కందుకూరు, మార్చి 31: స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే పంచాయతీకి సంబంధించిన ఓటర్ల జాబితానుప్రకటించారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో 1027గ్రామ పంచాయతీలకు పంచాయతీలలో 18, 98, 388 మంది ఓటర్లు ఉన్నారు. పంచాయతీ పరిధిలో 10176 వార్డులు ఉన్నాయి. 54 మేజర్ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో 56 జడ్‌పిటిసి స్థానాలు, 926 ఎంపిటిసి స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే పంచాయతీ, మండల, మున్సిపాలిటీలకు ఎన్నికల గడువు ముగిసి రెండేళ్లకు పైగా కావస్తోంది. ప్రత్యేక అధికారుల పాలనలో సాగుతుంది. ఎట్టకేలకు ఈ ఎన్నికలు జూన్, జూలై నెలలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ముందుకు వచ్చింది. ఇప్పటికే గ్రామాలలో రాజకీయం వేడెక్కింది. రచ్చబండ రాజకీయాలు ఊపందుకున్నాయి. రాజకీయ పార్టీలు ఎవరికివారే వ్యూహ, ప్రతివ్యూహాలు రూపొందించు కుంటున్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యనే పోటీ జరిగింది. ప్రస్తుతం ఎన్నికలు కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ సిపిల మధ్య త్రిముఖ పోటీ జరగనుంది. ఇప్పటికే సమీకరణల సేకరణలో ద్వితీయ, తృతీయశ్రేణి నాయకులు నిమగ్నమై ఉన్నారు. గ్రామాలలో పట్టు సాధించేందుకు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సహకార ఎన్నికలలో ఓటమి చవిచూసిన వైఎస్‌ఆర్‌సిపి, టిడిపిలు స్థానిక సంస్థల ఎన్నికలలో అయినా తమ ప్రభావాన్ని చూపాలన్ని తహతహలాడుతూ ఇప్పటికే గ్రామస్థాయిలో పార్టీలను పటిష్టపరిచే పనిలో నిమగ్నమై ఉన్నారు. అంతేగాక బుధవారం వైఎస్‌ఆర్‌సిపి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుల ఎంపికకూడా పూర్తయ్యింది. దాంతో వైఎస్‌ఆర్‌సిపి కూడా గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు కసరత్తు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపిస్తే రానున్న మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయాన్ని సాధించవచ్చన్న సంకల్పంతో కాంగ్రెస్, టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలు ఉన్నాయి. అయితే ఇదిలా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయని రాజకీయ పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటర్లు తగిన బుద్ది చెప్పే అవకాశం ఉంది. ఓటర్లలలో కూడా రాజకీయ చైతన్యం పెరగడంతో ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ సమీకరణలు మారుతుండడంతో గ్రామస్థాయి నాయకులు ఓటర్లకు ఎరచూపే ప్రయత్నంలో ఉన్నారు. రాజకీయ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అయితే గ్రామాలలో మరింత రాజకీయ సందడి నెలకొనే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ మేథావులు భావిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు
english title:
rajakeeya partylu
Date:
Monday, April 1, 2013