విజయనగరం, ఏప్రిల్ 5: రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ చార్జీలను పెంచకపోతే ఆ సేవలను నిలిపివేస్తామని రాష్ట్ర సంఘం తీసుకున్న ఏక పక్ష నిర్ణయాన్ని అప్నా జిల్లా సంఘం సభ్యులు తీవ్రంగా ఖండించారు. పేద ప్రజలకు ఆరోగ్య శ్రీ పధకం సేవలు బంద్ చేస్తామని బెదిరించడం బాధ్యతారాహిత్యమేనని వారు పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ ఐఎంఎ హాల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అప్నా (ఎపి ప్రైవేటు హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్) సంఘం జిల్లా కార్యదర్శి డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ చార్జీలు పెంచడం ద్వారా రాష్ట్ర ఖజానాపై మరింత భారం పడితే అది సామాన్యులకు గుదిబండగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో చిన్న, మధ్య తరగతి ఆసుపత్రులు ఉన్నాయని వాటి ద్వారా ఆరోగ్య శ్రీ సేవలు విస్తరించే అవకాశం ఉందన్నారు. అప్పా సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం వందలలో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులకే ఆరోగ్యశ్రీ సేవలను పరిమితం చేయడం, ఆయా నెట్ వర్క్ ఆసుపత్రుల సమస్యలకే ప్రాధాన్యమివ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆరోగ్యశ్రీలో 20 పడకల ఆసుపత్రులకు అవకాశం కల్పించడం ద్వారా మారుమూల ప్రాంతాల రోగులకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ బి.ఎస్.ఆర్.మూర్తి, డాక్టర్ మధుసూదనరావులతోపాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి వినతి
ఆరోగ్య శ్రీ సేవలను 20 పడకల ఆసుపత్రులకు విస్తరింపజేయాలని కోరుతూ 108, 104, ఆరోగ్య శ్రీ శాఖా మంత్రి కోండ్రు మురళీకి అప్నా అధ్యక్ష, రాష్ట్ర కార్యదర్శులు వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు. కాగా, ఆరోగ్య శ్రీ సేవలకు రుసుములు పెంచకపోతే ఆ సేవలను నిలిపివేస్తామని అప్నా రాష్ట్ర సంఘం పేర్కొనడాన్ని జిల్లా సంఘం ఖండించిన విషయాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇటువంటి బెదిరింపు ధోరణి బాధ్యతారాహిత్యమని వారు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ చార్జీలను పెంచకపోతే ఆ సేవలను నిలిపివేస్తామని
english title:
arogya sree
Date:
Saturday, April 6, 2013