హైదరాబాద్! సమయం రాత్రి తొమ్మిదయింది!
అప్పుడే పని ముగించుకుని వచ్చిన రాజేష్ టీవీ ఆన్ చేసాడు.
టీవీలో బ్రేకింగ్ న్యూస్ నడుస్తోంది. ‘దిల్‌సుఖ్‌నగర్ బాంబు బ్లాస్ట్’ వార్త చూపబడుతోంది.
అది చూసిన రాజేష్‌కి ఒక్కసారిగా కాళ్లూ చేతులూ ఆడలేదు. ఒళ్లంతా చెమటలు పట్టేసాయి. ముఖం కందిపోయింది. గొంతు తడారిపోయింది. ఎదురుగా టీవీలో కనిపిస్తున్న భయానక సంఘటనలతో అతను బాగా డిప్రెస్ అయ్యాడు. ఎక్కడ పడితే అక్కడ శరీర భాగాలు, రక్తపు మరకలను చూపిస్తున్న టీవీ దృశ్యాలను అతను చూడలేకపోయాడు.
ఆరోజు అతనికి నిద్ర పట్టలేదు.
మర్నాడు అక్కడికి వెళ్లి చూడాలనుకున్నాడు. ఉదయం లేచి తన బండి మీద సంఘటనా స్థలానికి వెళ్లాడు. అక్కడికి వెళ్లేసరికి పోలీసుల హడావుడి, రాజకీయ నాయకుల తాకిడి విపరీతంగా ఉంది. దోషులను కఠినంగా శిక్షించాలని, ఇది ప్రభుత్వ వైఫల్యమని ప్రతిపక్ష నాయకులు నినాదాలు చేస్తున్నారు. అక్కడున్న చాలా మంది గాయపడిన వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే. మరో వైపు జనం వచ్చి చూసి వెళుతున్నారు. ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. ఉద్యోగులు కంపెనీలకు వెళుతున్నారు. పిల్లలు స్కూళ్లకు వెళుతున్నారు. యువతీ యువకులు కాలేజీలకు వెళుతున్నారు. రాజకీయ నేతలు చూసి వెళ్లి తర్వాత తమతమ కార్యకలాపాలలో మునిగిపోతున్నారు.
ఫోరెన్సిక్ నిపుణులు ఆ ప్రాంతంలో ఉన్న ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. టీవీ వాళ్లు ఆ ప్రాంతాన్ని వీలైనంత ఎక్కువగా కవర్ చేస్తున్నారు. చాలా మంది దగ్గరలో ఉన్న షాపుల్లోకి వెళ్లి కావలసినవి కొనుగోలు చేసుకుంటున్నారు. అక్కడికి దగ్గరలో ఉన్న సినిమా హాళ్లు యథావిధిగా ప్రేక్షకులతో కిక్కిరిసి కనిపించాయి. ఆటలాడుకుంటున్న వారు ఆడుకుంటున్నారు. అంతా సంతోషంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
బాంబు దాడిలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఆ ప్రాంతంలో రోదిస్తూ కనిపించారు.
‘ఏమిటి ఈ పరిస్థితి?’ అనుకున్నాడు రాజేష్.
‘దాడికి గురైన వారు, వారి కుటుంబ సభ్యులు తప్ప మరెవరూ బాధపడడంలేదు. ఎవరి జీవితం వారిది. రానురాను మనుష్యుల్లో మానవత్వ తగ్గిపోతోంది. ఈ దాడి జరిగిందని ఎవరూ స్వచ్ఛందంగా పనులు ఆపడంలేదు. ఈ పోటీ ప్రపంచంలో ఇలాంటివి జరిగినా మన పని మనది అన్నట్లు అంతా హడావుడిగా ఉన్నారు. ప్రభుత్వం కూడా తూతూ మంత్రంగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఊరుకుంది. ప్రజలకు రక్షణ కల్పించాలనే దిశలో ఆలోచించడం లేదు. దాడికి గురైన కుటుంబాలు తప్ప మిగిలిన వారంతా ఎవరి హడావుడిలో వారున్నారు. దయచేసి వారికి సాయం చేయకపోయినా ఫర్వాలేదు. సానుభూతి చూపితే బాగుండును’ అనుకుని బరువైన గుండెతో అక్కడి నుండి బయలుదేరాడు రాజేష్.
