Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సాగర్ నీటి కోసం సమరం

$
0
0

మార్కాపురం, మార్చి 31: నియోజకవర్గంలో ఏర్పడిన మంచినీటి ఎద్దడిని నివారించాలని మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళినా, కలెక్టర్‌కు చెప్పినా ఫలితం శూన్యమని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం దూపాడు చెరువులో పట్టణానికి తాగునీరు అందించే ఎస్‌ఎస్‌ట్యాంకును పరిశీలించిన అనంతరం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతవారంరోజుల కిందట రాష్ట్ర నీటిపారుదలశాఖమంత్రి సుదర్శన్‌రెడ్డిని కలిసి సాగర్‌నీరు విడుదల చేయకుంటే తీవ్ర నీటిఎద్దడి ఏర్పడుతుందని చెప్పామని, కలెక్టర్ నుంచి నివేదిక వస్తే నీటి విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, ఈవిషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళితే తాను చీఫ్ సెక్రటరీకి విషయాన్ని వివరించానని చెప్పినట్లు ఎమ్మెల్యే కందుల తెలిపారు. కాగా నీటిసమస్యపై జిల్లామంత్రి మానుగుంట మహీధరరెడ్డికి, ఇన్‌చార్జి మంత్రి శైలజనాథ్ దృష్టికి తీసుకువెళ్ళానని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని కందుల తెలిపారు. ప్రస్తుతం ఎస్‌ఎస్ ట్యాంకులో నీరు పూర్తిస్థాయిలో అడుగంటి ఒక్కరోజు కూడా నీరువచ్చే పరిస్థితి లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్‌నీరు వస్తే త్రిపురాంతకం మండలంలోని దూపాడు వద్ద ఎస్‌ఎస్ ట్యాంకు ద్వారా పట్టణానికి, దొనకొండ మండలంలోని లక్ష్మీపురం ట్యాంకు నుంచి మార్కాపురం రూరల్ మండలానికి, దర్శి ఎస్‌ఎస్‌ట్యాంకు ద్వారా పొదిలి ప్రాంతానికి తాగునీటి సమస్య తీరుతుందని ఎమ్మెల్యే కందుల తెలిపారు. వాస్తవ పరిస్థితులను మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 2వతేదీ నుంచి కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాలని నిర్ణయించానని కందుల తెలిపారు. ఈ ఆమరణ నిరాహార దీక్షకు మార్కాపురం నియోజకవర్గంలోని ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈయన వెంట మాజీకౌన్సిలర్లు మయూరి కాశీం, పట్టణ కార్యదర్శి అమిరుల్లాఖాన్, సుబ్బారెడ్డి, కిట్టు తదితరులు ఉన్నారు.

కరుణించమ్మా.. అల్లూరిపోలేరమ్మ
* భక్తులతో కిటకిటలాడిన ఆలయం
మార్కాపురం, మార్చి 31: మార్కాపురం పట్టణ శివారులో వెలసిన అల్లూరి పోలేరమ్మ ఉగాది జాతర ఉత్సవాలు మూడవ ఆదివారం భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. కోర్కెలు తీర్చే తల్లిగా, కల్పవల్లిగా మార్కాపురంప్రాంత వాసులు అమ్మవారిని కొలుచుట ఆనవాయితీగా వస్తుండగా భక్తుల పాలిట కొంగుబంగారంగా కోరిన వెంటనే వరాలు ఇచ్చే తల్లిగా చుట్టుపక్క ప్రాంతవాసులు అమ్మవారిని ఆరాధిస్తుండటంతో ఏటేటా అమ్మవారి ఉత్సవాల కోసం వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ప్రతిఏడాది ఉగాది పర్వదినానికి నాలుగువారాల ముందు నుంచే అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కాగా అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమై ఆదివారం నాటికి మూడు వారాలు పూర్తికావడంతో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు, అమ్మవారి శాంతికై బలిదానాలు చేసేందుకు కుంకుమబండ్లు కట్టి అలంకరించి భక్తిగీతాలతో మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయప్రాంగణం చేరి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఇష్టప్రీతమైన పొంగళి, కాయకర్పూరాలను సమర్పించుకున్నారు. ఈకార్యక్రమంలో దేవస్థానం అర్చకులు ఆవుల వెంకటేశ్వర్లు, జెవి రాంబాబు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. పోలేరమ్మ దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ ఆవుల చెన్నయ్య, ధర్మకర్తలు ఉప్పుదినె్న నరసింసులు, సిహెచ్ సుబ్బలక్ష్మీ, గోగుల పెద్దరాజయ్య, టి వెంకటచెన్నమ్మ, ఆలయ మేనేజర్ ఎవి నారాయణలు పర్యవేక్షించారు.
* కుంకుమ రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల
ఈసందర్భంగా పట్టణ ముఠావర్కర్స్ కార్మికులు ఆదివారం ఏర్పాటు చేసిన అమ్మవారి కుంకుమ రథాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ముఠా వర్కర్స్ ఎమ్మెల్యే కందులపై గులాములు చల్లి మేళతాళాలతో గాంధీబొమ్మ సెంటర్ వరకు భారీప్రదర్శన నిర్వహించారు.

