‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ చిత్రంతో తెలుగువారికి దగ్గరైన తెలుగు నటి అంజలి. గతంలో ‘షాపింగ్ మాల్’ చిత్రంతో పరిచయమైన ఈ అమ్మడు మొదట అలీతో ఓ చిత్రంలో హీరోయిన్‌గా నటించినా సరైన గుర్తింపు రాకపోవడంతో కోలీవుడ్‌కు వెళ్లి గుర్తింపు తెచ్చుకుంది. మంచి నటిగా వారు గుర్తించాక, టాలీవుడ్ కూడా ఆమెకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టింది. సీతమ్మవాకిట్లో చిత్రంతో లభించిన గుర్తింపుతో ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ అగ్ర కథానాయికగా మారడానికి కృషిచేస్తోంది. అయితే ఇంతలోనే చిన్న కుదుపు వచ్చింది. హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్న అంజలి చెన్నై మీడియాకు ఫోన్ చేసి తన బాధంతా ఏకరువుపెట్టింది. తాను సినిమాల్లో నటించి సంపాదించిన డబ్బంతా తన సవతి తల్లి భారతీదేవి, దర్శకుడు కళంజియం కలసి దోచేస్తున్నారని ఆరోపించింది. ఇన్నాళ్లూ తన వెంబడి వస్తున్న ఆమె తన తల్లికాదని, కేవలం డబ్బుకోసమే వారు తనను వాడుకుంటున్నారని చెబుతోంది. తా ను సంపాదించిన డబ్బంతా దోచుకోవడమే కాక, తన ప్రాణానికి హాని కూడా తలపెడుతూ తన వెనుక గోతులు తీస్తున్నారంటూ వా పోయింది. తాను సంపాదించిన డబ్బంతా ఇవ్వాలని నిత్యం వేధిస్తున్నారని పోలీసులకు తెలిపింది. వారిద్దరూ తనను వాడుకోవడానికి ఎటిఎమ్‌ను కాదని, ప్రస్తుతం వారికి దూరంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నానని తెలిపింది. డబ్బు ఇవ్వనందుకు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తాను సంపాదించిందంతా వారు దోచేయడంతో ప్రస్తుతం తన వద్ద ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఎదురైందని చెప్పారు. ఈ విషయంపై చెన్నై పోలీసు కమిషనరేట్‌కు ఫిర్యాదు ఇవ్వడానికి సిద్ధమవుతున్నానని, తన స్వంత అన్న, అక్కలతో కూడా వారు మాట్లాడనివ్వడం లేదని అంజలి ఆరోపించింది. ఈ విషయంపై సవతి తల్లి భారతీదేవిని సంప్రదిస్తే అంజలి తన అక్క కూతురని, ఆమెను 15ఏళ్ల వయసులోనే చట్ట రీత్యా దత్తత తీసుకున్నామని తెలిపారు. కన్నతల్లి కంటే ఎక్కువగా అంజలిని చూసుకున్నానని, పార్టీలకు, పబ్బులకు వెళ్ళొద్దని మందలించిన మాట నిజమేనని, అయితే వేరే ఉద్దేశంతో ఎటువంటి ఇబ్బందులకు ఆమెను గురిచేయలేదని తెలిపారు. షాపింగ్‌మాల్ విజయవంతమయ్యాక అంజలి ప్రవర్తనలో మార్పువచ్చిందని, మొదట్లో ఎంతో ప్రేమగా చూసేదని, ఇలా ఎందుకు మారిందో, ఆమె వెనుక ఎవరున్నారో తనకు తెలియదని ఆమె చెప్పుకొచ్చారు. కేవలం 20 లక్షలు మాత్రమే పారితోషికంగా తీసుకునే అంజలికి, తాము దోచుకోవడానికి కోట్లు ఎక్కడినుంచి వచ్చాయని ఆమె ప్రశ్నించారు. తాను తప్పుచేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని, అంజలి తల్లి ప్రస్తుతం గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తుందని, అక్కాచెల్లెళ్లమిద్దరం ఇప్పటికీ చాలా సఖ్యతగా మెలుగుతామని ఆమె వివరించారు. ఈ కథ ఇలా ఉండగా, సినీ దర్శకుడు కళంజియం తనపై అంజలి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, తన పరువుకు భంగం కలిగేలా మాట్లాడారని ఆరోపిస్తూ చెన్నై పోలీసులకు ఫిర్యాదుచేశారు. అంజలిని మొదటిసారిగా తమిళ తెరకు పరిచయం చేసింది తానేనని, నిరంతరం ఆమె ఎదుగుదలకోసమే తాను ప్రయత్నించానే తప్ప మరో ఉద్దేశం ఏనాడూ లేదని, కేవలం కుటుంబ స్నేహితులమే తప్ప మరేంలేదని ఆయన వివరించారు. మొత్తానికి అంజలి రేకెత్తించిన ఈ సమస్య ఎటువైపు వెళ్లనుందో కాలమే తేల్చాలి. గల్ఫ్‌లో ఉన్న ఆమె తల్లి తిరిగివస్తే కానీ ఈ ముడి వీడదేమో?!
‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ చిత్రంతో తెలుగువారికి దగ్గరైన తెలుగు నటి అంజలి.
english title:
a
Date:
Wednesday, April 10, 2013