హిందూపురం టౌన్, ఏప్రిల్ 1: హిందూపురం మున్సిపాలిటీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఇంటి పన్ను వసూలు లక్ష్యాన్ని చేరుకోగలిగారు. గతంలో ఇక్కడ మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ మురళీకృష్ణ గౌడ్ పర్యటించిన సందర్భంగా ఇంటి పన్నుల వసూలు విషయంలో తప్పనిసరిగా 95 శాతం లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. దీంతో మున్సిపల్ రెవెన్యూ అధికారి బాలక్రిష్ణ, ఆర్‌ఐ రాంబాబుల నేతృత్వంలో పక్కా ప్రణాళిక రూపొందించుకొని ఇంటి, నీటి పన్నులు వసూలు చేయడంతో లక్ష్యం నెరవరింది. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రైవేటు భవన సముదాయాల నుండి 2012-13 ఆర్థిక సంవత్సరానికి రూ.432.27 లక్షల ఇంటి పన్నులు వసూలు చేయాల్సి ఉండగా ఉద్యోగులు, సిబ్బంది సమిష్టి కృషితో రూ.409.92 లక్షలు వసూలు చేసి 95 శాతం లక్ష్యాన్ని చేరుకోగలిగారు. ఇంటిపన్నుల వసూలు విషయంలో మున్సిపల్ ఉన్నతాధికారులు నిక్కచ్చిగా వ్యవహరించాలని ఆదేశించారు. మొండి బకాయిలను వసూలు చేసేందుకు ఆయా బకాయిదారుల ఇళ్ల వద్ద తప్పెట్ల మోత మోయించాలని, అధికారులందరూ సామూహికంగా వెళ్ళి నిరసన తెలియచేయాలని, కోర్టు ద్వారా వసూలు చేసుకొనేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే అలాంటి ఏ ఇతరత్రా నిరసనలు వ్యక్తం చేయకుండానే 95 శాతం ఇంటి పన్నులను వసూలు చేయడం పట్ల సోమవారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్ ఎస్‌వి శివారెడ్డి ఆర్‌ఓ బాలక్రిష్ణ, ఆర్‌ఐ రాంబాబు తదితర బిల్ కలెక్టర్లు, సిబ్బందిని అభినందించారు. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించిన మిగిలిన కార్యాలయ నిర్వహణలో కూడా పాలు పంచుకోవాలని సూచించారు. ఇకపోతే నీటి పన్నును కూడా దాదాపు 76 శాతం లక్ష్యాన్ని సాధించారు. మున్సిపాలిటీకి ఈ ఆర్థిక సంవత్సరంలో నీటి పన్ను రూపేణా రూ.157.72 లక్షలు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.120.15 లక్షలను వసూలు చేయగలిగారు. అయితే ప్రభుత్వ భవన సముదాయాల నుండి ఇంటి పన్ను వసూలు చేయడంలో మాత్రం స్థానిక మున్సిపల్ అధికారులు వెనుకబడ్డారు. మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల నుండి రూ.92.01 లక్షలు ఇంటి పన్ను వసూలు కావాల్సి ఉండగా కేవలం రూ.13.10 లక్షలను మాత్రమే వసూలు చేయగలిగారు. కాగా ఇంటి, నీటి పన్నుల వసూలు విషయమై కమిషనర్ ఎస్‌వి శివారెడ్డి మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పన్నులు వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే పన్నుల వసూళ్ల కోసం పట్టణంలోని మూడు మీసేవ కేంద్రాలతోపాటు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇవ్వక మునుపే దాదాపు 70 శాతం పన్నులు చేయడం జరిగిందని, వడ్డీ మాఫీ తర్వాత పన్నుల వసూళ్లు మరింత వేగవంతంగా సాగినట్లు తెలిపారు.
హిందూపురం మున్సిపాలిటీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రెవెన్యూ అధికారులు
english title:
r
Date:
Tuesday, April 2, 2013