ఆకివీడు, ఫిబ్రవరి 11: చర్చి నిర్మాణం తొలగింపు విషయమై అడ్డుకున్న తమ నాయకులను అరెస్టు చేయడం అమానుషమంటూ టిడిపి కార్యకర్తలు, క్రైస్తవ సంఘ నాయకులు శనివారం ఆకివీడులో రాస్తారోకో నిర్వహించారు. స్థానిక ఎస్ టర్నింగ్ వద్ద జాతీయ రహదారిపై 15 నిమిషాల పాటు ఆందోళనకారులు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గొంట్ల గణపతి, షేక్ హుస్సేన్, బొల్లా వెంకటరావు, మోరా శ్రీనివాసరెడ్డి, క్రైస్తవ సంఘ నాయకులు సాంబర్లీన్, మద్దిరాల చిట్టిబాబు, సత్యానందం తదితరులు పాల్గొన్నారు. చర్చి తొలగింపు విషయమై వివరణ అడిగేందుకు వెళ్ళిన తనను అరెస్టు చేయడం అన్యాయమని ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అన్నారు. శనివారం తెల్లవారుఝామున చర్చి తొలగిస్తున్నారన్న విషయం తెలుకున్న తాను ఆ ప్రాంతానికి వెళ్ళి హైకోర్టు ఆదేశాలు చూపించమని ఆర్డీఒ వెంకటసుబ్బయ్య, డిఎస్పీ రఘువీరారెడ్డిలను కోరానని, మత విశ్వాసాలను చెడగొట్టేవిధంగా ప్రయత్నించవద్దని కోరానన్నారు. అయితే అధికారులంతా తనను పోలీసు బలగాలతో చుట్టుముట్టి భీమవరం తరలించారని ఆయన వివరించారు. అనంతరం తనకు అధికారులు వివరణ ఇచ్చుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. తొలగించిన చర్చికి స్థలాన్ని చూపించి, విరాళాలు సేకరించి చర్చి పునర్నిర్మించుకునేందుకు చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.
: చర్చి నిర్మాణం తొలగింపు విషయమై అడ్డుకున్న తమ నాయకులను
english title:
A
Date:
Sunday, February 12, 2012