే త్రైమాసికంలో4.1శాతం (5650 కోట్ల డాలర్లు) మాత్రమే ఉంది. మూడవ త్రైమాసికంలో ఇది 61 శాతం పెరిగి 3260 కోట్ల డాలర్లు పెరిగింది. అంతకు ముందు సంవత్సరం ఇది 2020 కోట్ల డాలర్లు ఉంది. మరో వైపు దేశంలోకి ఎఫ్‌ఐఐల పెట్టుబడులు 180 కోట్ల డాలర్ల నుంచి పెరిగి 860కోట్ల డాలర్లకు చేరిందని ఆర్‌బిఐ తెలిపింది.
సిఎడి పెరగకుండా చర్యలు
* కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ, మార్చి 28: ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసికంలో కరెంట్ అక్కౌంట్ లోటు 6.7 శాతం పెరగడం పెద్ద ఆశ్చర్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కానీ ఈ లోటు మరింత పెరగకుండా ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ చర్యలు చేపడతాయని ప్రకటించింది. ‘సిఎడి పెరగడం ఆశ్చర్యం కలిగించలేదు. ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తాయి. అవసరమైనప్పుడు చర్యలు చేపడతాయి’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. సిఎడి పెరగకుండా వ్యక్తిగతంగా, ప్రభుత్వ శాఖలలో పొదుపును ప్రోత్సహిస్తోందని, ఎఫ్‌డిఐ, ఎఫ్‌ఐఐల పెట్టుబడులను కూడా పర్యవేక్షిస్తూ ప్రోత్సహిస్తోందని తెలియచేసింది.
విదేశీ మారక ద్రవ్య రిజర్వ్ నుంచి ఖర్చు కాకుండా పరిస్థితులు ఉండడం ఒక సంతృప్తికరమైన అంశమని, దేశంలోకి వచ్చే విదేశీ మారక ద్రవ్యం నుంచి వ్యయం చేయగలమని భావిస్తున్నామని తెలిపింది. అయితే ఎగుమతులు పెరుగుతున్న దృష్ట్యా రానున్న కొన్ని నెలల్లో సిఎడి తగ్గవచ్చునని భావిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సిఎడి తగ్గించేందుకు తీసుకున్న చర్యలలో బంగారం దిగుమతులు పెరగకుండా సుంకం పెంచడంతో పాటు మరిన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. కనుగ నాలుగో త్రైమాసికంలో ఈ లోటు తగ్గవచ్చునన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.