హైదరాబాద్, ఏప్రిల్ 1: ప్రజల నుండి వస్తున్న నిరసనలతో కాంగ్రెస్ పార్టీ ఆవిరి కాకముందే ముఖ్యమంత్రి మేల్కొనాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హితవు పలికారు. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ రేట్లతో ఉక్కుపాదాన్ని మోపడాన్ని నిరసిస్తూ మూడు రోజులుగా బిజెపి శాసనసభ్యులు ముగ్గురూ కిషన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక దీక్షను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పోరుదీక్ష శిబిరానికి వేలాది మంది తరలివచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటిస్తూ కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. విద్యుత్ సంక్షోభాన్ని సకాలంలో అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడం వల్లనే ఈ పరిస్థితి దాపురిచిందని, ఈ గడ్డుకాలం నుండి బయటపడేందుకు ఎలక్ట్రికల్ రెగ్యులెటరీ కమిషన్ ద్వారా అమలు చేస్తోందని అన్నారు. విద్యుత్ వినియోగదారులకు వివిధ కేటగిరిల వారీగా విభజిస్తూ 6,300కోట్ల రూపాయల బహిరంగ వసూలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఈ విషయాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తున్న బిజెపి ఉద్యమాలు చేపట్టిందన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో బిజెపికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు దీక్షకు పూనుకున్నట్టు వారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్న క్రమంలో అంతే ధీటుగా ప్రతిపక్షాలు సైతం పోరుబాటను పట్టాయని, కాంగ్రెస్‌లో కూడా అంతర్గతంగా ఉన్న విద్యుత్ విబేధాలు రచ్చకెక్కిన విషయాన్ని ముఖ్యమంత్రి గమనించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల డిమాండ్‌కు తలొగ్గి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలన్నారు. రాష్ట్రంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడటంతో కార్మికులు పూట గడవని స్థితికి వచ్చేశారని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అక్కడికి వచ్చిన నేతలు తీవ్రంగా ఖండించారు. పెరిగిన చార్జీలను ఉపసంహరించే వరకూ ఉద్యమాలను కొనసాగించాలని కోరారు. బిజెపి సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, కె శాంతారెడ్డి, సిహెచ్ విద్యాసాగరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, టి విజయలక్ష్మి, మందకృష్ణ మాదిగతోపాటు అనేక మంది ఇతర పార్టీల నేతలు కూడా దీక్షా శిబిరానికి వచ్చి తమ మద్దతు పలికారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వారిలో లోక్‌సత్తా అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, తెలంగాణ నగార సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన రెడ్డి, ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు చుక్కారామయ్య, చంద్రశేఖర్, బిసి సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తదితరులున్నారు.
బిజెపి దీక్షా శిబిరాన్ని సోమవారం రాత్రి భగ్నం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. అయితే అందుకు ప్రతివ్యూహంతో బిజెపి నేతలు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. (చిత్రం) పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక దీక్షను కొనసాగిస్తున్న బిజెపి ఎమ్మెల్యేలు. వారికి సంఘీభావం తెలుపుతున్న బిజెపి సీనియర్ నేతలు, బిసిల నేత కృష్ణయ్య.
బిజెపి దీక్షలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
english title:
cm
Date:
Tuesday, April 2, 2013