న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, విమర్శలు, ప్రతి విమర్శలకు కారణమయ్యే ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ జెఫ్ బాయ్‌కాట్ మరోసారి తన నోటికి పని చెప్పాడు. వీరేందర్ సెవాగ్ కెరీర్‌కు ఇక తెరపడినట్టేనని, అతను మళ్లీ భారత జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశాలు లేవని వ్యాఖ్యానించి, కొత్త వివాదానికి తెరలేపాడు. సెవాగ్ వైఫల్యాల బాటలో నడుస్తున్నాడని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాయ్‌కాట్ చెప్పాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్ ఓటమిపొందిన మరుక్షణం నుంచే, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిందిగా తాను చెప్తునే ఉన్నానని అన్నాడు. ఇటీవల సెలక్టర్లు చేసిన కొన్ని మార్పులు అద్భుత ఫలితాలనిచ్చాయని గుర్తుచేశాడు. ఆస్ట్రేలియాపై భారత్ క్లీన్‌స్వీప్ సాధించడంలో యువ క్రికెటర్లే కీలక పాత్ర పోషించారని అన్నాడు. వీరంతా గొప్పగా రాణిస్తున్న తరుణంలో సెవాగ్‌కు జట్టులో స్థానం లభించడం కష్టమని బాయ్‌కాట్ పేర్కొన్నాడు. ఏ రకంగా చూసినా సెవాగ్ అంతర్జాతీయ కెరీర్ కొనసాగే అవకాశాలు లేవని స్పష్టం చేశాడు. ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌లో సెవాగ్ ఒకడని, ఈ విషయంలో మరో అభిప్రాయానికి చోటు లేదని పేర్కొన్నాడు. అయితే, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాను తన అభిప్రాయాన్ని వెల్లడించానని అన్నాడు.
బాయ్‌కాట్ సంచలన వ్యాఖ్య
english title:
boycott
Date:
Friday, April 12, 2013