న్యూఢిల్లీ, మార్చి 30: హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ సయ్యద్ లియాఖత్ షాకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశించింది. జమ్ముకాశ్మీర్‌కు చెందిన లియాఖత్ (45) దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాద దాడికి వ్యూహం పన్నాడనే ఆరోపణలపై అరెస్టయ్యాడు. మిలిటెంట్‌ను ఏప్రిల్ 12 వరకూ తీహార్ జైలుకు రిమాండ్‌కు తరలిస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (సిఎంఎం) మనోజ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. రిమాండ్ ముగిసిన తరువాత లియాఖత్‌ను కోర్టులో హాజరుపరుస్తారు. మార్చి 21 నుంచి ముజాహిదీన్ ఉగ్రవాది షాను ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు విచారిస్తున్నారు. షాను ప్రశ్నించడానికి తమకు మరింత గడువు ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. విచారణ పూర్తికానుందన లియాఖత్‌కు మరో 15 రోజులు జుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రాంతంలో ఇండో-నేపాల్ సరిహద్దులో హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజాఫరాబాద్‌లో ఉంటూ నిషేధిత హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో షా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో షా అతడి అనుచరుడు మంజూరుతో కలిసి దేశ రాజధాని ఢిల్లీలో విధ్వంసానికి కుట్ర పన్నారని వారు చెప్పారు. ఇంటరాగేషన్‌లో లభించిన సమాచారం మేరకు జమామసీదు ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి పెద్దఎత్తున ఆయుధాలు, హేండ్ గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకునట్టు పోలీసులు వెల్లడించారు. తాము తనిఖీలు చేసినప్పుడు గెస్ట్‌హౌస్ నుంచి మంజూరు పరారైయ్యాడనన్నారు. భారతీయ శిక్ష్మాస్మృతిలోని సెక్షన్ 120బి (నేరపూరిత కుట్ర), 121, 121ఎ, 123 కింద కేసు నమోదు చేసిన లియాఖత్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. షాను అరెస్టు చేయడం వల్ల పెనుముప్పు తప్పిందని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. రాజధానిలో హోలీ సందర్భంగా దాడులకు ఫిదాయా కుట్రను భగ్నం చేసినట్టు వారన్నారు. కరుడుగట్టిన మిలిటెంట్లను కూడగట్టి పాకిస్తాన్ జాతీయుల సహకారంతో దేశ రాజధానిలో దాడులకు సయ్యద్ లియాఖత్ షా కుట్ర పన్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనికోసం జమ్మూకాశ్మీర్ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు తీవ్రవాదులు వచ్చి ఢిల్లీ జమా మసీదు ప్రాంతంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో దిగినట్టు అనుమానిస్తున్నట్టు వారన్నారు. అఫ్జల్‌గురు ఉరికి ప్రతికారంగా ఢిల్లీలో దాడులకు హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.
హిజ్బుల్ మిలిటెంట్
english title:
judicial remand
Date:
Sunday, March 31, 2013