- నల్లపాటి సురేంద్ర,
12-35-2/6,
ఇందిరాకాలనీ, బిసిరోడ్డు,
కొత్తగాజువాక, విశాఖపట్నం.
9490792553.
మనోగీతికలు
బ్రతుకే పండగ
పక్షుల కిలకిలారావాలే
సుప్రభాత గీతాలై మేలుకొలిపితే
బాలభానుని బంగారు కిరణాలే
ఇంటి ముంగిట రంగవల్లులైతే
మలయానిల వీచికలే చెవిలో
గుసగుసలాడిగే
జలజల పారే జలపాతాలే
సరిగమలై వినిపిస్తుంటే
ఆకుల గలగలలే ఆనందపు
పలకరింపులైతే
విరుల సుగంధాలే
గంథాలై మేను సోకితే
తీయని కోయిల రాగాలే
తీయని కోయిల రాగాలై
మదిని మరిపించి మురిపిస్తుంటే
ప్రకృతి అంతా మదిని పరవశింపజేసేదే
వాగూ వంకల్లో విహరిస్తూ
ప్రకృతిమాత కౌగిట్లో ఒదిగిపోయి
ఉంటే జీవితమే నందనవనమే
ప్రతి రోజూ ఆమని ఆగమనమే!
- శివాని, పుణ్యగిరిరోడ్డు ఎస్.కోట-535145
వాడు!
వాడి రాతలు
వాడిగా ఉంటాయి
కోటలు దాటుతాయి
వాడి మాటలు
తూటాల్లా పేలుతాయి
కోతలుగా విజృంభిస్తాయి
నిజాయితీ లేని కలాలు
సమాజానికేం మేలు చెయ్యవు
నీలో నిజాయితీని
చేతల్లో నిరూపించుకో
నిజమైన నిర్దేశకుడిగా నిలబడు!
- గుడిమెట్ల గోపాలకృష్ణ, అరసవిల్లి పోస్టు,
శ్రీకాకుళం - 534240
కొత్త పుస్తకం
‘ముద్దబంతులు’ పుస్తకావిష్కరణ
ఈతరం సాంప్రదాయబద్ధమైన కవిత్వం రాసిన వారిలో వేంకటేశ్వరరావు ముఖ్యులని వేదుల సుబ్రహ్మణ్యశాస్ర్తీ అన్నారు. ప్రసన్నభారతి, విశాఖ సాహితి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం పౌరగ్రంథాలయంలో కీర్తిశేషులు కలపర్తి వేంకటేశ్వరరావు రచించిన ‘ముద్దబంతులు’ కావ్యాన్ని వేదుల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేనెలొలికించే రీతిలో వేంకటేశ్వరరావు రచించిన పద్యాలు పాఠకుల అభిమానాన్ని పొందాయన్నారు. సభకు అధ్యక్షత వహించిన మలయవాసిని మాట్లాడుతూ వేంకటేశ్వరరావు రచనలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయన్నారు. ఆచార్య పి.వి. కృష్ణయ్య మాట్లాడుతూ గ్రామీణ జీవితాన్ని, ఆంధ్రుల సంస్కృతిని సంపూర్ణంగా వర్ణించిన చక్కని పద్యరచన ముద్దబంతులు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.
ముద్దబంతులు గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న
వేదుల సుబ్రహ్మణ్యశాస్ర్తీ, తదితరులు
కథకురాలి కథ
కథ చెబుతాను... ఊ కొడతారా...!
