న్యూఢిల్లీ, మార్చి 31: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు మరో సంవత్సరంలో జరుగనున్న సమయంలో విద్యుత్ చార్జీలు పెంచటంలో ఉన్న ఔచిత్యం ఏమిటని హనుమంతరావు ఆదివారం విలేఖరుల సమావేశంలో నిలదీశారు. ముఖ్యమంత్రికి రాసిన లేఖ ప్రతిని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, ప్రత్యేక పరిశీలకుడు వాయిలార్ రవికి పంపించారు. రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి సారించి కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని కోరుతూ ఆయన రాష్ట్రానికి చెందిన పదకొండు మంది కేంద్ర మంత్రులకు ప్రత్యేక లేఖలు రాశారు. విద్యుత్ చార్జీల పెంపకం, ఇళ్ల రిజిష్ట్రేషన్ చార్జీలు, భూమి విలువ పెంచటం వలన ప్రజలపై పడుతున్న భారం, కాంగ్రెస్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేక భావం తదితర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కూడా హనుమంతరావు మరో లేఖను పంపించారు. విద్యుత్ చార్జీలు పెంచే ముందు పార్టీ స్థాయిలో ఎందుకు చర్చించలేదని నిలదీశారు. యుపిఏ ప్రభుత్వాధినేతలు సైతం కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే ముందు కాంగ్రెస్ కోర్ కమిటీలో అందరి అభిప్రాయాలు తీసుకుంటుంది. కానీ రాష్ట్రంలో మాత్రం ఇదేమీ చేయకపోవటం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాల మూలంగానే ఇలా జరుగుతోందని విమర్శించారు. ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగైదుగంటల మించి విద్యుత్ సరఫరా జరగటం లేదు, దీనికితోడు చార్జీలు ఇలా పెంచేస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. విద్యుత్ కొరత మూలంగా ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అన్ని ప్రతిపక్షాలు నిరాహార దీక్షలు నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇదేదీ పట్టించుకోకుండా ఏకంగా విద్యుత్ చార్జీలు పెంచటం ఏమిటని నిలదీశారు.
పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోండి ముఖ్యమంత్రి కిరణ్‌కు విహెచ్ లేఖ
english title:
y
Date:
Monday, April 1, 2013