గుత్తి, ఫిబ్రవరి 12: దక్షిణ మధ్య రైల్యేలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న రైల్వే గ్యాంగ్‌మెన్‌ల విఆర్‌ఎస్‌కు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైల్వే కార్మికులు, వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే తండ్రి స్థానంలో పిల్లలు ఉద్యోగం పొందడానికి అర్హత పరీక్షలు ఈ నెలాఖరులోగా నిర్వహించాలని నిర్ణయించడం పట్ల కార్మిక సంఘాల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. భారతీయ రైల్వేలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక ఆర్థిక విధానాలు-ఎకానమీ పాలసీలో భాగంగా రైల్వేలో ప్రమాదాల నియంత్రణకై సేఫ్టీ విభాగాల్లో పని చేస్తున్న వయసు మళ్లిన కార్మికులను తొలగింటచడం, వారి స్థానంలో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి రైల్వే యాజమాన్యం వలంటరీ రిటైర్‌మెంట్ స్కీం ప్రవేశపెట్టి, ప్రయోగాత్మకంగా ఇంజనీరింగ్ విభాగం, లోకో రన్నింగ్ స్ట్ఫాలో అమలు చేయడానికి సిద్ధపడింది. అందులో భాగంగానే రైల్వేలోని వివిధ డివిజన్‌లలో పని చేస్తున్న గ్యాంగ్‌మెన్‌లు, డీజిల్ డ్రైవర్లు, అసిస్టెంట్లు, గార్డులకు ఈ పథకాన్ని వర్తింప చేయడానికి ఆమోదం తెలిపింది. ఐదేళ్ల సర్వీసు ఉండి విఆర్‌ఎస్ ఇవ్వదలుచుకున్న కార్మికుడికి ఐదేళ్ల జీతం సొమ్మును అడ్వాన్స్ రూపంలో చెల్లించడం, పెన్షన్ చెల్లించకుండా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విధంగా నిర్ణయించారు. దీంతో పలువురు ఉద్యోగులు ఆరు నెలల క్రితం విఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రైల్వేశాఖ ఎట్టకేలకు విఆర్‌ఎస్ స్కీం అమలుకు ఆమోదం తెలపడంతో పాటు దరఖాస్తు చేసుకున్న వారి పిల్లల ఉద్యోగ నియమకాలకు సంబంధించి ఈ నెలాఖరులోగా రాత పరీక్షలు నిర్వహించటానికి రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా ప్రాంతంలో పిడబ్ల్యూఐ, ఐఓడబ్ల్యూ, లోకో రన్నింగ్ స్ట్ఫా కార్యాలయాలకు పంపింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని పిడబ్ల్యూఐ కార్యాలయాల్లో అధికారుల పంపిన జాబితాలో తమ పిల్లల పేర్లు చూసుకోవడానికి పలువురు కార్మికులు ఎగబడుతున్నారు. అయితే ఈ నెలాఖరులోగా రాత పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం పట్ల అభ్యర్థులు, కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అర్హత పరీక్షలను మరో నెల రోజుల పాటు వాయిదా వేయాలని వారు కోరుతున్నారు.
* పరీక్షల నిర్వహణ గడువుపై అభ్యంతరాలు * వాయిదా వేయాలని డిమాండ్
english title:
vrs in railways
Date:
Monday, February 13, 2012