పిల్లలు, పెద్దలకు కథన రీతిని వివరించిన దీపాకిరణ్
విశాఖ సాగరతీరం ఇటీవల ‘వరల్డ్ స్టోరీ టెల్లింగ్ డే’ ఉత్సవాల్లో పలు కథలకు వేదికగా నిలిచింది. ప్రతి సంవత్సరం ఉత్తరార్థ గోళంలో వసంతరుతువు వేళ వివిధ ప్రాంతాల ప్రజలు ఒక చోట చేరి వివిధ భాషలలోని విభిన్న కథలను ఒకరితో ఒకరు పంచుకుంటూ బాలలు, పెద్దలు తేడా లేకుండా చెప్పుకోవడం ఆచారంగా వస్తోంది. వరల్డ్ స్టోరీ టెల్లింగ్ డేలో భాగంగా రోటరీక్లబ్, ఇంటాక్ సంయుక్త ఆధ్వర్యంలో పామ్‌మీచ్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఉత్సవంలో ప్రముఖ కథకురాలు దీపాకిరణ్ తన కథలను ఆహూతులకు వినిపించారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పాత, కొత్త కథలను జానపద కథలను దీపాకిరణ్ వినిపించారు. ఫైండింగ్ బన్స్ ఫార్చ్యూన్ అనే జానపద కథతో ఆరంభించారు. ఇంకా దీపాకిరణ్ పిల్లల కోసం తన ప్రత్యేక తరహాగా రూపొందించిన దశావతార ప్రదర్శన ఆకట్టుకుంది. భారతీయ సాంప్రదాయబద్ధమైన హరికథను నాలుగు నెలల పాటు పరిశోధన చేసిన ఆమె అందుబాటులో ఉన్న వాయిద్య పరికరాల సమన్వయంతో ఇటీవల కాలానికి అనుగుణంగా రూపుదిద్ది ప్రదర్శిస్తూ కథను వివరించారు. 2008లో కథలను చెప్పడం ప్రారంభించి కనుమరుగవుతున్న పాత కథలను వెలికితీస్తున్నారు. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి కథలు చెప్పే విధానాన్ని నేర్పిస్తున్నారు. నాలుగు భాషల్లో కథలు చెబుతూ 350 పైగా ప్రదర్శనలు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. కథలపై మక్కువ పెంచుకుని సున్నితమైన మెలకువలతో భారతీయ ప్రాచీన కథలను వెలికి తీసి చిన్నారులకు వివరిస్తున్నారు. వీధిబాలలు, సేవాతత్పరతతో పనిచేసే పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ కథల ద్వారా వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు సాగుతున్నారు. ప్రముఖ కథకురాలిగా గుర్తింపు లభించడంతో ప్రత్యేకంగా స్కూల్ పెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీక్లబ్ ప్రతినిధి మయాంగ్ జ్యోసింగ్, ఇంటాక్ కన్వీనర్ పివి ప్రసాద్, జయశ్రీ పలువురు చిన్నారులు, పెద్దలు పాల్గొన్నారు.
