ఒంగోలు , మార్చి 31: విద్యుత్ కోతలకు నిరసనగా భారతీయ జనతాపార్టీ జిల్లాకమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈకార్యక్రమానికి భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంవి రమణారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై 6,500 కోట్ల రూపాయలు విద్యుత్ చార్జీల రూపంలో భారం వేయడం రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌కు అవసరమైన వనరులు ఉన్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రం ప్రస్తుతం అంధకారంలో మగ్గుతోందన్నారు. ఇప్పటికే ఎన్నో చిన్నతరహా పరిశ్రమలు విద్యుత్ కోతల వల్ల పూర్తిగా మూతపడ్డాయన్నారు. పరిస్థితులు ఇదేవిధంగా కొనసాగితే ప్రజలందరు రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. ఒకపక్క మండుతున్న ఎండలు, మరోపక్క విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతుంటే పట్టించుకొనే నాధుడే కరవయ్యారన్నారు. రాష్ట్ర ప్రజలకు విద్యత్‌ను కూడా సక్రమంగా అందించలేని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏవిధంగా ఉచిత విద్యుత్ ఇస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రజల సంక్షేమంకోసం ప్రభుత్వం పనిచేయాలని, పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని, విద్యుత్ కోతలను నివారించాలని, లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ దీక్షల్లో జిల్లా బిజెపి అధ్యక్షులు ఎంవి రమణారావు, బిజెవైఎం అధ్యక్షుడు రావులపల్లి నాగేంద్ర యాదవ్ విద్యుత్ కోతలకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షను బిజెపి ఆంధ్రా ఉద్యమ కమిటీ చైర్మన్ బత్తిన నరసింహారావు, ప్రధానకార్యదర్శులు భీమనేని మీనాకుమారి, రామాంజనేయులు, నగర అధ్యక్షుడు పి రాంబాబు, జాతీయ కౌన్సిల్ సభ్యులు పివి సుబ్బన్న, విహెచ్‌పి నాయకులు జిల్లెళ్ళమూడి వెంకటేశ్వర్లు, కిసాన్‌మోర్చా నాయకులు రావి వెంకటేశ్వర్లు, నగర ప్రధానకార్యదర్శి చల్లా రాజధనవర్మ, ఎస్సీ మోర్చా నాయకులు కె శ్రీనివాసరావు, నగర నాయకులు మాదాల శ్రీనివాసరావు, కె గోపాలరెడ్డి, వి సోంబాబు, పసుమర్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా
3న వైఎస్‌ఆర్‌సిపి ధర్నాలు
ఒంగోలు , మార్చి 31: విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ఈనెల 3వ తేదీన జిల్లాలోని 12 నియోజకవర్గ కేంద్రాలలో విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ తెలిపారు. ఆదివారం స్థానిక జిల్లాపార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం అంధకారంగా మారిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎలాంటి విద్యుత్‌కోతలు లేవని, ప్రజలపై విద్యుత్ భారాలు మోపలేదని గుర్తుచేశారు. రైతులకు నిరాటంకంగా 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను అందించారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలపై 6,344 కోట్ల రూపాయల భారాలు మోపుతున్నారన్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారాలు మోపారన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలను నివారించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రైతుల పొలాలు బీడు భూములుగా మారాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అనేక భారాలు మోపుతోందని, ఇదేమని ప్రశ్నిస్తే రాజకీయ నాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో మూలనపడ్డాయన్నారు. ఈ శాపం రాష్ట్ర ప్రభుత్వానికి మామూలుగా తగలదన్నారు. ఒకపక్క వైఎస్‌ను పొగుడుతూనే మరోపక్క వైఎస్సే కారణమంటూ ప్రభుత్వం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ పెట్టిన పథకాలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను ప్రజలు భరించాల్సిందేనని మాట్లాడటం దారుణమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వ పోకడలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. తమపార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడం వల్లే రాష్ట్రం అంధకారంగా మారిందని విమర్శించారు. ఇటీవల ప్రకటించిన నియోజకవర్గాల ఇన్‌చార్జులు, సమన్వయ కమిటీ సభ్యులు ప్రత్యేక బాధ్యతలు తీసుకొని మండల కన్వీనర్‌లను, నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకొని ఈనెల 3వ తేదీన జరిగే ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ ధర్నా కార్యక్రమాలలో ప్రజలతోపాటు రైతులు విరివిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. విలేఖర్ల సమావేశంలో ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు వేమూరి సూర్యనారాయణ, జిల్లాపార్టీ అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి, ఉపాధి విభాగం జిల్లా అధ్యక్షుడు బొగ్గుల శ్రీనివాసరెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పోకల అనురాధ తదితరులు పాల్గొన్నారు.