వారణాసి, మార్చి 31: సమాజ్‌వాది పార్టీ నేతలు, కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమై వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకుంది. కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ నల్లమందు స్మగ్లింగ్ చేస్తాడని, చరస్ కూడా తీసుకుంటాడని సమాజ్‌వాది పార్టీ నాయకుడు శివపాల్ యాదవ్ ఆదివారం ఇక్కడ ఆరోపించారు.
బేణీ ప్రసాద్ చైన్‌స్మోకర్ అన్న విషయం అందరికీ తెలుసు, ఈ మధ్య ఆయన మరీ ఎక్కువ పొగతాగుతున్నారు. అంతేకాదు పొగాకులో ఆయన మరేదో కలుపుకొంటున్నారు. అందువల్ల ఆయన చికిత్స తీసుకుంటే మంచిది అని శివపాల్ యాదవ్ అన్నారు. ‘అంతేకాదు ఆయన నల్లమందును స్మగ్లింగ్ చేస్తారన్న విషయాన్ని కూడా పత్రికల్లో చదివే ఉంటారు. ఆయన తన సిగరెట్లలో చరస్‌ను కలిపి తాగుతారు. ఆయన ఈ రెండు పనులూ చాలాకాలంగా చేస్తున్నారు. అందువల్ల ఆయన మెదడు దెబ్బతిని ఉండవచ్చు’ అని శివపాల్ అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీకి యుపిలో నాలుగు సీట్లకు మించి రావని, ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ‘శవయాత్ర’ ఉంటుందంటూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణీ ప్రసాద్ వర్మ శనివారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన తర్వాత సమాజ్‌వాది పార్టీ ఆయనపై ఈ విమర్శనాస్త్రాలు సంధించింది. ‘శవయాత్ర’ వ్యాఖ్యలపై మండిపడిన సమాజ్‌వాది పార్టీ కేంద్ర మంత్రివర్గం నుంచి బేణీ ప్రసాద్‌ను తప్పించాలని ఓ వైపు డిమాండ్ చేస్తూనే మరోవైపు ఆయన మతి చలించి ఉండవచ్చని విమర్శించింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బేణీ ప్రసాద్‌ను తీవ్రంగా విమర్శిస్తూ, వాస్తవానికి యుపిలో కాంగ్రెస్‌కే నాలుగైదు సీట్లకు మించి రావని చెప్పడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో అయిదు నుంచి పది వేల ఓట్లు సంపాదించడానికి నానాఅవస్థలు పడిన పార్టీలకు లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 80 స్థానాల్లో నాలుగైదు సీట్లకన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకోలేవు’ అని అఖిలేష్ అన్నారు. కాగా, తన కుమారుడు రాకేష్ అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా రెండు సార్లు ఓడిపోవడంతో బేణీ ప్రసాద్ సమాజ్‌వాది పార్టీపై కక్ష పెంచుకున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ చెప్పడం గమనార్హం.
చరస్ కూడా తీసుకుంటారు బేణీ ప్రసాద్‌పై ఎస్‌పి వ్యక్తిగత విమర్శలు
english title:
a
Date:
Monday, April 1, 2013