ఒంగోలు , మార్చి 31: యుద్ధప్రాతిపదికన నాగార్జున సాగర్ నీటితో నగరంలోని ఎస్‌ఎస్ ట్యాంకులను నింపాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఒంగోలు నగర సమితి కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశరావు ఆధ్వర్యంలో ఆదివారం ఒంగోలు నగరంలోని తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పరిశీలించారు. దక్షిణ బైపాస్ వద్దగల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు - 2లో కనీసం మూడు అడుగుల నీరు లేకుండా పూడిక బయటపడి ట్యాంకు ఎండిపోయేందుకు సిద్ధంగా ఉందన్నారు. 2004వ సంవత్సరంలో నిర్మించిన ట్యాంకు చుట్టూ ఉన్న కాంక్రీట్ పూర్తిగా పగుళ్ళు ఏర్పడి మట్టి అంతా కిందకు జారిపోయి కుంగిపోయిందన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు - 1లో సుమారు 5 అడుగుల నీరు మాత్రమే ఉందన్నారు. ఇది నగర ప్రజానీకానికి ఒక వారం రోజులపాటు సరిపోతుందన్నారు. ప్రస్తుతం మండుతున్న ఎండల ధాటికి నీటి ఎద్దడి ముంచుకొస్తున్నప్పటికి అధికారులు తాగునీటి సమస్యపై శ్రద్ధ పెట్టకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైన యుద్ధప్రాతిపదికన ఎస్‌ఎస్ ట్యాంకులను సాగర్ నీటితో నింపాలని డిమాండ్ చేశారు. నీటి సరఫరా విషయంలో లీకులను ఆరికట్టకపోవడం వలన చాలానీరు వృథాగా పోతోందన్నారు. కొద్దికాలంగా సమాధుల తోట వద్ద పైప్‌లైన్ లీకై నీరు పోతున్నా పట్టించుకున్న నాధుడే కరవయ్యారన్నారు. ఎస్‌ఎస్ ట్యాంకు వద్ద తాగుబోతులు మందు కొడుతూ అక్కడే మందు బాటిళ్ళు పగులగొట్టడం దారుణమన్నారు. రాత్రివేళల్లో కొంతమంది యువకులు అక్కడే స్నానాలు చేస్తున్నారన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అడ్డాగా మారాయని, వెంటనే ట్యాంకుల వద్ద పోలీస్ గస్తీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. చుట్టూ ఉన్న కట్టలపై చిళ్ళచెట్లను తొలగించి వాకర్స్‌కు ఉపయోగపడే విధంగా అరుగులు నిర్మించాలని కోరారు. ఎస్‌ఎస్ ట్యాంకుల పరిసరాలలో మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఎస్ ట్యాంకులను పరిశీలించిన బృందంలో సిపిఐ నేతలు పివిఆర్ చౌదరి, చినిగే సుబ్బారావు, కొత్తకోట వెంకటేశ్వర్లు, కె అజయ్, ఎస్‌డి సర్దార్, బొమ్మిశెట్టి చంద్రశేఖర్, కందుకూరి సుభాన్ నాయుడు, కె నాగార్జున, రాజు తదితరులు పాల్గొన్నారు.
యుద్ధప్రాతిపదికన నాగార్జున సాగర్ నీటితో నగరంలోని ఎస్‌ఎస్
english title:
ss tanks
Date:
Monday, April 1, 2013