మొదటినుండి తన చిత్రాల్లో ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకోవడం యాదృచ్ఛికంగా మారిందే కానీ, అదే ఇప్పుడు సెంటిమెంట్‌గా కూడా వర్కవుట్ అవుతోందని, ‘బాద్‌షా’ చిత్రంలో తెలంగాణ మాండలికంలో ఎన్టీఆర్ మాట్లాడటంతో ప్రేక్షకులు సరికొత్తగా ఎంజాయ్ చేస్తున్నారని, అసలు ఆ టైటిల్ పెట్టడానికి తారక్ ప్రోత్సాహం, ప్రోద్బలం కూడా ఉందని చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల తెలిపారు. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేశ్ నిర్మించిన ‘బాద్‌షా’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల పాత్రికేయులతో ముచ్చటించారు. ‘దూకుడు’ తరువాత వచ్చిన ఈ హిట్‌ను తాను ఆస్వాదిస్తున్నానని, ఆ చిత్రం తరువాత ఎలాంటి చిత్రం చేయాలా అని చాలా మదనపడిన మాట వాస్తవమేనని, అయితే ఇప్పడు లభించిన విజయంతో ఆ భయాలన్నీ పోయాయని ఆయన చెప్పారు. ‘దూకుడు’కు ‘బాద్‌షా’కు ఎటువంటి సంబంధంలేదని, ఒక్కో హీరోకు ఒక్కో విధంగా తాను కధను అల్లుకుంటానని, మహేష్ కోసం తయారుచేసిన కథ ‘దూకుడు’ కాగా, బాద్‌షా కథ ఎన్టీఆర్ కోసం తయారుచేసిందని ఆయన వివరించారు. జస్టిస్ చౌదరి గెటప్ చిత్రంలో తమ యూనిట్ అంతా అనుకొని చేసిందేనని, ఎన్టీఆర్ కూడా ఈ విషయం చెప్పిన తరువాత ఉత్సాహంతో ఆ పాత్రను పండించారని అన్నారు. బాద్‌షా చిత్రంలో మహేష్‌బాబుతో డబ్బింగ్ చెప్పడంతో ఓ హైలెట్‌గా మారిందని, ఓ హీరో గురించి మరో హీరో చెబితే ఎలా ఉంటుందా అన్న ప్రయోగం ఈ చిత్రంలో విజయం సాధించిందని, మహేష్‌బాబు కూడా తాము అడగగానే చెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. ఎం.ఎస్.నారాయణ పాత్ర రామ్‌గోపాల్‌వర్మకు కాపీగా ఉందని అనేకమంది అనడం కరెక్టు కాదని, తామసలు ఆ ఉద్దేశ్యంతో ఆ పాత్రను తీర్చిదిద్దలేదని అన్నారు. తొలిసారిగా తాను ఎన్టీఆర్‌తో చేసిన ఈ చిత్రం షూటింగ్ తొలి రోజు ఇబ్బంది పడినా ఆ తరువాత అతనితో కలిసిపోయానని, అతనికి నటన, డాన్స్, మెమరీ అద్భుతమైన వరాలని, దానివల్లనే ఆయన అగ్రహీరోగా మారారని తెలిపారు.
గణేశ్ సిన్సియర్ ప్రొడ్యూసర్‌గా తన ప్రయత్నం తాను చేస్తూ బ్లాక్‌బస్టర్ కొట్టాలన్న కృతనిశ్చయంతో పనిచేశారని, సిద్ధార్థ్ చేసిన పాత్ర ఎవరైనా హీరో చేస్తే బాగుంటుందని ఇద్దరిముగ్గురని సంప్రదించామని, కానీ ఎవరూ ముందుకురాని సమయంలో సిద్ధార్థ్‌ను అడగ్గానే ఒప్పుకొని చేశారని, ఆ పాత్ర చిత్రానికి ఆయువుపట్టుగా మారిందని, అలాగే యువ విలన్‌గా ఎవరిని పెట్టాలా అని అనుకున్న సమయంలో కాప్‌లా కనిపించిన నవదీప్‌ను ఎంచుకున్నామని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన బాంబు విస్ఫోటన సంఘటనలు చిత్రంలో ఉండడం యాదృచ్ఛిమేనని, మొదటే ఆ కథను అనుకున్న విధంగానే చేశామని, అభిమానులు సంతోషంగా ఉన్నారని ముఖ్యంగా ఎన్టీఆర్ డ్యాన్సులకు వారు కనెక్టు అయినవిధానం అద్భుతమని ఆయన అన్నారు. పరిశ్రమనుంచి కూడా మంచి మార్కులు పొందుతున్నామని, ఎన్టీఆర్ కలిసి బాద్‌షా విజయం పొందిన సంతోషంతో ఓ లాంగ్ హగ్ ఇవ్వడం తాను మర్చిపోలేని విషయమని ఆయన వివరించారు. ప్రేక్షకుడు సినిమాకు వచ్చేది వినోదం కోసమని, ముఖ్యంగా వారికి కావలసిన విధంగా చిత్రాన్ని తాను తీర్చిదిద్దానని అన్నారు. చిత్రంలో పదిహేను నిమిషాల కథ మాత్రమే ప్రేక్షకులకు కొంచెం ఇబ్బంది కలిగించి ఉండవచ్చని, మిగతా చిత్రమంతా చాలా కామెడీ, ఫన్నీ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని ఆయన అన్నారు. త్వరలో పవన్ కళ్యాణ్‌తో కూడా ఓ చిత్రం చేసే అవకాశం ఉందని, చిత్రంలో కథ ఏదేనా తన చిత్రాల్లో ఎంటర్‌టైన్‌మెంటే ప్రధానమని ఎవరెన్ని చెప్పినా హీరోను దృష్టిలో పెట్టుకుని తాను ప్రేక్షకులకు నచ్చే విధంగా చిత్రాలను అందించే ప్రయత్నం చేస్తానని ఆయన వివరించారు.
- శ్రీను వైట్ల
english title:
v
Date:
Monday, April 8, 2013