కథలెలా చెప్పాలో వివరిస్తున్న ప్రముఖ కథకురాలు దీపాకిరణ్
అక్షరాలకు ఆలంబన
అక్షరాలకు లక్షణాలు నేర్పుతున్న సృజన విశాఖ
వినూత్న కార్యక్రమాలతో యువ, వర్ధమాన కవులు, రచయితలకు ఆలంబనగా నిలుస్తోంది సృజన విశాఖ సాహితీ సంస్థ. ఉద్ధండులైన సాహితీవేత్తల దిశా నిర్దేశంలో విరామం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తూ కొత్త రచయితలు, కవులను లబ్ధప్రతిష్టులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. గోపాలపట్నం శాఖా గ్రంథాలయం వేదికగా వైవిధ్యభరితమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ సాహితీప్రియుల మన్నన అందుకుంటోంది. 2009 జనవరిలో కొంపెల్ల కామేశ్వరరావు, గుండాన జోగారావు మస్తిష్కంలో మెదిలిన ఒక సరికొత్త ఆలోచనలకు రూపమే సృజన విశాఖ. నెలకొక కార్యక్రమంతో నాలుగేళ్ల పాటు ఎన్నో చక్కటి కార్యక్రమాలకు రూపకల్పన చేసి ముందుకు సాగుతోంది. మీ భావం మీ అక్షరం, సమీక్షాక్షి, మినీ కథా సౌదామిని, వేదిక మీదే వినిపించండి, మీరు మాట్లాడగలరు, కథా సదస్సు, నాకు నచ్చిన కవిత, నాకు నచ్చిన కథ, వాక్యం మాది కథ మీది వంటి భిన్న కార్యక్రమాలతో పోటీలు నిర్వహించి విజేతలకు పుస్తక రూపేణా బహుమతులు అందజేస్తోంది. రామతీర్థ, ఎల్‌ఆర్ స్వామి, కె మల్లీశ్వరి, మంజరి, ఎంవివి సత్యనారాయణ, గౌరినాయుడు, దేవరకొండ సహదేవరావు, కెబి కృష్ణ, ప్రభాకర్‌రెడ్డి వంటి సాహితీవేత్తల సలహాలు సద్విమర్శలతో కార్యక్రమాలు రూపొందిస్తోంది. రాష్టస్థ్రాయిలో కథల పోటీ, పోస్టుకార్డు కథలు, కవితల పోటీలు నిర్వహించి విజేతలను ఘనంగా సన్మానించింది. పిల్లలకు పుస్తకాల పట్ల, కథల పట్ల గేయాలతో ఆకర్షించాలని వారికి వివిధ సందర్భాలలో పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో అక్షరాలకు లక్షణాలు నేర్చుకుని రాష్టస్థ్రాయిలో బహుమతులు పొందిన వారిలో మొదలవలస పద్మావతి, దామరాజు విశాలాక్షి, జి. సుశీలాదేవి, ఎం. మోహనకుమారి, రావులపల్లి రామలక్ష్మి, చీకోలు కిషోర్ తదితరులున్నారు. ఈ సంస్థలో గోపాలపట్నం, పెందుర్తి, బుచ్చిరాజుపాలెం, మురళీనగర్, మర్రిపాలెం, సిరిపురం తదితర ప్రాంతాలకు చెందిన సుమారు రెండు వందల మంది రచయితలు, కవులు చేరగా, అనకాపల్లి, రాజాం, సాలూరు, రాయఘడ్, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల నుండి కవులు, రచయితలు సృజన విశాఖ కార్యక్రమాలకు హాజరు కావడం విశేషం. గుండాన జోగారావు వర్తమాన అధ్యక్షుడిగా, బొల్లోజు దుర్గాప్రసాద్ కార్యదర్శిగా, కీలక సభ్యులుగా మిద్ది అప్పారావు, కె.వి. సుబ్రహ్మణ్యం, సూర్యప్రకాశరావు, కెవిఎన్ నరసింహం వంటివారితో సృజన విశాఖ సాహితీ పయనం సాగిస్తోంది.
