కందుకూరు, మార్చి 31: జిల్లాలో ముడిబియ్యం 44,687టన్నులను, పచ్చిబియ్యం 61,818టన్నులను లక్ష్యంగా నిర్ణయించారు. ఏ గ్రేడు రకానికి క్వింటా 1280రూపాయలు, సాధారణ రకానికి క్వింటా 1250రూపాయలు ధర నిర్ణయించారు. జిల్లాలో ఉప్పడు రైస్‌మిల్లులు 20, ముడిబియ్యం రైస్ మిల్లులు 108 ఉన్నాయి. ఈఏడాది కొత్తగా 20వరకు నాన్‌గ్రేడింగ్ మిల్లులు కూడా లెవి వేస్తాయని నమోదు చేసుకున్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం ఖరీఫ్, రబీ కలిపి సుమారు లక్షా 75వేల టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేశారు. అయితే లెవిని 44.685టన్నులకు తగ్గకుండా వేయాలని ఇప్పటికే అధికారులు సంబంధించి మిల్లు యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. మిల్లు యజమానులకు ఈలక్ష్యాలు సాధించేందుకు అధికారులు గోదాములు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో మిల్లు యజమానుల నుండి ముడిబియ్యం నాణ్యమైన రకాలను నిర్ణయించిన లక్ష్యాల మేరకు వేయలేమని చెప్పారు. గత ఏడాది లక్ష్యాలను పరిశీలిస్తే 48వేల టన్నులు ముడిబియ్యం లక్ష్యం కాగా 43వేల టన్నులు, 55వేటల టన్నులు పచ్చిబియ్యం లక్ష్యం కాగా 45వేల టన్నుల లెవీ లక్ష్యాలను సాధించారు. గత ఏడాది లక్ష్యాలను అరకొరగానే సాధించారు. ఈఏడాది బియ్యం ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో లెవీ లక్ష్యాలను ఏపాటిగా సాధించగలుగుతారో చూడాలి. మిల్లర్లు కూటమి కట్టడంతో బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బిపిటి క్వింటా ధర నెల రోజుల వ్యవధిలోనే వెయ్యి రూపాయలకు పెరిగింది. ఎన్నడు లేని విధంగా ధరలు ఆకాశాన్నంటాయి. 74రకాల బియ్యం క్వింటా 3,500నుంచి ఒక్కసారిగా 4,400రూపాయలకు చేరుకుంది. మార్కెట్‌లో 25కిలోల బియ్యం బస్తా 1100లకు చేరింది. ఒక్క ఒంగోలులోనే రోజువారి సరాసరిన 8వేల క్వింటాళ్ల బియ్యం, కందుకూరు పట్టణంలో 3వేల క్వింటాళ్ళ బియ్యం దుకాణాలు, రైతు బజారులలో విక్రయిస్తున్నారు. జిల్లాలో వరిపంట తగ్గిపోవడంతో చుట్టుపక్కల గోదావరి, కృష్ణ జిల్లాల నుంచి ధాన్యం కొనుగోలుచేసి బిల్లులో పట్టించి వ్యాపారులు విక్రయిస్తున్నారు. మనబియ్యం పథకం కింద సేకరించే బియ్యం నెలనెల 10వేల టన్నులకుపైగా ఉండాలి. మన బియ్యం జిల్లాలో పండే ధాన్యం ఆజిల్లా ప్రజలకే వినియోగించాలనే ఉద్దేశంతో మనబియ్యం పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈపథకానికి లెవి సేకరణకు మిల్లర్ల నుంచి పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. ఎందుకంటే రూపాయి కిలో బియ్యం అంత్యోదయ, అన్నపూర్ణ, ఏపి రైస్ వివిధ పథకాల కింద 2,096చౌక ధరల దుకాణాల ద్వారా 10వేల టన్నులకు తగ్గకుండా వినియోగం జరుగుతుంది. డిసెంబర్ నెలలో 10,116టన్నులు, జనవరిలో 10,155టన్నులు, ఫిబ్రవరిలో 10,223టన్నులు, మార్చిలో 10,186టన్నుల బియ్యం చౌకధరల దుకాణం ద్వారా వినియోగం జరిగింది. నెలనెల 10వేల టన్నులకుపైగా బియ్యం కావాల్సి వస్తోంది. బియ్యం సేకరణ కార్యక్రమం ప్రారంభమై నెల గడిచింది. కావాల్సిన 10వేల టన్నులు కాగా, నెల పూర్తి అయిన తరువాత 1600టన్నులకు మాత్రమే మనబియ్యం కింద సేకరించగలిగారు. చౌక ధరల దుకాణాలు రాయితీపై ఇస్తున్న బియ్యం అన్నం రూపంలో తీసుకునేందుకు ఉపయోగపడడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. చౌకదుకాణాలలో కొందరు లబ్ధిదారులు రాయితీ బియ్యాన్ని తిరిగి చౌకధరల దుకాణ డీలర్‌కే తిరిగి ఇచ్చేస్తున్నారు. బియ్యం వస్తున్నందుకు కొందరు డీలర్లు తృణమో ఫలమో వారికి అందజేస్తున్నారు. బహిరంగమార్కెట్‌లో రాయితీ బియ్యం కిలో 8రూపాయలు పలుకుతుండగా, లబ్ధిదారులు బియ్యం తీసుకొని బహిరంగ మార్కెట్‌లో విడిగా విక్రయిస్తున్నారు. 20కిలోలకు 150నుంచి 200రూపాయలు ఇస్తున్నారు. వీరు పెట్టుబడి 20రూపాయలుపోను 180రూపాయల నగదు చేతికి వస్తుంది. ఇది అధికారులకు తెలిసినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో రేషన్ బియ్యానే్న పాలిష్‌చేసి కిలో 30నుంచి 35రూపాయల వరకు విక్రయిస్తున్నారు. బియ్యం ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతుండడంతో మిల్లర్ల పని మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.
జిల్లాలో ముడిబియ్యం 44,687టన్నులను, పచ్చిబియ్యం
english title:
mana biyyam
Date:
Monday, April 1, 2013