హైదరాబాద్, మార్చి 30: ఇంజనీరింగ్,
ఎంబిఎ, ఎంసిఎ సహా వృత్తి
విద్యాసంస్థల్లో ఫీజులకు సంబంధించి
యాజమాన్యాలు తమ క్లయిమ్‌లను
సమర్పించేందుకు చివరి తేదీ శనివారం
ముగియడంతో గడువును పెంచాలా
వద్దా అన్న మీమాంసతోపాటు ఎలాంటి
క్లయిమ్‌లనూ సమర్పించని కాలేజీల
పరిస్థితి ఏమిటనేదానిపై ప్రభుత్వం
మల్లగుల్లాలు పడుతోంది. సాంకేతికంగా
ఆన్‌లైన్ గడువును ఆదివారం రాత్రి
వరకూ ప్రభుత్వం పొడిగించింది. మూడు
వంతుల కాలేజీలు తమ క్లయిమ్‌లను
సమర్పించ లేదు. గత పదేళ్లుగా ఇదే
తంతు నడుస్తున్నా, ప్రభుత్వం
పెంచుతున్న ఫీజులను ఆ కాలేజీలకు
సైతం వర్తింపచేస్తూ చూసీ చూడనట్టు
వ్యవహరిస్తోంది. అయితే ఈ ఏడాది
మాత్రం యాజమాన్యాలు తమ
క్లయిమ్‌ను సమర్పించని పక్షంలో
రీయింబర్స్‌మెంట్‌కు అర్హత
సాధించబోవని ఉప ముఖ్యమంత్రి
దామోదర్ రాజనర్సింహ శనివారం
స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో
716 ఇంజనీరింగ్, 467 ఎంసిఎ,
909 ఎంబిఎ, 637 బిఇడి
కాలేజీలున్నాయి.
అయితే వీటిలో దాదాపు 500
ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు
తమ ఫీజును 35వేలు కొనసాగిస్తే
చాలని ఎఎఫ్‌ఆర్‌సికి ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేశాయి. మిగిలిన 200
కాలేజీలు మాత్రం లక్షకు అటో ఇటో
ఫీజుగా నిర్ణయించాలని కోరుతున్నాయి.
బిఇడి యాజమాన్యాలు మాత్రం 22వేల
నుంచి 29 వేల మధ్య ఫీజుగా
నిర్ణయించాలని కోరుతున్నాయి.
ఎంబిఎ, ఎంసిఎ కాలేజీలు 27 వేలు
ఫీజుగా నిర్ణయించాలని సూచించాయి.
అయితే కొన్ని పెద్ద కాలేజీలు మాత్రం
లక్ష వరకూ ఫీజు ఉండాలని
కోరుతున్నాయి. మూడొంతుల కాలేజీల
యాజమాన్యాలు ప్రభుత్వం
టాస్క్ఫోర్సుల దెబ్బకు దిగివచ్చాయి.
ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల
తరఫున ప్రదీప్‌రెడ్డి, సునీల్‌కుమార్,
ఎండి ఖలీల్, డాక్టర్ ఎస్
వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి
తదితరులు గతవారం రోజులుగా
సమావేశమై పరిస్థితిని అధ్యయనం
చేశారు. అలాగే ఫార్మసీ కాలేజీల
తరఫున టి మల్లేశం, కె రామదాస్‌లు
యాజమాన్యాలతో మాట్లాడి ప్రస్తుత
పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేక చర్యల
వల్ల ప్రయోజనం కన్నా, నష్టం ఎక్కువ
వాటిల్లుతుందని, ఈ దశలో
ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడం
ఉత్తమమని సూచించినట్టు తెలిసింది.
ఈక్రమంలో యాజమాన్యాల ప్రతినిధి
బృందం ఉప ముఖ్యమంత్రి దామోదర్
రాజనర్సింహను కలిసినట్టు సమాచారం.
యాజమాన్యాల వాదనలపై ఉప
ముఖ్యమంత్రి సానుకూలంగా
స్పందించినట్టు తెలిసింది. అధికంగా
ఫీజులు డిమాండ్ చేస్తున్న కాలేజీలపైనే
ఎక్కువ దృష్టి సారిస్తామని ఎఎఫ్‌ఆర్‌సి
అధికారులు చెబుతున్నారు.
మోహన్‌బాబు ఆగ్రహం
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలపై
ప్రభుత్వం టాస్క్ఫోర్సులను ఏర్పాటు
చేయడం హేయమైన చర్య అని
సినీనటుడు మోహన్‌బాబు తీవ్ర ఆగ్రహం
వ్యక్తం చేశారు. అవినీతిపరులు,
ప్రజలను దోచుకుంటున్న వారిపై
టాస్క్ఫోర్సులు ఏర్పాటు చేయాలని
ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్
చెల్లించమని కోరితే ప్రభుత్వం
టాస్క్ఫోర్సుల పేరుతో బెదిరించడం
దారుణమన్నారు. ప్రభుత్వ చర్యలకు
తాము భయపడేది లేదని స్పష్టం
చేశారు. అక్రమాలకు, అవినీతికి
పాల్పడే ఇంజనీరింగ్ కాలేజీల
అనుమతులను భేషరతుగా రద్దు
చేయాలని మోహన్‌బాబు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల
యాజమాన్యాల సంఘం తరఫున
ఆయన ఫిలిం చాంబర్‌లో మీడియాతో
మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్
చెల్లింపు విషయంలో ప్రభుత్వం నుంచి
స్పందన కరవైందని ఆవేదన వ్యక్తం
చేశారు. యాజమాన్య కోటాకు ఆన్‌లైన్
విధానాన్ని తొలగించాలని కోరారు.
విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలను
మోహన్‌బాబు కుటుంబం నిర్వహిస్తోంది.
(చిత్రం) మీడియాతో మాట్లాడుతున్న
మోహన్‌బాబు