- అనుపోజు అప్పారావు
‘నాకు నచ్చిన కథ’ శీర్షికన కథ వినిపిస్తున్న కిశోర్‌కుమార్
నూతన గ్రంథాలను ఆవిష్కరిస్తున్న సభ్యులు
కథా సమాలోచనం
సమాజానికి దర్పణం పట్టే
‘పెద్ద్భిట్ల సుబ్బరామయ్య’ రచనలు
సాహిత్య విశే్లషకుడు శివరామప్రసాద్
గత ఏడాది సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత పెద్ద్భిట్ల సుబ్బరామయ్య కథా సమాలోచనం లలితానగర్‌లోని శ్రీ లలితా పీఠంలో విశాఖ సాహితీ ఆధ్వర్యంలో ఆచార్య కె. మలయవాసిని అధ్యక్షతన జరిగింది. సీనియర్ జర్నలిస్టు, సాహిత్య విశే్లషకుడు మంగు శివరామప్రసాద్ ముఖ్య ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధోజగతి దు:ఖార్తులు, అనాథలు, అభాగ్యులు, దళితుల జీవితాలలో విషాదానే్న తప్ప ఉత్సవ వైభవం వైపు కనె్నత్తి చూడని కథకుడు సుబ్బరామయ్య అని తెలిపారు. ఆయన కథలన్నింటిలో కొట్టవచ్చినట్లు కనబడేది మానవీయ కోణమని అన్నారు. ఆయనది అస్తిత్వజనిత ప్రగతివాద వాస్తవిక దృక్పథం అని తెలిపారు. అందుకే ఆయన కథలన్నీ సైద్ధాంతిక ప్రాతిపాదిక పైనే ప్రతిష్టితమై ఉంటాయన్నారు. పెద్ద్భిట్ల సుబ్బరామయ్య 1938 డిసెంబర్ 15న ఒంగోలులో జన్మించారని తెలిపారు. 1957లో విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీలో ట్యూటర్‌గా, అధ్యాపకుడిగా, శాఖాధ్యక్షుడిగా పని చేసి 1996లో ఉద్యోగ విరమణ చేశారని అన్నారు. 1995లో ఆయన మొదటి కథ చక్రనేమి ఆంధ్రపత్రికలో అచ్చయిందన్నారు. 2012 డిసెంబర్ వరకు 200కి పైగా కథలు, 12 నవలలు రాశారని తెలిపారు. నీళ్లు, చీకటి, పూర్ణాహుతి, దగ్ధగీతం, కోదండం కల, పొగమంచు మొదలైన కథలు ఆయనకు మంచి పేరు తీసుకు వచ్చాయన్నారు. సుబ్బరామయ్య కథలు మొదటి సంపుటానికి కేంద్ర సాహిత్య అకాడమీ (2012) పురస్కారం లభించిన సందర్భంగా విశాఖ సాహితీ ఆధ్వర్యంలో ‘పెద్ద్భిట్ల సుబ్బరామయ్య కథా సాహిత్యంపై సమార్చనను నిర్వహించడం ముదావహమన్నారు. అనంతరం ముఖ్య వక్త మంగు శివరామప్రసాద్‌ను సాహితీవేత్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య పి.వి. కృష్ణయ్య, డాక్టర్ కందాళ కనక మహాలక్ష్మి, డాక్టర్ డి.వి. సూర్యారావు, టిపిఎన్ ఆచార్యులు, డాక్టర్ దేవరకొండ సహదేవరావు, కె. సర్వేశ్వరప్రసాద్, ఆచార్య బి. అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విశాఖ సాహితీ కార్యదర్శి కావిలిపాటి నారాయణరావు ప్రార్థనతో ప్రారంభమయింది.
- దుర్గాప్రసాద్ సర్కార్
9502 937 180
పెద్ద్భిట్ల కథలపై ప్రసంగిస్తున్న సాహితీ విమర్శకుడు మంగు శివరామప్రసాద్. చిత్రంలో ఆచార్య కె. మలయవాసిని
గ్రంథ పరిచయం
‘పద్యంలోని హృద్యతే కవితాత్మకు ప్రతిబింబం’
తూట బాబాజీ లబ్దప్రతిష్టులైన పద్యకవి. పదవ తరగతి చదువుతున్నప్పటి నుండే అలవోకగా పద్యాలు అల్లడం నేర్చుకున్నారు. వృత్తిరీత్యా గణిత, సామాన్యశాస్త్ర బోధకుడిగా పని చేసి, విశ్రాంత కవిగా పద్య రచన చేస్తూ వస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ మద్య ‘శ్రీగిరీశ శతకం’ రాసి ముచ్చటగా మూడవసారి మన మధ్య అడుగుపెట్టారు. ఈ శతకం నిండా సీసపద్యాలు, తేటగీతులు మనల్ని పలకరించి అలరిస్తాయి. ‘శ్రీశైల స్థలపురాణం’ పేర ఈ పద్య కథనం హృద్యంగా, దృశ్య సుందరంగా మన హృదయాలను తాకుతుంది. 130 పద్యాల రచనతో ఇది సంపుటిగా వెలువడింది.
