ఇస్లామాబాద్, మార్చి 30: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ విదేశాలకు వెళ్లకుండా చూడాలని పాక్ ప్రభుత్వం దేశంలోని అన్ని విమానాశ్రయాల అధికారులను ఆదేశించింది. ఎఫ్‌ఐఏ లిఖితపూర్వకంగా ఈ ఆదేశాలను జారీ చేసినట్లు టీవీ న్యూస్ చానళ్లు తెలిపాయి. ముషారఫ్‌కు వ్యతిరేకంగా దాఖలయిన కేసులను విచారిస్తున్న కోర్టుల అనుమతి తీసుకోకుండా ముషారఫ్ దేశం వదిలి వెళ్లకూడదని శుక్రవారం సింధ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎఫ్‌ఐఏ ఈ ఆదేశాలు జారీ చేసింది.
జడ్జి ముందు నిలబడినందుకు సిగ్గుపడ్డా
శుక్రవారం కరాచీ కోర్టులో జడ్జి ముందు నిలబడాల్సి వచ్చినందుకు కొద్దిగా అవమానం ఫీలయ్యానని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చెప్పారు. పలు కేసులకు సంబంధించి తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలును పొడిగించాలని కోరడం కోసం ముషారఫ్ శుక్రవారం కరాచీలోని సింధ్ హైకోర్టుకు హాజరయిన విషయం తెలిసిందే. తన జీవితంలో కోర్టుకు హాజరు కావడం ఇదే తొలిసారని ముషారఫ్ అంటూ, అప్పుడు తాను కొంత అవమానంగా, సిగ్గుగా ఫీలయిన మాట నిజమేనని అన్నారు. అయితే చట్టం అందరికీ సమానమేనని తాను ఇంతకు ముందు చెప్పే వాడినని, అది గుర్తుకు వచ్చిన తర్వాత తాను కూడా చట్టాన్ని పాటించాల్సిందేనని తనకు తాను సమాధానం చెప్పుకున్నానని ముషారఫ్ సిఎన్‌ఎన్ చానల్‌కు చెప్పారు. కోర్టు గదిలో తనపై బూటు విసిరిన సంఘటనను ప్రస్తావిస్తూ, అప్పుడు తన చుట్టూ వందల సంఖ్యలో అభిమానులున్నారని, అందువల్ల అది తనను తాకే అవకాశం ఏ కోశానా లేదన్నారు.
అన్ని విమానాశ్రయాలకు ఎఫ్‌ఐఏ ఆదేశాలు
english title:
musharraf
Date:
Sunday, March 31, 2013