హనుమంతుడు లంకా ప్రభావము తెల్పుట
అంత కేసరి తనయుడు అంజలి బంధము పట్టి వినయోక్తులతో రామచంద్రుడితో ఈ వడువున వివరించాడు.
‘‘లంకలో మదజల ధారలు స్రవిస్తూ మిక్కిలీ మదించి పర్వతాకారాలు కలిగి రౌద్రం మఖాల వుట్టిపడే భద్రగజాలు పెక్కులు. చూపులకి అక్కజం గొల్పుతూ ఛత్రాలు, కేతనాలు రెపరెపలాడే స్యందనాలు వందలు, వేలు- వాయువేగంతో సమానంగా పరుగుపెట్టే తురంగాలు లెక్కకు మిక్కిలిగా వున్నాయి. ఆయుధధారులై నగరవీధుల కావలి కాస్తూ సంచరించే కాల్బంటులు అసంఖ్యాకులు, చిత్ర విచిత్ర వర్ణాలు, చిహ్నాలు కల టెక్కెములు ఎగురుతూ వుంటాయి. సూర్యబింబ ప్రభాపటలంగా చందంగా మణికాంతులతో వెలిగే రథాలు అధికం. వీరరస తరంగాలా అనే భాతి తనరి సాంద్రమైన వర్ణాలతో కన్నులు మిరుమిట్లు గొలిపే హేషారవాలు చెలగి ఘోటకాలు భీతిగొల్పుతాయి. ఆ హరులు వాసవుడి హరితాశ్వాల వేగాన్ని హరించగలిగే శక్తి కలవి. పిడుగులతో భీషణాలైన మేఘాలు దానవరూపం ధరించాయో అన రౌద్రంతో మెదిపి అంగము చేసిన నల్లని కొండలా- అన భ్రమగొల్పుతాయి. నీలకంఠుడు క్రోలిన హలాహలం ఈ దానవ కోటి అయినదా అనే సరణిని ప్రళయ సమయం నాటి అగ్నిధూమం రాక్షసుల అయారా అన అసంఖ్యాక రాక్షసులు వున్నారు.
రాఘవా! ఇటుక కోట, రాతి కోట, ఇనుప కోట, ఉక్కుకోట, కంచుకోట, వెండికోట, పసిడికోట’’ అనే పేరులున్న ఏడు కోటలు సమున్నతాలై తనరారుతూ వుంటాయి. యముడి వక్షం వంటి మేలైన తలుపులు దుర్భేద్యమై వుంటాయి. వాకిళ్లయందు నాల్గేసి వరమంత్ర విధులతో దివ్యాలైన శర చాపచయాలు అసంఖ్యాలయి వుంటాయి. ఆ కోట ప్రాకారాల చుట్టూ పాతాళాన్ని అంటి, నక్రగ్రాహ సంకలితాలైన నాల్గు అగడ్తలు నాల్గు దిక్కులూ వున్నాయి. ఆ నాలుగు అగడ్తలను నల్లని రాక్షస కోట్లు కావలి కాస్తూ వుంటాయి. కోట గోడలమీద నాలుగు ప్రక్కలనుంచీ శిలాబాణయంత్రాలనుంచి రాళ్లు రువ్వి శత్రువుల్ని హతమార్చే యంత్రాలు నెలకొల్పారు.
శ్రీరామా! ఇంటింటా ఓంకారాలతో అగ్నిహోత్రాలున్నాయి అని చెప్పగా రాఘవుడు నివ్వెరపోయి, చింతించాడు. అపుడు మారుతి దానవుల్లో దయ, ధర్మం, సత్యం, శౌచం ఏ కోశాన కనరావు. రావణుడు ఎడనెడ సేనతో వైభవంగా వాహ్యాళి వెడలి పర్యవేక్షిస్తూ వుంటాడు. ఆ రావణుడు రాజ్యమదాంధుడై, కయ్యానికి కాలుత్రవ్వుతూ వుంటాడు. దుర్గబలం, సేనాబలం, ఆయుధబలం, అగ్గలం అయి ఆ లంక వైరులకి లగ్గపట్టడానికి శక్యం కాదు. సముద్రములోపల జల వన కృత్రిమ స్థల శైల దుర్గాలు నాలుగూ వున్నాయి. వాటిని సమీపించడం కోసం రేవు కనపడదు. పడమటి వాకిలిని మృత్యుజిహ్వలాగు మెరిసే అత్యుగ్ర శూలాలు చేత పట్టి పదివేలమంది రక్కసులు కాపాడుతూ వుంటాయి. రావణుడు చతురంగ సేనా సమేతంగా తూర్పు మొగసాలను వుంటాడు. ఉత్తరపుద్వారాన్ని అగణిత శస్త్ర సహాయులై పెక్కండ్రు కావలి కాస్తారు. లంకానగర మధ్య వీధిని ఒక లక్షా ఇరవై వేలమంది సాయుధులై సంచరిస్తూ వుంటారు. అంతటి సురక్షితం అయిన లంకలో నేను ఆ రాక్షస యోధుల్ని పూరికికొనక చొరబడ్డాను. అట్టళ్లు కూలదన్నాను. కోటలపైకి ఎగబ్రాకాను. అగడ్తలు పూడ్చివేశాను. రాక్షసులు నివ్వెరపోయి నిశే్చష్టులయి చూస్తూ వుండగా లంకానగరాన్ని కాల్చి వచ్చాను. మరలి వచ్చి మీ శ్రీ పాద జలజాలు కనుగొనగల్గాను. అక్కడి విశేషాలన్నీ వివరంగా వినిపించాను. ఇక ఆలస్యం ఏటికి? మరి పాధోధి దాటుదాము. వనధిని లంఘించగానే కపులు లంకని క్షణంలో పెళ్లగించివేస్తాం’’ అని వాక్రుచ్చారు.
అంత రామవిభుడు సుగ్రీవుణ్ణి కని ‘‘రవి సుతా! ఇంక తడయనేల? మధ్యహ్న కాలం శుభకరం. ఈ అభిజిల్లగ్నంలో వానర సేనని దండెత్త ఆనతివ్వు. ’’ జరగాల్సినదాన్ని రాఘవుడుచెప్పడం మొదలెట్టాడు.
-ఇంకాఉంది