న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి సమర్థించారు. రాష్ట్ర ప్రజలు, రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే కిరణ్ విద్యుత్ చార్జీలను పెంచారని ఆమె సోమవారం ఏఐసిసి కార్యాలయంలో విలేఖరులతో అన్నారు. పెరిగిన భారం గురించి మాట్లాడుతూ ప్రజలు కొంత సర్దుకుపోవాలని సలహా ఇచ్చారు. రైతులకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిఎం తీసుకుంటున్న చర్యలను ఆమె ప్రశంసించారు. చార్జీలు పెంచకపోతే రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుండి వస్తుందని ఆమె ఎదురు ప్రశ్నవేశారు. కిరణ్ అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరవాతనే విద్యుత్ చార్జీలు పెంచాలనే నిర్ణయం తీసుకున్నారని రేణుక అభిప్రాయపడ్డారు. వర్షలు పడితే విద్యుత్ పరిస్థితి కొంత మెరుగవుతుందంటూ అప్పుడు ప్రజలపై పడ్డ భారాన్ని తొలగించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. కిరణకుమార్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ కనీసం మంత్రివర్గంలో కూడా చర్చించకుండా విద్యుత్ చార్జీలు పెంచినట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కొందరు మంత్రులు ఆరోపిస్తున్నారని చెప్పగా రాజకీయాల్లో ఇవన్నీ మామూలేనని కొట్టిపారేశారు. లోక్‌సభ, శాసన సభకు మరో ఏడాదిలో ఎన్నికలు రానుండగా విద్యుత్ చార్జీలు పెంచటం ఎంతవరకు సబబంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు అడిగిన ప్రశ్నలను ఆమె దృష్టికి తీసుకురాగా, ఎన్నికల కోసం విద్యుత్ చార్జీలు పెంచకుండా ఉంటామా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా ఆలోచించాలి కదా, అని రేణుకా చౌదరి ఎదురు ప్రశ్న వేశారు. చార్జీలు పెంపును ప్రతిపక్షాలతో పాటు కాంగ్రెస్ వాదులు కూడా వ్యతిరేకిస్తున్నారు కదా? అని ఒక విలేఖరి అనగా విద్యుత్ చార్జీల పెంచడాన్ని వ్యతిరేకించడాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ రాష్ట్రం భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా? అన్నారు. విద్యుత్ చార్జీలు పెంచక పరిశ్రమలు మూతపడితే యువత ఉపాధి కోల్పోరా? అని ఆమె ప్రశ్నించారు. రైతులకు నిలకడైన విద్యుత్‌ను ఇచ్చేందుకు కిరణ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. చార్జీలు పెంచేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం అంగీకరించిందా? అని అడగ్గా రాష్ట్రాల వ్యవహారాలను పార్టీ ఇక్కడి నుండి ఎలా నిర్వహిస్తుందని అన్నారు. రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసే ప్రతి పనికి పార్టీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందని రేణుకాచౌదరి ఎదురు ప్రశ్న వేశారు. చార్జీల పెంపుతో ఉత్పన్నమైన గడ్డు పరిస్థితులు త్వరలోనే సర్దుకు పోతాయనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.
‘తెలంగాణ’ను సొమ్ము చేసుకుంటున్నారు
కెసిఆర్‌పై రేణుకా చౌదరి ధ్వజం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పేరుతో సొమ్ము చేసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి ధ్వజమెత్తారు. సోమవారం ఆమె న్యూఢిల్లీలో విలేఖర్లతో మాట్లాడుతూ, కెసిఆర్ నాలుకకు నరం లేదని, అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతారని విమర్శించారు. ‘తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నట్లు చెబుతూ కెసిఆర్ అందరితో సర్దుబాట్లు చేసుకుంటున్నారు. డబ్బు రాబట్టుకుంటున్నారు’ అని ఆమె దుయ్యబట్టారు. కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయదని, ప్రజలే పోరాడి తెలంగాణను సాధించుకోవాలని కెసిఆర్ ఇటీవల చేసిన ప్రకటనపై రేణుకా చౌదరి మండిపడ్డారు. చంద్రశేఖరరావు నిర్వాకం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటం లేదని ఆమె ఆరోపించారు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణాలర్పించిన విషయాన్ని ఒక విలేఖరి ప్రస్తావించగా, క్షయ, గుండె నొప్పి, పలు ఇతర రోగాలతో కూడా జనం మరణిస్తున్నారని ఆమె వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను ఓడించాలంటూ కెసిఆర్ ఇచ్చిన పిలుపు గురించి ప్రశ్నించగా, కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్‌లో టిఆర్‌ఎస్ ఎందుకు ఓడిపోయిందనేది ఆయనే వివరించాలని డిమాండ్ చేశారు. ఈసారి టిఆర్‌ఎస్ ఓటమి ఖాయమని రేణుకా చౌదరి జోస్యం చెప్పారు.