విజయనగరం , ఏప్రిల్ 5: అప్పటి ముఖ్య మంత్రి దివంగత రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కార్పొరేట్ వైద్య సంస్థల చేతుల్లో కీలుబొమ్మలా మారిందని లోక్‌సత్తాపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆరోపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఒక వరంలాంటిదని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమల్లో మాత్రం తగిన శ్రద్ధ వహించడం లేదని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకానికి ఎనిమిదివేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తున్నప్పటకి పేదవానికి అందిన వైద్యం మాత్రం వేల రూపాయల్లోనే ఉంటుందని అన్నారు. ఆరోగ్య రక్ష పథకాన్ని అమలు చేసి ప్రతి పేదవానికి ఆరోగ్య రక్ష కార్డులను అందజేసి, ఆధునికి సదుపాయాలతో ప్రతి 75 వేలమందికి 30 నుంచి 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తే కేవలం మూడువేల కోట్ల రూపాయలతో మెరుగైన వైద్యాన్ని అందజేయవచ్చని జెపి సూచించినట్లు తెలిపారు. ఈ పథకాన్ని అమలు చేయలేమని సాక్షాత్తూ ఆ శాఖ మంత్రి చేతులు ఎత్తివేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జయప్రకాష్ సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే ప్రతి పేదవానికి మెరుగైన వైద్యసేవలను అందజేయవచ్చని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కె.దయానంద్, పి.వి రమణ, ఎల్.శివరామారావులు పాల్గొన్నారు.
అప్పటి ముఖ్య మంత్రి దివంగత రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ
english title:
arogyasree
Date:
Saturday, April 6, 2013