న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: భారత యువ ఆటగాడు పారుపల్లి కశ్యప్ తాజాగా ప్రకటించిన ప్రపంచ బాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి చేరాడు. హైదరాబాద్‌కు చెందిన కశ్యప్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. పురుషుల విభాగంలో కశ్యప్ తన స్థానాన్ని క్రమంగా మెరుగుపరచుకుంటూ రావడం విశేషం. కాగా, తమిళనాడుకు చెందిన అజయ్ జయరామ్ ప్రస్తుతం 30వ స్థానంలో ఉన్నాడు. కాగా, మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఒలింపిక్ చాంపియన్ లీ జురెయ్ (చైనా) ఈ విభాగంలో నంబర్‌వన్‌గా ఉంది. సైనాతోపాటు హైదరాబాద్‌కే చెందిన పివి సింధు 16వ స్థానంలో నిలిచింది. మన దేశం తరఫున ముగ్గురు హైదరాబాదీలు ర్యాంకింగ్స్‌లో ముందంజ వేయడం విశేషం.
విజ్డెన్ క్రికెటర్ల జాబితాలో
ముగ్గురు దక్షిణాఫ్రికా క్రికెటర్లు
జొహానె్నస్‌బర్గ్, ఏప్రిల్ 11: క్రికెట్ బైబిల్‌గా పేర్కొనే విజ్డెన్ పత్రిక 2012 సంవత్సరానికిగాను ప్రకటించిన ఐదుగురు అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో ముగ్గురు దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు స్థానం దక్కింది. ‘విజ్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైన వారిలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ మార్లొన్ సామ్యూల్స్, ఇంగ్లాండ్ ఓపెనర్ నికొలాస్ కాంప్టన్‌లతోపాటు దక్షిణాఫ్రికాకు చెందిన హషీం ఆమ్లా, జాక్వెస్ కాలీస్, డేల్ స్టెయిన్ కూడా ఉన్నారు. కాంప్టన్ ఇంగ్లాండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ, అతను దక్షిణాఫ్రికాలోనే జన్మించాడు. ఈ రకంగా చూస్తే, దక్షిణాఫ్రికాకు చెందిన నలుగురు ఆటగాళ్లకు ఈ జాబితాలో స్థానం లభించింది. కాగా, విజ్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్‌గా ముగ్గురు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఎంపిక కావడం ఇది మూడోసారి. 1966లో గ్రేమ్ పొలాక్, పీటర్ పొలాక్, కొలిన్ బ్లాండ్, 2009లో డేల్ బెకెన్‌స్టెయిన్, మార్క్ బౌచర్, నీల్ మెకెన్జీ ఈ ఫీట్‌ను సాధించారు.
బగాన్ అభిమానుల జాత్యహంకారం
ముంబయి ఆటగాడు యకుబూ ఆరోపణ
కోల్‌కతా, ఏప్రిల్ 11: మొహన్ బగాన్ అభిమానులు జాత్యహంకారాన్ని ప్రదర్శించారని ముంబయి ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాడు యూసిఫ్ యకుబూ ఆరోపించాడు. ఐ-లీగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం బగాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 2-3 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అభిమానులు తనను ఉద్దేశించి ‘మంకీ.. మంకీ’ అని అరుస్తూ హేళన చేశారని గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ యకుబూ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపాడు. ఇలావుంటే, యకుబూ చేసిన ఆరోపణలను బగాన్ జట్టు మేనేజర్, ఆర్థిక కార్యదర్శి దేబశిష్ దత్తా ఖండించాడు. అలాంటి సంఘటన జరిగినట్టు తన దృష్టికి రాలేదని అన్నాడు. అభిమానులు ఈ విధంగా క్రీడాకారులను హేళన చేస్తారని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించాడు.
ఐటిపిఎల్‌లో ఆడతా: ఐసం ఖురేషి
కరాచీ, ఏప్రిల్ 11: భారత వెటరన్ ఆటగాడు మహేష్ భూపతి పర్యవేక్షణలో ఈఏడాది చివరిన జరిగే అంతర్జాతీయ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (ఐటిపిఎల్)లో పాకిస్తాన్ ఆటగాడు ఐసం ఉల్ హక్ ఖురేషి పాల్గొననున్నాడు. ఈ విషయాన్ని అతను గురువారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాడు. భారత ప్రభుత్వం ఈ టోర్నమెంట్‌కు తనను అనుమతించేదీ లేనిదీ తెలియదని పేర్కొన్నాడు.