న్యూఢిల్లీ, మార్చి 31: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన సొంత పార్టీ బిజెపికే సవాలుగా పరిణమిస్తాడని కేంద్ర టెలికామ్ మంత్రి కపిల్ సిబాల్ పేర్కొన్నారు. పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్డులో నరేంద్ర మోడీకి చోటు కల్పించడం ద్వారా బిజెపి ఆయన నుంచి ఎదురవుతున్న వత్తిడితో సతమతమవుతోందని సిబాల్ అన్నారు. ‘మోడీ నుంచి ఎదురయ్యే సవాలే బిజెపికి అసలు సిసలైన సవాలు. బిజెపిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న మోడీ ఒకసారి పార్టీని తన గుప్పిట్లో పెట్టుకుంటే ఆ తర్వాత బిజెపి ఉండదు. ఎందుకంటే మోడీ మార్కు రాజకీయాలకు సిద్ధాంతాలతో సంబంధం ఉండదు. బిజెపికి ఇదే అతిపెద్ద సవాలు తప్ప మరెవరికో కాదు. తీవ్రమైన వత్తిడి కారణంగానే బిజెపి తన పార్లమెంటరీ బోర్డులో మోడీకి చోటు కల్పించింది. మున్ముందు బిజెపి మిగులుతుందో లేక మోడీ మిగులుతాడో కాలమే తేలుస్తుంది’ అని సిబాల్ పేర్కొన్నారు. నరేంద్ర మోడీకి అత్యంత నమ్మకస్తుడైన అమిత్ షాను బిజెపి ప్రధాన కార్యదర్శిగా నియమించడాన్ని కూడా సిబాల్ తప్పుబట్టారు. నైతిక విలువల గురించి నీతులు చెబుతున్న బిజెపి, న్యాయస్థానంలో తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్న అమిత్ షాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం నైతికమేనా? అని ప్రశ్నిస్తూ, ఇది బిజెపిని విధ్వంసం వైపు నడిపిస్తుందని స్పష్టం చేశారు. నైతిక విలువలకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్న బిజెపి దీనిపై ప్రజలను ఎలా ఒప్పిస్తుందని ఆయన ప్రశ్నించారు. తీవ్రమైన అభియోగాలతో అమిత్ షా న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొంటున్నారని, రేపో మాపో జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఆయనను బిజెపి ప్రధాన కార్యదర్శిగా నియమించడం ఆ పార్టీ నైజాన్ని తెలియజేస్తోందని సిబాల్ పేర్కొన్నారు.
కాగా, మే 5వ తేదీన కర్నాటక శాసనసభకు జరుగనున్న ఎన్నికలే బిజెపి ‘కొత్త జట్టు’కు తొలి పరీక్ష అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు.
కేంద్ర టెలికామ్ మంత్రి సిబాల్
english title:
b
Date:
Monday, April 1, 2013