విజయనగరం, ఏప్రిల్ 5: మనం సినిమా చూడాలంటే ముందుగా వెళ్తాం. అలాగే రైలెక్కాలన్నా ముందుగా అక్కడికి చేరుకుంటాం. విమానం ఎక్కాలన్నా ముందుగా వెళ్లాలి. లేకపోతే అవి వెళ్లిపోతాయి. ఎక్కడికైనా నిర్ణీత సమయానికే వెళ్లాలి. అలాంటిది దివంగత జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నిర్ధేశిత సమయానికి అధికారులు కానరాకపోవడం ఏమిటని ఎమ్మెల్యే అశోక్‌గజపతిరాజు ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇక్కడ అంబేద్కర్ భవన్‌లో ప్రారంభం కావల్సిన జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాలు ఆలస్యం కావడం పట్ల ఆయన ఒకింత కినుక వహించారు. ముందుగా అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే అశోక్‌గజపతిరాజు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి వెంటనే వెనుదిరిగారు. ఆ సమయానికి జెడ్పి సిఇఒ మోహనరావు, డిఆర్‌డిఎ పిడి జ్యోతి, సాంఘీక సంక్షేమాధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఎక్కడికి వెళ్లినా సమయపాలన పాటిస్తున్నాను. మా పూర్వీకులు క్రమశిక్షణ నేర్పారని బదులిచ్చారు. జగ్జీవన్‌రామ్ సమయపాలన పాటించేవారని చెప్పారు. ఆ ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టమని పేర్కొన్నారు. వెంటనే అక్కడ నుంచి బయలుదేరి వెళ్లిపోయారు.
అభిప్రాయ సేకరణకే ప్రజాబ్యాలెట్
విజయనగరం , ఏప్రిల్ 5: విద్యుత్ సమస్యలపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాబ్యాలెట్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు తెలిపారు. ప్రజాబ్యాలెట్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పెనుమత్స శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారం. అనంతరం ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పెంచిన విద్యుత్ చార్జీలు, విద్యుత్ కోతలపై ప్రజల స్పందన తెలుసుకునేందుకు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ బ్యాలెట్ ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. రాజశేఖరరెడ్డిపై ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి రెండోసారి అధికారం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ముచేస్తూ ఆయన మరణం తర్వాత విద్యుత్ చార్జీల పెంచడంతోపాటు కోతలను విధించి రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమైందని ఆరోపించారు. రాజశేఖర రెడ్డి ఆశయాలకు తూట్లు పొడిచి, రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకున్న ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని దుయ్యబట్టారు. విద్యుత్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా యువజన అధ్యక్షుడు అవనాపు విజయ్, జిల్లా ప్రచార విభాగం కన్వీనర్ గొర్లె వెంకటరమణ, పార్టీ నాయకులు సింగుబాబు, డాక్టర్ గేదెల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.