స్వతహాగా అసుకవి అయిన తూట బాబాజీ సహజశైలిలో రాసి సుకవిగా చెరగని ముద్ర వేసుకున్నారు. ‘శ్రీశ! భ్రమరేశ! మల్లీశ! శ్రీగిరీశ!’ అనే మల్లికార్జునుని మణిమకుటంతో ఈ పద్యరచన కొనసాగింది. ఇందులో ప్రధానంగా శ్రీశైలం పుట్టుపూర్వోత్తరాలు, పురాణ కథలు, చారిత్రక విశేషాలను అట్టహాసంగా దృశ్యీకరించి ఆవిష్కరించే ప్రయత్నం చేశారు కవి. గతంలో ఉత్పలమాలతో ‘వేంకటేశ్వర శతకం’, కంద రచనతో ‘శ్రీ హనుమత్త్రిశతి’ రాసి ఇప్పటికే పలువురిని మెప్పించి ఒప్పించి ఉన్నారు. ఈ శతక కర్తకి పద్య కవితారాధన చాలా మెండు. వెన్నతో పెట్టినదిగా మారిందిపుడు. ఈ శతకంలో స్తుతితో పాటుగా స్థల ప్రస్తుతి కూడా సంతరించుకుంది. పలు ఘట్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారిందులో.
‘తే.గీ. గరళకంఠుడు! శివుడు! శాంకరి విభుండు!
హరుడు! సృష్టిలయుండు! శంకరుడు! భవుడు!
నాగభూషణునకు జేతు సతుల శతము!
శ్రీశ! భ్రమరేశ! మల్లీశ! శ్రీగిరీశ! అంటూ శివస్తుతి చెయ్యడం వెనుక కవికి భక్తి భావముతో పాటు లోతైన దృష్టి, అంతర్ముఖ పరిశీలన, ఆత్మవివేచన స్పష్టంగా మనకు గోచరిస్తుంది. పద్య కవిత్వానికి ఆయువు పట్టు అయిన శిల్ప రహస్యాన్ని సరళ సుందరంగా ఇందులో కవి బాబాజీ ఒడిసి పట్టుకున్నారు.
మరొక చోట అపకారికి సైతం ఉపకారం చేసే గుణాన్ని లక్ష్య శుద్ధిగా పాటించడంలో ఉన్న వ్యక్తిగత ఆంతర్యాన్ని ప్రత్యక్షంగా కోరుకుంటూ నివేదిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే, కొత్తకొత్త పురాణ చారిత్రక దృశ్యాలతో పాటు కథా కథన రీతితో వ్యక్తీకరించే భావ దృశ్యరూపం కొన్ని చోట్ల మనల్ని అబ్బురపరుస్తుంది.
‘సీ. ముని వశిష్ఠుని శాపమున జేసి కల్మష పాదుడు రాక్షసత్వమ్ము నొందె! వంద మంది వసిష్ఠనందనులను దిని 6బహ్మహత్యా గోరపాపమందె! పాపమ్మువోవ విశ్వామిత్రు డచ్చోట శివుని ప్రతిష్ఠించి స్తవ మొనర్చె! శాండిల్యముని మహోజ్వల తపమ్మొనరించి అంగవైకల్యమ్ము నధిగమించె!’ అంటూ చేసిన దృశ్యవర్ణన, కథనాత్మక నేపథ్యం, వక్తీకరించిన తీరు పండితుల నండి పామరుల దాకా కట్టిపడేస్తాయి. ఇతిహాస పూర్వ వృత్తాంతంలోని విషయాన్ని శిల్ప రహస్యంతో అందిపుచ్చుకునే విధానం తూట బాబాజీలోని కవితా వైశిష్ట్య ప్రతిభకు సజీవ తార్కాణంగా నిలుస్తుంది.
- రాజా చంద్రశేఖర్
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను పక్కనున్న చిరునామాకు పంపండి. రచనలు పంపాల్సిన చిరునామా : ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17.