విచ్చలవిడిగా అక్రమ మద్యం అమ్మకాలు
* పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
పెద్దారవీడు, మార్చి 31: పెద్దారవీడు మండలంలో ప్రభుత్వం మూడు వైన్‌షాపులను మంజూరు చేసినప్పటికీ వీటి పరిధిలో 30 బెల్టుషాపులను ఏర్పాటు చేసుకొని అక్రమంగా మద్యంను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. అంతేకాకుండా నాటుసారా ఏరులై పారుతున్నప్పటికీ ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బెల్టుషాపులను, నాటుసారా తయారీని అరికట్టాలని మహిళలు గొంతెత్తి నినాదాలు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీనితో గ్రామాల్లో మద్యంప్రియులు మహిళలపై దాడులు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావును వివరణ కోరగా సుంకేశులలో ఒకరు మృతి చెంది 10మంది అస్వస్థతకు గురైనప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్కడ ఏమి లేదని చెప్పడం విశేషం. మద్యం వ్యాపారులతో ఎక్సైజ్ అధికారులు లాలూచీపడి అక్రమంగా బెల్టుషాపులను నడుపుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
* సుంకేశులలో 27 బీరుసీసాలు స్వాధీనం
పెద్దారవీడు మండలంలోని సుంకేశుల గ్రామంలో శనివారం రాత్రి పోలీసుల దాడిలో 27 బీరుసీసాలు దొరికినట్లు మార్కాపురం సిఐ కెవి రాఘవేంద్ర ఆదివారం విలేఖరులకు తెలిపారు. మద్యం సేవించి సుంకేశుల గ్రామానికి చెందిన గువ్వల పుల్లయ్య (60) మృతి చెందాడని, ఆదివారం పంచనామా చేసి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా మరో 10మంది కూడా మద్యంసేవించి అస్వస్థతకు గురైన విషయం పాఠకులకు విదితమే. మృతుడు గువ్వల పుల్లయ్య కుమార్తె సుబ్బమ్మ తన తండ్రి నాటుసారా తాగి మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుంకేశులలో అక్రమంగా బీరుసీసాలను విక్రయిస్తున్న చిన్నబ్బిని అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు. మద్యం తాగి మృతి చెందాడని కొంతమంది, నాటుసారా తాగి మృతి చెందాడని మరికొంతమంది గ్రామస్థులు అంటున్నారని, పూర్తి దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని సిఐ రాఘవేంద్ర వివరించారు.

దేశ ప్రగతికి విద్యారంగమే మూలం
- ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి
కనిగిరి, మార్చి 31: దేశ ప్రగతికి విద్యారంగమే మూలమని శాసనమండలి సభ్యుడు వై శ్రీనివాసులురెడ్డి అన్నారు. విద్యారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్‌లో నిధులు సక్రమంగా కేటాయించడం లేదన్నారు. స్థానిక తాళ్లూరివారి కల్యాణ మండపంలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కలిగిరి కృష్ణమూర్తి పదవీవిరమణ అభినందన సభలో ఆయన మాట్లాడారు. చాలీచాలని బడ్జెట్‌తో విద్యారంగం కునారిల్లిపోతుందన్నారు. ఖాళీగా ఉన్న ఎంఇఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగ యువతీ, యువకులకు వయోపరిమితి పెంచాలన్నారు. ఉపాధి లేని యువతీ, యువకులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణమూర్తి 34 సంవత్సరాల పాటు విద్యాబుద్దులు నేర్పడంతోపాటు వామపక్ష భావాలను పుణికిపుచ్చుకొని యుటిఎఫ్‌లో కార్యకర్త నుండి రాష్ట్ర నాయకుడిగా పనిచేసి ఉపాధ్యాయులకు సేవలు అందించారని కొనియాడారు. పదవీ విరమణ చేసినప్పటికి యుటిఎఫ్ అభివృద్ధికి తోడ్పడుతూ సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ హక్కులతోపాటు బాధ్యతలు కూడా గుర్తెరిగి పనిచేయాలని ఉపాధ్యాయులను కోరారు. పనిచేసిన ప్రతిచోట ప్రజల మన్ననలను పొందాలన్నారు. అనంతరం కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్ రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో జడ్‌పిసిఇఓ కె వెంకట్రావు, డిప్యూటి డిఇఓ చాంద్‌బేగం, ఎంఇఓ సుబ్బరత్తమ్మ, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం వెంకటేశ్వరరెడ్డి, యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి రమణారెడ్డి, ఎం శ్రీనివాసులు, ముక్కు తిరుపతిరెడ్డి, ఎ రామిరెడ్డి, సూరసాని అచ్చిరెడ్డి, జనవిజ్ఞాన వేదిక జిల్లా నాయకులు వి మాలకొండారెడ్డి, మూలె బ్రహ్మారెడ్డి, శ్రీనివాసరావు, ఎం తిరుపతిరెడ్డి, స్వప్నరాజు తదితరులు పాల్గొన్నారు.

* 2 నుంచి ఆమరణ నిరాహారదీక్ష : కందుల
english title: 
kandula

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>