ఇస్లామాబాద్, మార్చి 30: పాకిస్తాన్‌లో హిందూ మహిళను ఇస్లాం మతంలోకి మార్చడాన్ని నిరసిస్తూ దక్షిణ సింధ్ ప్రాంతంలో మైనారిటీ హిందూ మతస్తులు ఆందోళనకు దిగారు. ఒక హిందూ మహిళతో మత మార్పిడి చేయించి ఆమెను ఒక ముస్లిం పురుషుడికి ఇచ్చి పెళ్లి జరిపించినట్టు మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో ఆగ్రహించిన హిందువులు రోడ్లపైకొచ్చి నిరసన తెలిపారు. దక్షిణ సింధ్‌లోని జకోబాబాద్‌లోని ఝాజ్రి వీధిలో ఉంటున్న బంగారు వ్యాపారి అశోక్ కుమార్ కుమార్తె గంగకు మతమార్పిడి చేయించి ఆసీఫ్ అలీకి ఇచ్చి పెళ్లి జరిపించారు. అలీ తండ్రి బహదూర్ అలీ సుర్హియో కూడా బంగారు వ్యాపారే. అమ్‌రోట్ షరీఫ్ దర్గాలో గంగను ఇస్లాంలోకి మార్చినట్టు ‘డాన్’ పత్రిక వెల్లడించింది. గంగ పేరును అసియాగా మార్చారు. దర్గాలో మత మార్పిడి జరుగుతోందని సమాచారం అందుకున్న అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన తరలివచ్చారు. అప్పటికే వివాహం అయిపోయిందని తెలుసుకుని వెనుదిరిగిన అశోక్ కుమార్ జకోబాబాద్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేసి బలవంతంగా మతమార్చిడి చేయించి పెళ్లి జరిపించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఆసీఫ్ అలీ తండ్రి బహదూర్ అలీ, సోదరుడు మిరన్ బుక్షాలను అరెస్టు చేశారు. బలవంతపు మతమార్పిడిని నిరసిస్తూ జకోబాబాద్‌లోని హిందూ కుటుంబాలు ఆందోళనకు దిగాయి. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అప్పటివరకూ హిందూ పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తామని ప్రకటించారు. జకోబాబాద్‌లోని జనతా హాల్ నుంచి హిందూ మతస్తులు ర్యాలీగా బయలుదేరి ప్రెస్‌క్లబ్ వరకూ చేరుకున్నారు. గంగను తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించేవరకూ ఆందోళన విరమించబోమని హెచ్చరించారు.
హిందువుల ఆందోళన
english title:
conversions
Date:
Sunday, March 31, 2013