న్యూఢిల్లీ, మార్చి 31: ఢిల్లీలోని వివిధ ఆస్పత్రుల్లో నమోదు చేసుకున్న 2300 మందికి పైగా హెచ్‌ఐవి సోకిన రోగులు గత ఎనిమిదేళ్ల కాలంలో మరణించారని, అయితే ఈ ఆస్పత్రుల్లో నమోదు చేసుకున్న మరో 3 వేల మంది జాడ తెలియకపోవడం, వారు ఎలా ఉన్నదీ తెలియక పోవడంతో మృతుల సంఖ్య ఇంతకన్నా ఎక్కువే ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ (డిఎస్‌ఏసిఎస్) రూపొందించిన లెక్కల ప్రకారం నగరంలోని ఆస్పత్రుల్లో ఉన్న యాంటీ రిట్రోవైరల్ థెరపీ (ఎఆర్‌టి) కేంద్రాల్లో నమోదు చేసుకున్న 2,319 మంది హెచ్‌ఐవి రోగులు చనిపోగా, మరో 2,936 మంది రోగులు చికిత్స కోసం ఈ సెంటర్లకు రావడం లేదు. ఈ రోగుల జాడ తెలియక పోవడంతో వీరిలోఎంత మంది జీవించి ఉన్నారో అధికారులు కచ్చితంగా చెప్పలేక పోతున్నారు. ‘గత ఎనిమిదేళ్ల కాలంలో మొత్తం 41,065 మంది హెచ్‌ఐవి రోగులు ఎఆర్‌టి సెంటర్లలో రిజిస్టర్ చేసుకోగా, వీరిలో ఇప్పటివరకు 2,319 మంది ఇన్‌ఫెక్షన్ కారణంగా చనిపోయారు. అలాగే మరో 2,836 మంది రోగులకు చికిత్స మొదలు పెట్టినప్పటికీ వారు మళ్లీ చికిత్సను కొనసాగించడం లేదని, ఇప్పుడు వాళ్లు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు’ అని డిఎస్‌ఎసిఎస్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎకె గుప్తా చెప్పారు. నగరంలోని ఎఆర్‌టి సెంటర్లలో చికిత్స పొందుతుండగానే ఈ రోగులంతా చనిపోయారని ఆయన చెప్పారు. ఈ కేంద్రాలు రోగులు తమ జీవన శైలిని మెరుగుపర్చుకోవడం కోసం ప్రతి నెలా ఉచితంగా మందులు అందజేస్తాయని ఆయన చెప్పారు. ఇన్‌ఫెక్షన్ తీవ్రతను బట్టి రోగులను ఎఆర్‌టి సెంటర్లలో ఉంచాలా వద్దా అనేది నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. ఢిల్లీ ఆరోగ్య అధికారులు నిర్ణయించిన నిబంధనల ప్రకారం హెచ్‌ఐవి రోగుల్లో దాదాపు సగం మంది ఈ ఎఆర్‌టి సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. అయితే చికిత్స ప్రారంభించిన రోగుల్లో మూడింట ఒకవంతుకన్నా ఎక్కువ మంది రోగులకు ప్రస్తుతం చికిత్స లభించడం లేదు.
మృతుల సంఖ్య ఎక్కువే ఉండవచ్చంటున్న అధికారులు
english title:
d
Date:
Monday, April 1, 2013